కరోనా చికిత్స దోపిడీపై కసిరెడ్డి ఉక్కుపాదం

620

35 ఆసుపత్రులపై కేసుల కొరడా

కరోనా రోగులకు చికిత్సలందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల జేబుదోపిడీపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లైయింగ్ స్కాడ్, రాష్ట్రంలో కరోనా చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన నిఘా దళపతి కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డి దీనిపై ప్రత్యేక  దృష్టి సారించారు. అధిక రేట్లతో రోగులను దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టిన  ఫ్లైయింగ్ స్కాడ్ వాటిపై కొరడా ఝళిపించింది. దానితో నిఘా దళపతి కసిరెడ్డి కృషి ఫలించినట్లయింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ కుంభకోణంపై పరిశోధన నిర్వహించి, దానిపై నివేదిక ఇచ్చిన రాజేంద్రనాధ్‌రెడ్డి, మరోసారి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై దృష్టి సారించి, అక్రమార్కులపై కేసులు పెట్టడం ప్రస్తావనార్హం. తాజా పరిణామాలు..అధిక ఫీజుల భయంతో  ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్సకు వెళ్లేందుకు జంకుతున్న రోగులకు భరోసా… రోగుల అవసరాన్ని వాడుకుని వారిని జేబుదోపిడీకి గురిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు ఏకకాలంలో  హెచ్చరిక సంకేతం పంపాయి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా చికిత్స పర్యవేక్షణకు  ఏర్పాటైన ఫ్లైయింగ్ స్క్వాడ్ లు 35 ఆస్పత్రులను తనిఖీ చేసి 9 ఆస్పత్రుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించి క్రిమినల్ చర్యలకు ఉపక్రమించామని డిజి విజిలెన్స్  కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందించడంలో జరుగుతున్న అవకతవకలపై పర్యవేక్షించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో (List Enclosed) ప్రభుత్వం ఆమోదించిన రేట్లకంటే అధికంగా పేషెంట్ల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని, ఆరోగ్య శ్రీ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందించడం లేదని, కేసులను తప్పుదోవ పట్టిస్తూ, రెమిడిసివిర్ ఇంజక్షన్లను దుర్వినియోగపరుస్తున్నారని ఆయన తెలిపారు. సదరు 9 ఆస్పత్రులపై భారత శిక్షాస్క్మృతి, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ యాక్ట్ మరియు విపత్తు నివారణ చట్టం క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని, 3 కేసుల్లో ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 2 కేసుల్లో నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొంటూ మిగిలిన అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.