రాజధానిని మూడు ముక్కలు చేయడం ఎవరి తరమూ కాదు..

350

రెండేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసాలే.
పోరాడుతున్న ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు.
రైతులకు అండగా వున్న అన్ని పార్టీలను అభినందిస్తున్నా.
మీ పోరాటంలో చివరి వరకు వుంటా
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి పోరాట వీరులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా. మీ పోరాట స్ఫూర్తి భవిష్యత్ కు మార్గదర్శి అవుతుంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఉద్యమం ఎక్కడా జరగలేదు. మీరు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వం శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని వేధించింది. ఇంట్లో వుండే వాళ్లను రోడ్డుమీదకు తెచ్చి అవమానంగా ప్రవర్తించింది. ఆడబిడ్డలన్న కనికరం కూడా లేకుండా చీరలు లాగి, లాఠీలతో కొట్టి, జైల్లో పెట్టారు. ప్రభుత్వం మానసికంగా, శారీరకంగా ఆందోళన కలిగించినా తట్టుకుని ఉద్యమాన్ని ముందుకు సాగించారు. ఇది మీ స్వార్థం కోసం చేసే ఉద్యమం కాదు. రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నాం. హైదరాబాద్ ను అభివృద్ధి చేశానన్న ఉద్దేశంతో 2014లో నాకు ప్రజలు అధికారం ఇచ్చారు. హైదరాబాద్ ను నా కోసం అభివృద్ధి చేయలేదు.

అమరావతిని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలోనైనా, ప్రపంచంలోనైనా అభివృద్ధి మొదట ఒకటి, రెండు నగరాల్లో ప్రారంభమవుతుంది. అక్కడ నుండి రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందుతుంది. అందుకే నాడు సమైక్యరాష్ట్రంలో విజన్ 20-20 ఇచ్చాను. బయోటెక్నాలజీ పార్కు కోసం జీనోమ్ వ్యాలీ క్రియేట్ చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలని సైబరాబాద్ నిర్మించాం. నేడు మనందర్ని కాపాడే వ్యాక్సిన్ జీనోమ్ వ్యాలీ నుండి వస్తుందంటే అది పబ్లిక్ పాలసీ ద్వారా నాడు ఇచ్చిన మంచి నిర్ణయం. ఆరోజు నాకెందుకు అనుకుంటే ఇంత అభివృద్ధి చేసే వాన్ని కాదు. బయోటెక్నాలజీ పార్కుకు నాడు 12 వందల ఎకరాలు ఇచ్చాం. అక్కడ ఇప్పుడు కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. చాలా గర్వంగా వుంది. వేల మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ కోసం ఐటీ తర్వాత బయోటెక్నాలజీ వుంది. కొత్తగా రాష్ట్రం వచ్చినప్పుడు పెనుసవాల్ ఎదురైంది. అధికారంలోకి రాగానే విజన్ 2029 రూపొందించి అది 2050 నాటికి ఎలా వుండాలో రూపకల్పన చేశాం. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడింది. రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో రైతులందరినీ అడిగి రాజధానికి భూమి తీసుకున్నాం. ఇక్కడ రైతాంగం చూపించిన చొరవ అభినందించాలాల్సిన విషయం. అన్ని కులాలు, అన్ని పార్టీలకు ఏకగ్రీవంగా వచ్చిన నిర్ణయం ల్యాండ్ పూలింగ్. దీన్ని ప్రపంచంలో అందరూ అభినందించారు.

ఒక ప్రభుత్వం 33 వేల ఎకరాలు కొనాలంటే అసాద్యం. 30వేల ఎకరాలకు తక్కువగా వుండవద్దని నాడు అసెంబ్లీలో వైసీపీ కూడా చెప్పింది. నాడు లేని కులం, సమస్యలు ఇప్పుడెలా వచ్చాయి? అధికారం కోసం ఏమైనా మాట్లాడుతారా?. పార్టీలు, వ్యక్తుల కోసం రాజధాని వుండదు. తరతరాల కోసం వుంటుంది. హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు దాన్ని రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ కొనసాగిస్తూ వచ్చారు తప్ప అడ్డంకులు సృష్టించలేదు. కానీ అమరావతిపై వైసీపీ వచ్చినప్పటి నుండి కుట్రలు చేస్తోంది. సాక్షాత్తూ దేశ ప్రధాని పార్లమెంట్ మట్టి, యమునా నదీ జలాలు తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుండి మట్టిని తెచ్చాం.. ఐదు కోట్ల మంది ఒప్పుకున్నారు. చర్చి, మసీదు, గుళ్లు అన్నింటిలోనూ ప్రార్థనలు చేశాం. ప్రభుత్వం చేసిన చట్టాలకు లెక్కలేకుండాపోతే ఏమనాలి.? తప్పుడు ప్రచారం చాలా చేశారు. సంపద సృష్టించి ఉద్యోగాలు ఇస్తే భవిష్యత్ వుంటుంది.

అన్ని జిల్లా కేంద్రాలు, గ్రామాలు అభివృద్ధి చేయాలి. వైసీపీ అధికారంలోకి వచ్చి రేండేళ్లు అయింది. ఇచ్చిన అవకాశం విధ్వంసం చేయాలని పెట్టుకున్నారు తప్ప ప్రజలకు మంచి చేయాలని చూడలేదు. ప్రాజెక్టులు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పం లేకుండా పోయింది. అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు. ఇది సక్రమంగా జరిగి వుంటే లక్ష నుండి రెండు లక్షల కోట్లు విలువ చేసే సంపద లభించేంది. ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడేది. రెండేళ్ల పాలనలో లక్షా 75 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రాజెక్టును చంపేసే హక్కు మీకు ఎవరిచ్చారు. ? ఇదేనా రాజ్యాంగం నేర్పించింది? స్వాంతంత్రం నేర్పిన విలువలు ఇవేనా? నిర్మించిన బిల్డింగులన్నీ నిరుపయోగంగా రెండేళ్లుగా వున్నాయి. ఏ ప్రాజెక్టు అయినా గడువులోపు నిర్మించి ఉపయోగిస్తేనే నష్టం లేకుండా వుంటుంది.

అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ నడుస్తున్నాయి. మీకు ఇంకేం కావాలి.? నిలిపేసిన భవనాలు నిర్మించి వుంటే అందరికీ వసతి అవకాశం వుండేది. ఒక నెపం పెట్టి అమరావతి నిర్మాణాన్ని నిలిపేశారు. కుల ముద్ర వేశారు. ఎస్సీలు వాళ్ల ప్రయోజనాల కోసం పోరాడితే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అసత్యప్రచారం చేశారు. ఏ చట్ట ప్రకారం నేరం జరిగిందో చెప్పలేదు. వేధించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుదోవ పట్టించారు. నాడు కేంద్రమంత్రి రాధాకృష్ణ కూడా అమరావతి నిర్మాణం జరిగితే బ్రహ్మాండమైన ప్రయోజనం వుంటుందన్నారు. నాయకుడు ఇచ్చే పాలసీ ప్రజలకు న్యాయం జరగాలి. ఒకప్పుడు ఆంద్రాలో ఒకరం అమ్మితే తెలంగాణలో మూడు ఎకరాలు కొనేవారని, కానీ ఇప్పుడ తెలంగాణలో ఎకరం అమ్మి, ఏపీలో మూడు ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ అన్నారు. రెండు ప్రాంతాలు అభివృద్ధి కావాలి. అభివృద్ధి చెందితే ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుతాయి. మూడు ముక్కలతో ఆటలాడుతున్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల విధానాన్ని తీసుకొచ్చారు. మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తప్పుడు ప్రచారం చేయడం చాలా నేరం. విశాఖ, తిరుపతి రాజధానిగా వుండి ఇప్పటి వరకు అభివృద్ధి చెందాయా? మీరు చెప్పిన మాటలు రెండేళ్లలో ఏమయ్యాయి. కర్నూలును ఏం అభివృద్ధి చేశారు? వైసీపీకి ఏం అజెండా వుందో అర్థం కావడం లేదు. విశాఖ ప్రజల్లోనూ అన్ని విధాలా ఇబ్బందులు కల్పించారు. రాష్ట్రానికి, అమరావతి రైతులకు, ప్రజలకు న్యాయం జరగాలి. దానికి ప్రజలంతా సహకరించాలి. ఎన్నికైన ప్రభుత్వం రైతులతో అవగాహనకు వచ్చి రాజధాని అభివృద్ధి చేస్తాం, భూములివ్వండి అని ఒప్పందం చేసుకున్నాక దాన్ని ఏ విధంగా అతిక్రమిస్తారు.? ఒక చిన్నపరిశ్రమకు ప్రభుత్వం ఇచ్చిన కండీషన్స్ రద్దు చేసుకుంటే నష్టపరిహారాన్ని అందిస్తుంది. నష్టపరిహారాన్ని విలువను బట్టి కాకుండా ఉన్న పరిస్థితిని బట్టి ఇస్తారు. అలాంటిది రైతులతో చేసుకున్న ఒప్పందాలపై ఏవిధంగా తప్పుకుంటారు.? అంతేకాకుండా తిరిగి రైతులు, మహిళలపై దాడులు చేస్తున్నారు. ఎస్సీలపైనా అట్రాసిటీ కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్లు చేసిన తప్పేంటి? భూములిచ్చిన రైతులు రాజధాని కావాలని అడగడం తప్పా.? ఉద్యమానికి సహకరించిన అందరినీ అభినందిస్తున్నా.

కోవిడ్ వున్నా నిబంధనలు పాటిస్తూ 500 రోజులుగా ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ఉద్యమం చల్లారుతుందని అనుకున్నారు. జైల్లో పెట్టి బెదిరిస్తే సరెండర్ అవుతారని అనుకున్నారు. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఎంత వేధిస్తే మీరు అంతలా రాటు తేలారు. మీరందరూ చేసిన త్యాగం మరువలేనిది. ఉద్యోగాలు వదిలుకుని కూడా కొందరు ఉద్యమంలోకి వచ్చారు. మీరు చేసే ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. భవిష్యత్ లో ఈ ఉద్యమం స్ఫూర్తిగా వుంటుంది. 29 వేల కుటుంబాలు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి.. అంతిమ విజయం మీదే అవుతుంది. దుర్మార్గులు దుర్మార్గాలు చేసినప్పుడు కొన్ని అనుభవించాల్సి వుంటుంది. న్యాయం, ధర్మం మీ వైపు వున్నాయి. మూడు ముక్కలు పెట్టడం ఎవరి తరమూ కాదు. రాష్ట్ర ప్రజల కలలు చెల్లాచెదరు అయ్యాయి. వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తున్నాయి. అన్ని పార్టీలను అభినందిస్తున్నా. ఎన్ఆర్ఐ లు కూడా ఉద్యమం చేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి చివరి వరకు టీడీపీఅండగా వుంటుంది..నేను కూడా మీకు అండగా వుంటా