నిరాడంబ‌రంగా వైవీ బర్త్‌డే

355

చిత్తూరు, మే 1 (న్యూస్‌టైమ్): తిరుమ‌ల, తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు శ‌నివారం నిరాడంబ‌రంగా నిర్వ‌హించారు. ఉద‌యం వైవీ సుబ్బారెడ్డి సతీసమేతంగా తిరుమ‌లలో స్వామివారిని ద‌ర్శించుకొని ఆశీస్సులు పొందారు. అనంత‌రం డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి, తిరుప‌తి పార్ల‌మెంట్ ఎంపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఎం. గురుమూర్తి, ప‌లువురు ఎమ్మెల్యేలు వైవీ సుబ్బారెడ్డిని క‌లిసి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వారికి సాంప్ర‌దాయ గో ఆధారిత ఎరువుల‌తో పండించిన వాటితో నైవేద్యాలు, అన్న‌ప్ర‌సాదాలు, ల‌డ్డూల‌ను నివేదిస్తున్నామ‌న్నారు. రైతుల‌ను చైత‌న్య‌ప‌రిచి గోఆధారిత ఎరువుల‌తో పంట‌లు పండించేలా చేస్తామ‌న్నారు. ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా స‌ద‌స్సులు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు.

అనేక ద‌శాబ్ధాలుగా ఉన్న అర్చ‌కుల సమ‌స్య‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప‌రిష్క‌రించార‌ని, వంశంపారంప‌ర్యం కొన‌సాగించ‌డ‌మే కాకుండా మ‌రో త‌రానికి కూడా కైంక‌ర్యం చేసే అవ‌కాశం క‌ల్పించార‌ని పేర్కొన్నారు. తిరుమ‌లే హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంగా టీటీడీ పండితుల ప‌రిష‌త్ నిర్ణ‌యించింద‌ని, ఎంతోకాలంగా చ‌రిత్ర చెప్తున్న వాటిని ఆధారాల‌తో టీటీడీ ప్ర‌క‌టించింద‌న్నారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా టీటీడీకి రూ.5 ల‌క్ష‌లు విరాళం అందించిన‌ట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హించే 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు శ‌నివారం ఉద‌యం వైభ‌వోత్స‌వ మండ‌పంలో విజ‌య‌వాడ‌కు చెందిన దాత శేఖ‌ర్‌రెడ్డి స‌హాకారంతో టిటిడి ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి హెల్త్ కిట్లు అందించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ ప్ర‌పంచాన్ని 14 నెల‌లుగా పీడిస్తున్న క‌రోనా స‌మ‌యంలో ఫ్రంట్లైన్ వారియ‌ర్స్‌గా పారిశుద్ధ్య కార్మికులు విశేష సేవ‌లందిస్తున్నార‌న్నారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో వీరు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని, భ‌క్తుల‌కు మ‌రింత మేరుగైన సేవ‌లు అందించాల‌న్నారు. ప్ర‌పంచ కార్మిక దినోత్స‌వంనాడు తిరుమ‌ల‌లో విధులు నిర్వ‌హించే పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ కిట్లు అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఇన్‌చార్జ్ ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆరోగ్య విభాగాధికారి డాక్టర్ ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాధ్‌, విజివో బాలిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా మేదరమెట్ల వైయస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా అద్దంకి ఏఎంసీ వైస్ చైర్మన్ యర్రం రత్నారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సుబ్బారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రత్నా రెడ్డి మాట్లాడుతూ వై.వి.సుబ్బారెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య సారథ్యంలో మెదరమెట్ల గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలిశమ్మ వై.వి సుబ్బారెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.