కొడాలి ప్రీమియర్ లీగ్ టీ -20 క్రికెట్ టోర్నీ విజేత ఏపీ అడ్వకేట్స్ జట్టు

393

రన్నర్స్ గా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా జట్టు
 ట్రోఫీలను బహుకరించిన మంత్రి కొడాలి నాని

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 9 వ తేదీ నుండి ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కొడాలి ప్రీమియర్ లీగ్ టీ -20 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఏపీ అడ్వకేట్స్ జట్టు నిలిచింది. ఫైనల్స్ లో ఏపీ అడ్వకేట్స్ జట్టుతో పశ్చిమగోదావరి జిల్లా జట్టు తలపడి రన్నర్స్ కు పరిమితమైంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్స్ లో జరిగిన టోర్నీ ముగింపు సభలో విన్నర్స్ గా నిలిచిన ఏపీ అడ్వకేట్స్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.2 లక్షల నగదు బహుమతిని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అందజేశారు.

ఫైనల్స్ లో తలపడిన ఏపీ అడ్వకేట్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 193 పరుగులు చేసింది. ఈ జట్టులో కే రాజ్ కుమార్ 38 బాల్స్ లో 71 పరుగులు, ఎండీ ఆషిక్ 28 బంతుల్లో 36 పరుగులు చేశారు. బౌలింగ్ చేసిన పశ్చిమగోదావరి జిల్లా జట్టులో యుఏవీ వర్మ 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ జట్టులో కేఎన్ఏ తేజ 37 బంతుల్లో 56 పరుగులు, వీ ఉజ్జ్వల్ 26 బంతుల్లో 46 పరుగులు చేశారు. బౌలింగ్ చేసిన ఏపీ అడ్వకేట్ జట్టులో నందకుమార్ 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 14 పరుగుల తేడాతో విజేతగా నిలిచిన ఏపీ అడ్వకేట్స్ జట్టులోని నందకుమార్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు. అలాగే ఈ టోర్నీలో మొత్తం 24 లీగ్ మ్యాచ్లు జరిగాయి.

మొత్తం నాలుగు పూల్స్ లో నాలుగేసి జట్లు పోటీ పడగా ప్రతి పూల్ నుండి ఒక జట్టు సెమీ ఫైనల్స్ కు చేరాయి. ఏపీ అడ్వకేట్స్ జట్టులో ఆడిన కార్తికేయన్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు కాగా పశ్చిమగోదావరి జిల్లా జట్టులో ఆడిన స్నేహ కిషోర్ డెక్కన్ ఛార్జర్స్ మాజీ కావడం విశేషం. ప్రతి జిల్లా జట్టులోనూ ఒకరిద్దరు రంజీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. రన్నర్స్ కు రూ.లక్ష, బెస్ట్ బౌలర్, బ్యాట్స్మన్, ఆల్ రౌండర్లకు రూ. 25 వేలు చొప్పున, ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన క్రీడాకారుడికి రూ. 5 వేలు, ఫైనల్స్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికైన క్రీడాకారుడికి రూ.10 వేలు చొప్పున నగదు బహుమతులను అందజేశారు. అలాగే టోర్నీకి సహకరించిన దాతలు, స్టేడియం కమిటీ సిబ్బందికి మెమెంటోలను బహుకరించారు.

ఈ టోర్నమెంట్ కు అఫీషియల్ స్పాన్సర్స్ గా వీకేఆర్, వీఎన్బీ అండ్  ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, క్వాలిటీ ఫీడ్స్, శ్రీరస్తు షాపింగ్ మాల్, ఆంజనేయ జ్యూయలర్స్ ( వీజేడీ ), అన్ అఫీషియల్ స్పాన్సర్ గా కొల్లి విజయ్, టోర్నమెంట్ బాల్స్ స్పాన్సర్ గా సొంఠి శశి వ్యవహరించారు. బహుమతి ప్రధానోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొడాలి నాని క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ నేతలు పాలడుగు రాంప్రసాద్, ప్రముఖులు  కోగంటి ఆంజనేయులు, వేములపల్లి వేంకటేశ్వర కోదండరామయ్య, లోయ రాజేష్, కేపీ, ఫర్నీచర్ పార్క్ బెన్ను, బాజీఖాన్, తోట శివాజి, టోర్నీ నిర్వాహకులు మెరుగుమాల కాళీ, శ్రీను మాస్టర్, నీరుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.