ఆసుపత్రుల భద్రతపై కఠిన వైఖరి

564

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): ఇటీవల గరిష్ఠ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అయిన 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కోవిడ్-19 స్థితిపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. వైరస్ అమాంతం రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాలతో సహా అనేక రాష్ట్రాలపై ప్రభావాన్ని చూపుతోందని గమనించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మహమ్మారితో సామూహిక బలాన్ని ఉపయోగించి కలసికట్టుగా పోరాడదామంటూ పిలుపునిచ్చారు. మహమ్మారి ఒకటో దశలో భారతదేశం సాధించిన సాఫల్యానికి మన ఉమ్మడి ప్రయాసలు, సమష్టి వ్యూహం అతి పెద్ద మూల కారణం అని ఆయన చెప్తూ, ఈ సవాలును మనం ఇదే పద్ధతిలో పరిష్కరించాలన్నారు. ఈ పోరాటంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రాలతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతూ, స్థితిని సన్నిహితంగా పర్యవేక్షిస్తోందని, ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు అవసరమైనటువంటి సూచనలను, సలహాలను అందిస్తోందని కూడా ఆయన అన్నారు. మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై, రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రద్ధగా ఆలకించారు. ఆక్సిజన్ సరఫరాను పెంచడం కోసం అదే పనిగా కృషి జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలు ఒక్కటై పాటుపడుతున్నాయన్నారు. పరిశ్రమలలో ఉపయోగించే ఆక్సిజన్‌ను కూడా తక్షణ అవసరాలను తీర్చడం కోసం మళ్లించడం జరుగుతోందన్నారు. మందులకు, ఆక్సిజన్‌కు సంబంధించిన అవసరాలను నెరవేర్చడం కోసం రాష్ట్రాలు అన్నీ కూడా కలసికట్టుగా పనిచేయాలని, ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రం సమన్వయాన్ని నెలకొల్పుకోవాలని ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఏ ఆక్సిజన్ ట్యాంకరు అది ఏ రాష్ట్రానికి ఉద్దేశించింది అయినప్పటికీ మార్గమధ్యంలోనే దానిని ఆపివేయడమో, లేదా దారిలో అది చిక్కుకోవడమో జరగకుండా ప్రతి ఒక్క రాష్ట్రం శ్రద్ధ తీసుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆక్సిజన్‌ను రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తీసుకుపోవడం కోసం ఒక ఉన్నత స్థాయి సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రాలను ప్రధాన మంత్రి కోరారు. కేంద్రం నుంచి ఆక్సిజన్ కేటాయింపు జరిగిన వెనువెంటనే, ఆ ఆక్సిజన్‌ను అవసరం మేరకు రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు బట్వాడా అయ్యే విధంగా ఈ సమన్వయ సంఘం పూచీ పడాలని అన్నారు. ఆక్సిజన్ సరఫరా అంశంపై తాజాగా జరిగిన ఒక సమావేశానికి తాను అధ్యక్షత వహించినట్లు, ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు గల అన్ని ఐచ్ఛికాలను గురించి చర్చించడం కోసం ఈ రోజున మరొక సమావేశానికి హాజరుకానున్నట్లు ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి తెలియజేశారు. ఆక్సిజన్ ట్యాంకర్ల ప్రయాణ సమయాన్ని, వాటి రాకపోకలకు పట్టే కాలాన్ని తగ్గించడం కోసం సాధ్యమైనటువంటి అన్ని రకాల ఐచ్ఛికాలపైన కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మోదీ తెలిపారు.

దీనికై, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేస్ ఆరంభించినట్లు ఆయన చెప్పారు. ఖాళీ అయిన ఆక్సిజన్ ట్యాంకర్లను కూడా వాటి ఒక వైపు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు వాయు సేన ద్వారా చేరవేయడం జరుగుతోందని ప్రధాన మంత్రి వివరించారు. వనరుల ఉన్నతీకరణకు తోడుగా, పరీక్షలు చేయించడం పైన మనం శ్రద్ధ వహించవలసి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. పరీక్షల నిర్వహణను విస్తృత స్థాయికి చేర్చాలని, అది జరిగితే, ప్రజలు పరీక్ష సదుపాయాన్ని సులభంగా అందుకోగలుగుతారని ఆయన స్పష్టం చేశారు. టీకాలను వేయించేందుకు మనం చేపట్టినటువంటి కార్యక్రమం ఈ స్థితిలో నెమ్మదించ కూడదని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమాన్ని నడుపుతోందని, ఇంతవరకు 15 కోట్లకు పైగా టీకా మందు డోసులను రాష్ట్రాలకు ఉచితంగా భారత ప్రభుత్వం సమకూర్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, అలాగే 45 ఏళ్ల వయస్సు పైబడిన పౌరులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమం కూడా అదే విధంగా కొనసాగుతుందని ప్రకటించారు.

18 ఏళ్ల వయస్సు పైబడిన పౌరులు అందరికీ మే నెల ఒకటో తేదీ నాటి నుంచి టీకా మందు అందుబాటులోకి వస్తుందని కూడా ఆయన తెలిపారు. వీలయినంత ఎక్కువ మంది టీకా మందును పొందే లాగా మనం ఉద్యమ తరహాలో శ్రమించవలసిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు. రోగుల చికిత్సకు అన్ని చర్యలను తీసుకోవడంతో పాటు, ఆసుపత్రులలో సురక్షత కూడా చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. ఆక్సిజన్ లీకేజీ తాలూకు ఇటీవలి ఘటనల పట్ల, ఆసుపత్రులలో మంటలు రేగడం పట్ల ప్రధాన మంత్రి దు:ఖాన్ని వ్యక్తం చేస్తూ, భద్రత సంబంధి ప్రోటోకాల్స్ విషయంలో ఆసుపత్రి పాలన సిబ్బందికి మరింత అధిక జాగృతిని కలిగించవలసిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ప్రజలు గాభరాతో కొనుగోళ్లకు ఒడిగట్టకుండా పాలన యంత్రాంగం ప్రజలను ఎల్లప్పటికీ చైతన్యవంతులను చేస్తూ ఉండాలని కూడా విజ్ఞ‌ప్తి చేశారు. సమష్టి ప్రయాసలతో మహమ్మారి రెండో వేవ్ దేశం అంతటా విస్తరించకుండా అడ్డుకోగలుగుతామని ఆయన అన్నారు.

అంతక్రితం, సంక్రమణల కొత్త ఉధృతిని నిలువరించడం కోసం చేపడుతున్న సన్నాహక చర్యలను వివరించే ఒక నివేదిక ను డాక్టర్ వి.కె. పాల్ సమావేశానికి సమర్పించారు. వైద్య సదుపాయాలను పెంచడానికి, అలాగే రోగులకు లక్షిత చికిత్సను అందించడానికి సంబంధించిన ఒక మార్గ సూచీని కూడా డాక్టర్ పాల్ సమావేశానికి నివేదించారు. వైద్య పరమైనటువంటి మౌలిక సదుపాయాలను, వైద్య బృందాలను, సరఫరాలను పెంపొందించడం, రోగ చికిత్స సంబంధి నిర్వహణ, కట్టడి, టీకా మందును ఇప్పించడం, సముదాయాలను భాగస్వాములను చేయడం వంటి అంశాలను గురించిన వివరాలను ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేశారు. సంభాషణ సాగిన క్రమంలో, ప్రస్తుత వేవ్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొంటున్న చర్యలను గురించి ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన మంత్రి ఇచ్చిన ఆదేశాలు, ‘నీతి ఆయోగ్’ అందజేసిన మార్గ సూచీ తాము తమ ప్రతిస్పందనలను ఒక మెరుగైన పద్ధతిలో అమలుపరచడంలో తోడ్పాటును అందించగలుగుతాయన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేశారు.