టీఆర్‌ఎస్-బీజేపీ వ్యాక్సిన్ వార్

620

( మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనా వ్యాక్సిన్ ధర-ఆక్సిజన్ సరఫరాపై టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వన్ నేషన్ వన్ వ్యాక్సిన్ విధానం ఎందుకు పాటించరంటూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై, బీజేపీ అగ్రనేతలు ఎదురుదాడి చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.  కేంద్రానికి సరఫరా చేసే వ్యాక్సిన్ ధర 150 రూపాయలకు ఇస్తున్నప్పుడు, రాష్ట్రాలకు అదే వ్యాక్సిన్ ధర 400 రూపాయలకు ఇవ్వడం ఏమిటన్న కేటీఆర్ ప్రశ్న, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది.

నిజానికి కేటీఆర్ సంధించిన ప్రశ్న మధ్యతరగతి, సామాన్య ప్రజలను మెప్పించింది. కేంద్రం వ్యాక్సిన్ ధరలపై తీసుకున్న నిర్ణయం పూర్తి స్థాయిలో ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించేదన్న భావన ప్రజల్లో ఏర్పడింది. వ్యాక్సిన్ తయారీకోసం సీరం కంపెనీకి 3 వేల కోట్లు, భారత్ బయోటెక్ కంపెనీకి 1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం రుణం కూడా మంజూరు చేసినప్పుడు, ప్రజలపై ఈ స్థాయిలో అదనపు భారం మోపడమేమిటన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయి.

వన్ కంట్రీ వన్ ఎలక్షన్, వన్ కంట్రీ వన్ టాక్స్, వన్ కంట్రీ వన్ రేషన్,  వన్ నేషన్ వన్ అగ్రి మార్కెట్, వన్ గ్రిడ్ వన్ ఫ్రీక్వెన్సీ వంటి ఏకరూప నినాదాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం.. వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి- రాష్ట్రాలకు వ్యత్యాసం చూపించడం ఏమిటన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. పీఎం కేర్‌కు కరోనా సమయంలో వచ్చిన వేలాదికోట్ల రూపాయల్లో, వ్యాక్సిన్ అదనపు ధరను ఎందుకు భరించదన్న ప్రశ్నలు పౌర సమాజం నుంచి వినిపిస్తున్నాయి.  కేంద్ర పక్షపాత వైఖరిపై కేటీఆర్ లేవెత్తిన ఈ ప్రశ్నలు  వివిధ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

అయితే, దీనిపై బీజేపీ చేస్తున్న ఎదురుదాడితో వ్యాక్సిన్ పాలిటిక్స్‌కు తెరలేచింది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రాలకు నిధులు, ఆక్సిజన్ సిలెండర్లు, వ్యాక్సిన్లు ఇవ్వడంలో కేంద్రం విఫలమయిందన్న కేటీఆర్, ఈటెల రాజేందర్ విమర్శలపై డికె అరుణ, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి బీజేపీ అగ్రనేతలు వరసవెంట వరస ఎదురుదాడి ప్రారంభించడంతో వాక్సిన్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. వ్యాక్సిన్ ధరలతో కేంద్రానికి సంబంధం లేదని, కావాలంటే రాష్ట్రాలే కంపెనీలతో చర్చించి ధర తగ్గించుకోవచ్చని బీజేపీ జాతీయ ఉపాథ్యక్షురాలు డి.కె.అరుణ స్పష్టం చేశారు.

కేసీఆర్ సర్కారు కరోనా సీజన్ మొదలయినప్పటి నుంచీ ఇప్పటిదాకా వైద్య అవసరాలు, డిమాండ్, వైద్య సేవలపై ఒక్కసారి కూడా సమీక్షించిన దాఖలాలు లేవని విరుచుకుపడ్డారు. అధికారుల మధ్య, ప్రభుత్వ-ప్రైవేటు ఆసుపత్రుల మధ్య సమన్వయమే లేదని, అసలు రాష్ట్రంలో డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బట్టకాల్చి నెత్తిన వేస్తోందని దుయ్యబట్టారు. రోగుల జేబులను గుల్లచేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుపై, సర్కారుకు నియంత్రణ లేదని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా మంత్రులు చేసిన పరస్పర భిన్న ప్రకటనలను ప్రస్తావించడం ద్వారా, టీఆర్‌ఎస్ సర్కారును బీజేపీ నేతలు  ఇరుకునపెట్టారు. ఒక మంత్రి నిల్వలు సంతృప్తికర స్థాయిలో ఉన్నారంటారు. ఇంకో మంత్రి కొరత ఉందంటారు. ఇందులో ఏది నిజమో చెప్పాలంటూ ఆమె వేసిన ప్రశ్న, సర్కారుకు ఇబ్బందికరంగా పరిణమించింది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా దాదాపు ఇలాంటి ప్రశ్నలే సంధించారు.  రెమ్‌డిసివర్ వ్యాక్సిన్ల నిల్వలపై,  మంత్రి కేటీఆర్-మంత్రి ఈటెల రాజేందర్ చేసిన భిన్నమైన ప్రకటన లోపాన్ని వేలెత్తిచూపించడం, సహజంగానే సర్కారును ఆత్మరక్షణలో నెట్టేసింది. రెమ్‌డిసివర్ వ్యాక్సిన్ల నిల్వలపై ముందు కేటీఆర్, తర్వాత ఈటెల తలోరకంగా మాట్లాడారు. అందులో ఎవరిది నిజమో తేల్చాలని ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అర్వింద్ నిలదీయంతో సర్కారు వద్ద సమాధానం కరవయింది. నిజానికి వైద్య శాఖ మంత్రి రాజేందర్ మంగళవారం సూర్యాపేటలో మాట్లాడుతూ కరోనా బాధితులకు సరిపడా స్థాయిలో ఆక్సిజన్ ఉందని వెల్లడించారు.

పీఎం కేర్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్న కేటీఆర్, ఇప్పటిదాకా సీఎంఆర్‌ఎఫ్‌కు ఎన్ని నిధులొచ్చాయి? వాటిని ఏం చేశారు? ఏ కంపెనీలకు కేటాయించారన్న విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. బీజేపీ వన్‌నేషన్ నానాదాన్ని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. తెలంగాణలో మాత్రం ఒకే రాష్ట్రం- ఒకే నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, మంత్రుల నియోజకవర్గాలకు ఇస్తున్నన్ని నిధులు.. బీజేపీ ఎమ్మెల్యేలయిన రాజాసింగ్, రఘున ందన్‌రావు నియోజకవర్గాలకు ఎందుకివ్వడం లేదని సంకినేని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల పట్ల ఎలాంటి వివక్ష చూపించడం లేదన్నారు.

గగనమార్గాన ఆక్సిజన్

బీజేపీ-టీఆర్‌ఎస్ మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా..హైదరాబాద్‌కు యుద్ధవిమానాలు పంపించి, ఖాళీ ట్యాంకర్లను తీసుకువెళ్లి, వాటిలో ఆక్సిజన్ నింపి మళ్లీ హైదరబాద్ తీసుకువచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇది దేశంలోనే తొలి ప్రయోగం. నాలుగురోజుల నుంచి రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను వినియోగిస్తున్నారు. అయినా కరోనా తీవ్రత దృష్ట్యా అవి సరిపోనందున, రాష్ట్రం విజ్ఞప్తి మేరకు కేంద్రం 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించింది. కేంద్ర హామీ ప్రకారం చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలోనే 70 టన్నుల వరకూ ఆక్సిజన్, ఇక్కడే ఉన్న చిన్న చిన్న ప్లాంట్లలో ఉత్పత్తి అవుతోంది. మిగిలినది బళ్లారి, భిలాయ్, అంగుల్, పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరింది. అయితే అంగుల్, భిలాయ్, పెరంబుదూర్ నుంచి ఆక్సిజన్  హైదరాబాద్‌కు వచ్చేందుకు,  రోడ్డుమార్గంలో అయితే కనీసం మూడురోజుల సమయం పడుతుంది. దానితో రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ప్రభుత్వం.. యుద్ధవిమానాలను రప్పించడం ద్వారా, ఆక్సిజన్ తెప్పించాలని నిర్ణయించింది.
ఆమేరకు ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధవిమానాలు, శుక్రవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరి వెళ్లాయి. భువనేశ్వర్ నుంచి యుద్ధవిమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తెలంగాణకు రానుంది. దీనికోసం 8 ఖాళీ ట్యాంకులను హైదరాబాద్ నుంచి తీసుకువెళ్లారు. వాటిలో ఆక్సిజన్ నింపి, మళ్లీ హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఈ తరలింపు ప్రక్రియను మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ సోమేష్‌కుమార్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల సిబ్బందిని అభినందించారు. మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మంత్రి ఈటెల, సోమేష్‌ను అభినందించారు.