ప్రముఖ చిత్రకారుడు కన్నుమూత

346

ప్రముఖ చిత్రకారుడు, రచయిత, ఆర్ట్ డైరెక్టర్ చంద్ర (74) అనారోగ్యంతో ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో కన్నుమూశారు. వరంగల్ జిల్లాకు చెందిన రంగయ్య, సోమలక్ష్మీ దంపతులకు చంద్రశేఖర్ ఆగస్ట్ 28, 1946లో జన్మించారు. సర్వశ్రీ శేషగిరిరావు, బాపు, సత్యమూర్తి స్ఫూర్తితో ఆయన చిత్రలేఖనం వైపు అడుగులు వేశారు. యుక్తవయసు నుండే రేఖా చిత్రాలు గీయడం ప్రారంభించారు. బాపు తర్వాత ఆ స్థాయిలో విరివిగా వార, మాస పత్రికలకు బొమ్మలు గీసిన ఖ్యాతి చంద్రకే దక్కుతుంది. విరసంలోనూ కొంతకాలం యాక్టివ్ గా ఉన్న చంద్ర తర్వాత దానికి దూరమయ్యారు. పలు పత్రికలకు బిజీగా బొమ్మలు గీస్తూనే, కేతు విశ్వనాథ రెడ్డి గారి కోరిక మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేశారు. బి. నరసింగరావుతో ఉన్న అనుబంధంతో ఆయన చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడమే కాకుండా కొన్ని సినిమాలలో నటించారు. మరికొన్ని చిత్రాలలో అతిథి పాత్రలు సైతం పోషించిన చంద్ర,  టీవీ సీరియల్స్ ను డైరెక్ట్ చేశారు.  చక్కని కథలూ రాశారు. అలానే వేలాది కార్టూన్ల గీశారు. ఆయన షష్టి పూర్తి సందర్భంగా 2006లో ‘చంద్ర కార్టూన్లు’ పుస్తకం విడుదల కాగా, వాహిని బుక్ ట్రస్ట్ సంస్థే 2013లో చంద్ర డస్ట్ బిన్ కార్టూన్లు ను ప్రచురించింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా 2016లో మిత్రులంతా ఆయనతో ఉన్న అనుభవాలను ‘ఒక చంద్రవంక’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. నాలుగు దశాబ్దాల పాటు నలుపు తెలుపులో ఇలస్ట్రేషన్స్, రంగుల్లో బొమ్మలు, కార్లూన్లు, పెయింటింగ్స్, గ్రీటింగ్ కార్డులు, లోగోలు గీసిన చంద్రకు  దేశ విదేశాలలో కోట్లాది మంది అభిమానులు వున్నారు. వేల సంఖ్యలో నవలలకు కవర్ పేజీలు వేశారు. దశాబ్దాల పాటు వార ప్రతికలకు పండగ సమయాల్లో కవర్ పేజీలు గీశారు. ఇక ఆయన కథలకు, కవితలకు ఆయన వేసిన బొమ్మలు లెక్కపెట్టలేనన్ని. కొంతకాలంగా ఆయన సికింద్రాబాద్ కార్ఖానాలోని మదర్ దెరిస్సా హెల్త్ కేర్ సెంటర్ లో ఉంటున్నారు. చంద్రకు భార్య భార్గవితో పాటు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.