విధి శ్రీ మహా విష్ణువు నైనా విడిచిపెట్టదు

613

రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. కోవిడ్ వచ్చింది కదా, లాక్డౌన్ ఉంది కదా అని ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా?
ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే కుటుంబ సభ్యులు పడుతున్న బాధ “ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్రకి పట్టుమని పదిమంది కూడా లేకుండా ఏమిటి?” అని చాలా మంది ఇదే విషయానికి మరింతగా కృంగిపోతూ ఉండవచ్చు ప్రస్తుతం. సహజం. అంతేకాదు, కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. లాక్డౌన్లో ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి.
వారందరి కోసం “మహాభారతం” మౌసలపర్వంలోని శ్రీ కృష్ణుని అంత్యక్రియల ఘట్టం  ఒక్కసారి పరిశీలిస్తే…
ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెను వెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. ఆ కార్యక్రమం ముగిసాక అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు విగతజీవై కనిపించాడు..! అర్జునుడు కుమిలిపోయాడు. రోదించాడు. అప్పటికే శ్రీ కృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి.
ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలులేదు (అప్పటికే ద్వారక సముద్రంలో మునిగిపోయింది, చూసినవాడు అర్జునుడే ) చేసేదేమీ లేక, మంత్రానికి బ్రాహ్మణులు,క్రియలు ఏమీ లేకుండానే అక్కడికక్కడే అర్జునుడొక్కడే అరగంటలో అంత్యక్రియలు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే అయిన శ్రీ కృష్ణ పరమాత్ముని కి ఏ అర్భాటమూ,  లేకుండా ముగించేశాడు.
అష్ట భార్యలు, ఎనభై మంది సంతానం,  మనుమలు, మనుమరాండ్లు,  విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియలకు సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.
శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతిహాస మహాపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.
మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఎప్పుడు ఎవరికి ఎలా రాసిపెట్టుందో  ఎవ్వరు చెప్పరు, చెప్పలేరు. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందిన వారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణ పరమాత్ముని అంత్యక్రియల ఘట్టం కొంతైనా ఓదార్పుని, దిగులు భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదించుగాక.