సోలీ సోరాబ్జీ కన్నుమూత

372

ముంబయి, ఏప్రిల్ 30 (న్యూస్‌టైమ్): దేశంలో కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజగా కరోనా మహమ్మారితో మరో ప్రముఖ వ్యక్తి మృతి చెందారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్‌ సోలీ జహంగీర్‌ సొరాబ్జీ (91) కన్నుమూశారు. సోరాబ్జీ కరోనాతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

1930లో ముంబయిలో జన్మించిన సొరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్‌ అడ్వకేట్‌గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా సొరాబ్జీ బాధ్యతలు సేవలందించారు. దీంతపాటు సోరాబ్జీ మానవ హక్కుల కోసం విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిపై అధ్యయనం కోసం ఐక్యరాజ్య సమితి ఆయనను ప్రతినిధిగా పంపింది. అనంతరం ఆయన ఐక్యరాజ్యసమితి ప్రమోషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఉప సంఘానికి చైర్మన్‌గా, 1998-2004 మధ్య ప్రివెన్షన్‌ ఆఫ్‌ డిస్క్రిమినేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ ఉప సంఘంలో సభ్యుడిగానూ నియమించింది. 1998-2004 మధ్య ఐరాస నియమించిన ప్రివెన్షన్‌ ఆఫ్‌ డిస్క్రిమినేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ ఉప సంఘంలో సభ్యుడిగానూ ఉన్నారు. ‘ది హేగ్‌’లోని మధ్యతర్తిత్వ న్యాయస్థానంలో 2000-2006 మధ్య శాశ్వత సభ్యుడిగా కొనసాగారు.

వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పలు కీలక కేసుల్లో సొరాబ్జీ తన వాదనలు వినిపించారు. అందులో భాగంగా అనేక ప్రచురణలపై నిషేధాన్ని ఎత్తివేయించారు. దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన లా ఆఫ్‌ ప్రెస్‌ సెన్సార్‌షిప్‌ ఇన్‌ ఇండియా, ద ఎమర్జెన్సీ, సెన్సార్‌షిప్‌ అండ్‌ ది ప్రెస్‌ ఇన్‌ ఇండియా వంటి పుస్తకాలను రచించారు. మేనకా గాంధీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1978), ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1994), బీపీ సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(2010) వంటి ల్యాండ్‌మార్క్‌ కేసుల్లో సోరాబ్జీ తన వాదనలు వినిపించారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.