రైల్వే బోర్డు సభ్యుడిగా మొహంతి

427

న్యూఢిల్లీ, మే 1 (న్యూస్‌టైమ్): రైల్వే బోర్డు కొత్త సభ్యుడిగా (ఆపరేషన్స్ & బిజినెస్ డెవలప్మెంట్) సంజయ్ కుమార్ మొహంతి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప‌ద‌వీ రీత్యా మొహంతి భార‌త ప్ర‌భుత్వ‌పు కార్య‌ద‌ర్శి హోదాను క‌లిగి ఉన్నారు. భార‌త రైల్వే బోర్డు సభ్యునిగా బాధ్య‌త‌లు స్వీకిరంచ‌డానికి ముందు మొహంతి సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజ‌ర్‌గా ప‌ని చేశారు. సంజయ్ కుమార్ మొహంతి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి.

మొహంతి 1984 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు (ఐఆర్‌టీఎస్) అధికారి. మొహంతి భారతీయ రైల్వేలో వివిధ కీల‌క ముఖ్యమైన పోస్టులలో పనిచేశారు. ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్టేషన్)/రైల్వే బోర్డు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ & చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గాను, ఖుర్దా రోడ్ డివిజన్‌లో డివిజనల్ రైల్వే మేనేజర్‌గా ప‌ని చేశారు. మొహంతి ముంబ‌యి, నాగ్‌పూర్, ఝాన్సీ, కొంకణ్ రైల్వేలలో వివిధ సీనియర్ అధికారి హోదాల‌లో ప‌ని చేస్తూ త‌న ప్రత్యేకతను చాటారు. అక్కడ పరిపాలన, వివిధ ర‌కాల‌ రైలు కార్యకలాపాలలో ప‌లు ర‌కాల‌ ఆవిష్కరణలకు సిస్టమ్ బిల్డర్‌గా ప్రసిద్ది చెందారు. భారతీయ రైల్వే సంస్థ‌లో రైలు రవాణా విష‌య‌మై ఆయన చేసిన కృషి ఎంతో విస్తారమైనది, వైవిధ్యమైనది.