‘విద్యార్థుల భద్రత మా బాధ్యత’

292

అమరావతి, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వ బాధ్యత అని, అన్ని జాగ్రత్తలతో ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించనున్నామని, ప్రతి రోజూ పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ చేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ మే 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలను నిర్వహించనున్నామన్నారు. ప్రతి జిల్లాకు కోవిడ్‌ స్పెషల్‌ అధికారిని నియమించామని, అంతేకాకుండా కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై డేగ కళ్లతో పర్యవేక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతేడాదితో పోల్చితే 41 పరీక్షా కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1452 ఎగ్జామ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు, విద్యార్థుల ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. క్వశ్చన్‌ పేపర్లు ఇప్పటికే ముద్రించి సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు చేరవేస్తున్నామని, గతేడాది కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితిలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించుకున్నామని, గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం అదనంగా 41 సెంటర్లను ఏర్పాటు చేశామని, 1452 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

‘‘జిల్లాల వారీగా సెంటర్లను తీసుకుంటే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 146 ఎగ్జామ్‌ సెంటర్లు, అతి తక్కువగా గుంటూరు జిల్లాలో 60 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. కృష్ణా జిల్లాలో 65, గుంటూరు జిల్లాలో 60, పశ్చిమ గోదావరి 107, విశాఖ 116, శ్రీకాకుళం 113, నెల్లూరు 90, అనంతపురం 94, కడప 74, విజయనగరం 65 ఈ విధంగా మొత్తం 1452 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాయంత్రం నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టికెట్లు పొందవచ్చు. ప్రతి ఎగ్జామ్‌ సెంటర్‌లో కోవిడ్‌ నివారణ చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి జిల్లాకు ఒక కోవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాం. ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దగ్గర కోవిడ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై డేగ కళ్లతో పర్యవేక్షించడానికి స్క్వాడ్స్, స్పెషల్‌ మొబైల్‌ పార్టీస్, మొబైల్‌ మెడికల్‌ వ్యాన్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సెంటర్‌కు మినిమమ్‌ ఒక థర్మల్‌ స్కానర్స్, లేదా 2–3 స్కానర్లు, మాస్కులు సిద్ధంగా ఉంచుతాం.’’ అని తెలిపారు.

‘‘మొత్తం పరీక్షా కేంద్రాన్ని సోడియం హైపోక్లోరైడ్‌తో ప్రతి రోజూ శానిటైజ్‌ చేస్తారు. మెడికల్‌ డిపార్టుమెంట్‌ నుంచి ప్రతి సెంటర్‌లో ఫారా మెడికల్‌ స్టాఫ్‌ను ఏర్పాటు చేయనున్నాం. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక ఐసోలేషన్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. గేట్‌ వద్ద థర్మల్‌ స్కానింగ్‌తో పరీక్షిస్తారు.. కొంచెం సిమ్‌టమ్స్‌ కనిపించినా విద్యార్థులను ఐసోలేషన్‌ రూమ్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించనున్నాం. ఐసోలేషన్‌ రూమ్‌లో ఇన్విజిలేషన్‌ చేసే స్టాఫ్‌కు పీపీఈ కిట్లు అందించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వ బాధ్యత. పరీక్షల నిర్వహణ గురించి సీఎం వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారు. రద్దు చేయండి అని చెప్పడం చాలా సులువు. పిల్లల భవిష్యత్తుకు పరీక్షలు ముఖ్యం. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాస్‌ సర్టిఫికెట్‌తో కలిగే ఇబ్బందుల గురించి సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టంగా వివరించారు. పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది, ఎవరూ ఆందోళనకు గురికావొద్దు’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు.