వామపక్ష మేధావుల ద్వంద్వ ప్రమాణాలు

501

అందరికి దేశం అభివృద్ధి చెందాలి అని ఉంటుంది.

అందరికీ 24 గంటల విద్యుత్తు చవగ్గా,  రైతులకు వారు పంటలు పండించుకునేందుకు వీలుగా కావలసినప్పుడు నీరు దొరకాలి అంటే అనకట్టలు,కాలవలు కట్టాలి,  విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లభ్యత కోసం ఫ్యాక్టరీలు పెట్టాలి.

గ్రామాల్లో తాగునీరు, రవాణా సదుపాయాలు అంటే రోడ్లు, రైల్వే లైన్లు, విమానాశ్రయాలు , చవకలో విద్య, వైద్యం, నివసించడానికి అందరికి అనువైన ధరల్లో ఇళ్లు కావాలి, చదువుకున్న యువతకి ఉద్యోగాలు కావాలి

వీటిలో ఏ ఒక్కటీ కావాలన్నా ప్రకృతిని వాడుకోకుండా (ధ్వంసం చెయ్యకుండా) సాధించలేము. అంటే భూములు సేకరించే అవసరం పడుతుంది, కొన్ని చెట్లను తీసి వేయవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల ప్రజలను కూడా వేరే చోటకు తరలించవచ్చు.

ఇటువంటి చర్యల వల్ల కొందరు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుకని వారు అటువంటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ వుంటారు.

ఇబ్బంది పడబోయే ప్రజలు స్వచ్ఛందంగా వీటిని వ్యతిరేకిస్తే ఒక అర్ధం ఉంది.  కానీ వీళ్ళను అడ్డుపెట్టుకొని కొన్ని ఎన్జీవోలు ప్రాజెక్టులకు అడ్డుపడుతూ వాటి నిర్మాణాన్ని శాశ్వతంగా నిలిపివేయడం గానీ లేదా వీరి ఆందోళనల వల్ల ఆ ప్రాజెక్టులు పూర్తి అవ్వడం కొన్ని సం.లు లేదా దశాబ్దాలు లేట్ అవ్వడం కానీ జరుగుతూ ప్రాజెక్ట్ కాస్టులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ దేశ ప్రజల టాక్స్ సొమ్ములు వృధా అవుతున్నాయి.

ఉదాహరణకు గుజరాత్ నర్మదా డాం కట్టడానికి వీలు లేదని మేధా పాట్కర్ ఒక పెద్ద ఉద్యమం చేసి, కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడుగడుగునా అడ్డు పడ్డారు. దీనివల్ల ఎప్పుడో నెహ్రు కాలంలో పునాది రాయి వేసిన ప్రాజెక్ట్ మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తి అయింది.

ఇలా ఎక్కడ అయినా భూమి సేకరిస్తున్నారు అంటే నాలుగు ఎర్రజెండాలు పట్టుకొని కమ్మునిస్టులు దిగిపోతారు. వారి అనుబంధ NGOస్ కూడా దిగిపోతాయి.
ఇటువంటి ఈ ఆందోళనలు వల్ల చాలా చోట్ల చాలా పరిశ్రమలు పెట్టకపోవడం కానీ వేరే చోటుకు తరలిపోవడం కానీ జరుగుతోంది. ఈ పాత ప్రదేశాలలో రైతులు,  మిగతా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడక పోగా  పరిశ్రమలు ఏ ప్రదేశానికి తలిపోయాయో ఆ ప్రదేశాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ సింగూర్ లో భూసేకరణ ఇబ్బంది వల్ల టాటా నానో కార్ల ఫ్యాక్టరీ గుజరాత్ ఆనంద్ దగ్గరకు తలిపోతే ఇప్పుడు ఆనంద్ ఒక ఆటోమొబైల్ హబ్ అయి చాల కార్ల పరిశ్రమలు వచ్చాయి.  ఇప్పుడు అక్కడ  రైతుల భూములకు విపరీతమైన విలువ పెరిగింది. కార్మికులకు వలస పోనవసరం లేకుండా అక్కడే ఉపాధి దొరికింది.

చాలా ఎన్జీవోలుకు విదేశీ నిధులు అందుతూ ఉంటాయి. ఈ నిధులు అందించే సంస్థలు వారి వారి దేశాల్లో ఇటువంటి ప్రాజెక్టులను అడ్డుకోవు. కానీ భారత్ లాటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ఎన్జీవోలకు మాత్రం డబ్బులు అందచేస్తూ ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తూ వుంటారు.

ఈ ఎన్జీఓ లకు పరోక్షంగా వామపక్ష భావజాలం గల మేధావులు, లాయర్లు, ప్రత్యక్షంగా వామపక్ష పార్టీల అనుబంధ సంస్ధల మద్దత్తు ఉంటుంది. ఈ వామపక్ష సంస్థలు ఆ ప్రదేశాల్లో ప్రత్యక్ష కార్యాచరణ అంటే బందులు, హర్తాళ్ళు, స్ట్రైక్స్ చేస్తూ ఉంటే ఫ్లైట్స్ లో తిరిగే ఆ మేధావులు తమ రచనల ద్వారా లేక కోర్ట్ కేసుల ద్వారా ఈ ప్రోజెక్టు లకు అడ్డుపడతారు.

ఒక వైపు పనిలేనివారికి ఉపాధి చూపించమంటారు. మరో వైపు ఉపాధి చూపించ గలిగే పరిశ్రమలు, ప్రాజెక్టులను అడ్డుకుంటారు.

వీరి చర్యలకు ఉదాహరణ గా తమిళనాడులో  దేశంలో పెద్ద ఎత్తున రాగి తయారుచేసే వేదాంత వారి స్టెరిలైట్ పరిశ్రమ గత సం. విస్తరిద్దామని ప్రయత్నిస్తే ఇదిగో ఈ కమ్మునిష్టులు, విదేశీ సాయం పొందుతున్న NGOs, కొన్ని చర్చ్ సంస్థలు పర్యావరణానికి హాని కలుగుతోంది అని గొడవ చేసి పోలీసు కాల్పుల దాకా తీసుకుపోయి కాల్పులలో పది మంది మరణానికి కారణం అయ్యి కోర్టులో కేస్ లు వేసి ఆ ఫ్యాక్టరీ మూసివేయించి విజయం సాధించి వికటాట్టహాసాలు చేశారు.

ఏవైనా పొల్యూషన్ వంటి ఇబ్బందులు ఉంటే వాటికి పరిష్కారాలు సూచించి ఫ్యాక్టరీ మూతపడకుండా కార్మికుల రోడ్డున పడకుండా చూడవలసిన బాధ్యత ఈ వామపక్షాల మేధావులకు లేదా?

ఈ ప్యాక్టరీ మూసివేత వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా  ఉపాధి పొందుతున్న 30,000  కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

ఈ కంపనీ మూసివేత వల్ల లాభపడ్డది ‘ చైనా’ దేశం. గత సం.లో మన రాగి అవసరాలకు సుమారు ₹16,000 కోట్ల విలువ గల రాగి చైనా నుండి దిగుమతి చేసుకున్నాం.

పెట్టుబడి దారులు కార్మికుల పొట్ట కొడుతున్నారు అని గోల చేసే వీరు స్టెరిలీట్ విషయంలో కార్మికుల పొట్ట కొట్ట లేదా?

ఇంతకీ వీళ్ళు ఎవరికోసం పనిచేస్తున్నారో
వాళ్లకు అయినా తెలుసా ?

ఇప్పుడు ఈ వేదాంత స్టెరిలీట్ రాగి పరిశ్రమ 2సం. ల బట్టి మూత పడి ఉంది. అందువల్ల బాంకులకు అప్పులు కట్టలేదు. ఈ ఖాతా మళ్లీ NPA అవుతుంది.  ఇది ఇప్పుడు అమ్ముడయ్యే అవకాశం లేదు. అవకాశం వచ్చినపుడు అమ్మితే సగం డబ్బులు కూడా బాంక్ కు రావు. అప్పుడు రైట్ ఆఫ్ లు వైవర్లు. మళ్లీ ఈ కమ్యూనిస్టు లే ఇదిగిదిగో బ్యాంకుల సొమ్ము పెద్దోళ్లకు దోచిపెడుతున్నారు అని కూతలు..

పాత చింతకాయ పచ్చడి పిడివాదాల్ని సిద్ధాంతాలను పట్టుకొని వేలాడి కార్మికులకు నిజంగా అన్యాయం చేస్తుంది “ఈ మేడే” పండగ జరుపుకునే నాయకులు మరియు మేధావులే.

వీళ్ళ మీద కడుపు మండిన ఒక రైతు ఆక్రోశం:

” నాకుంటానికి ఓ కొంప కావాల,
నా బుడ్డోళ్ళు సతూకోటానికి ఓ ఇస్కూల గావాల,
కొంపలో ఏరికైన రోగం వస్తే దవాఖాన గావాల, పంట అమ్ముకోటానికి పట్నం బోవాలంటే రోడ్డు గావాల,
అమ్మిని సూడ్డానికి టాటా పోవాలంటే రైలు బండి గావాల,
నా బుడతడికి జొరం వస్తే మందు చేసే కర్మాగారం కావాల,
ఇలా నేను బతకాలంటే సాన కర్మాగారాలు కావాల
కానీ ఆటిన్నిటిని ఆకాశంలో కట్టుకో మా భూమి మీద సెయ్యేశావో ఖబడ్దార్ .

మా పిల్లలకు ఉద్యోగాలు సూపించకపోయినా పర్లేదు ఈ బురదలో బతకటం పాతోళ్ళు మాకు అలవాటు సేసేశారుగా అలాగే బతికేస్తాం . మీ సదూకున్నోల్లు ఏసి గదుల్లో కూకొని చార్టర్డ్ ఇమానాల్లో ధర్నాలకు వొచ్చి కోట్లు కర్చుపెడుతూ మమ్మల్ని మాపిల్లల్ని
ఇలా బురద పిసుకుతూ బతికేయమని శాసించండి . ”

…..ఒక సామాన్య రైతు

ఈ వామపక్ష సంఘాల ఆందోళనలు ద్వారా ఉపాధి కోల్పోయిన వేలాది కార్మికులకు
“మే డే” శుభాకాంక్షలు.

..చాడా శాస్త్రి….