కోవిడ్‌పై వాయుసేన సేవల సమీక్ష

291

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో ఎయర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదౌరియా సమావేశమయ్యారు. కోవిడ్-19 నేపథ్యంలో భారతీయ వాయు సేన (ఐఏఎఫ్) చేపడుతున్న ప్రయాసలను గురించి ఆయన ప్రధాన మంత్రికి వివరించారు. దేశ వ్యాప్తంగాను, విదేశాలలోను కోవిడ్‌కు సంబంధించిన పనులను అన్నిటిని శరవేగంగా పూర్తి చేయడం కోసం హబ్ ఎండ్ స్పోక్ మోడల్‌లో పనిచేయడానికి వారం రోజులలో ప్రతి రోజూ ప్రతి క్షణం సిద్ధంగా ఉండవలసిందంటూ ఐఏఎఫ్‌లోని యావత్తు హెవీ లిఫ్ట్ ఫ్లీట్‌తో పాటు మీడియమ్ లిఫ్ట్ ఫ్లీట్‌లో చాలా వరకు యుద్ధవిమానాల సిబ్బందికి ఆదేశాలను ఇవ్వడమైందని ప్రధానమంత్రి దృష్టికి ఎయర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదౌరియా తీసుకువచ్చారు. కార్యకలాపాల నిర్వహణ రాత్రింబగళ్లు నిరంతరాయంగా కొనసాగేటట్టు చూడడానికి గాను అన్ని విమానాల సిబ్బందిని పెంచడమైంది.

ఆక్సిజన్ టాంకర్లను, ఇతర అత్యవసర సామగ్రిని చేరవేసే కార్యకలాపాలలో వేగాన్ని, స్థాయిని, భద్రతను పెంచవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. కోవిడ్ సంబంధి కార్యాలలో తలమునకలైన ఐఏఎఫ్ సిబ్బంది సంక్రమణ బారిన పడకుండా తగిన జాగ్రత చర్యలను పాటించాలని కూడా ప్రధాన మంత్రి సూచించారు. అలాగే కోవిడ్ సంబంధి కార్యాలన్నిటిలో భద్రతకు పెద్దపీట వేయాలని కూడా ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలను చుట్టి రావడానికి ఐఏఎఫ్ పెద్ద, మధ్య తరహా యుద్ధ విమాన సముదాయాలను రంగంలోకి దింపుతున్నట్లు ఎయర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదౌరియా తెలిపారు. కోవిడ్ సంబంధి కార్యకలాపాలలో వివిధ మంత్రిత్వ శాఖలతోను, ఏజెన్సీల తోను శీఘ్రతర సమన్వయాన్ని ఏర్పరచుకోవడం కోసం ఐఏఎఫ్ ప్రత్యేకంగా ఒక కోవిడ్ ఎయర్ సపోర్ట్ సెల్‌ను ఏర్పాటు చేసిందని కూడా ఆయన ప్రధాన మంత్రితో చెప్పారు.

ఐఎఎఫ్ సిబ్బంది ఆరోగ్యం, ఐఏఎఫ్ సిబ్బంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఎలా ఉందని ప్రధానమంత్రి అడిగి తెలుసుకొన్నారు. ఐఎఎఫ్‌లో దాదాపుగా అందరికీ టీకా మందు రక్షణను సమకూర్చడమైందని ఎయర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్. భదౌరియా చెప్పారు. ఐఏఎఫ్ పరిధిలోని ఆసుపత్రులు కోవిడ్ సంబంధి సదుపాయాలను పెంచుకొన్నాయని, అంతే కాకుండా అవి వీలయినన్ని చోట్ల పౌరులకు కూడాను సేవలను అందిస్తున్నాయని ఆయన ప్రధానమంత్రికి వివరించారు.