ఇజ్రాయెల్ లో తొక్కిసలాట

493

ఉత్తర ఇజ్రాయెల్ లో జరిగిన తొక్కిసలాటలో 38 మందికి పైగా యూదులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ‘లాగ్ బొమర్ ‘ఫెస్టివల్ సందర్భంగా ‘పవిత్ర టోంబ్’ వద్ద మూడు లక్షల మందికి పైగా యూదులు గుమికూడారు.  వీరిలో వేలమంది ఇక్కడి ఓ స్టేడియంపైకి ఎక్కారని, అది   ఒక్కసారిగా  కుప్ప  కూలిందని తెలిసింది.  సుమారు 103 మందికి పైగా గాయపడ్డారని క్షతగ్రాతులను తరలించేందుకు దాదాపు  అయిదు వందలకు పైగా బస్సులను నియోగించారని మీడియా  వార్తలు తెలిపాయి. స్టేడియం నుంచి కిందికి దిగేందుకు వందలాది మంది ప్రయత్నించడంతో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగినట్టు ఇజ్రాయెల్ స్టేట్ మీడియా తెలిపింది.  మృతదేహాలను అక్కడే తెల్లని టార్పాలిన్ తో కప్పారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఎమర్జెన్సీ, అత్యవసర సర్వీసులను వినియోగించినట్టు ఈ వార్తలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని  బెంజమిన్  నెతన్యాహు  మృతుల కుటుంబాలకు  సానుభూతి తెలిపారు. ఈ ఘటనను అత్యంత దారుణమైనదిగా పేర్కొన్నారు. హెవీ డిజాస్టర్ అని ఆయన  అభివర్ణించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని  ఆదేశించారు. యూదులు ప్రతి ఏటా ఇక్కడ పవిత్ర ‘ భోగి మంటల’  వంటి మంటలు వేసి తమ  సంప్రదాయాన్ని పాటిస్తారు. దీనికి హాజరయితే శుభం జరుగుతుందని నమ్ముతారు .కాగా తొక్కిసలాట ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. లాగ్ బొమర్ ఘటన పట్ల పలు దేశాలు విచారం ప్రకటించాయి.  కాగా ఇప్పటికీ అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది.  అనేక మృతదేహాలు అక్కడే పడివున్నాయి.