నిరుపేదలకు ప్రభుత్వమే వైద్యం చేయించే పథకం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ

355

ఉచిత వైద్యంలో అందుబాటులోకి 2,434 చికిత్సలు
 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, ఏప్రిల్ 21: ఆస్థులు అమ్ముకునే అవసరం లేకుండా నిరుపేదలు, నిస్సహాయులకు కూడా ప్రభుత్వమే ఖర్చులన్నీ భరించి వైద్యం చేయించే పథకం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు. గుడివాడ పట్టణం బైపాస్ రోడ్డులో మంత్రి కొడాలి నానిని వైసీపీ నందివాడ మండల అధ్యక్షుడు పెయ్యల ఆదాం, గుడివాడ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు తోట నాగరాజు, వైసీపీ నాయకులు దేశిరెడ్డి రామ్మోహనరెడ్డి, దుంపల శ్రీను, నెరుసు శ్రీను తదితరులు కలిశారు. ఈ సందర్భంగా పెయ్యల ఆదాం మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన నందివాడకు చెందిన రాజులపాటి చంద్రశేఖర్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని చెప్పారు. విజయవాడలోని అను ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడని, కాలుకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాజులపాటి చంద్రశేఖర్‌కు వైద్యం అందేలా చూడాలని పెయ్యల ఆదాం కోరారు.

అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న రాజులపాటి చంద్రశేఖర్ కు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేలా చూస్తానని చెప్పారు. వైద్యానికయ్యే ఖర్చులకు సంబంధించి ఆసుపత్రి ద్వారా ఎస్టిమేషన్ ను తీసుకురావాలని సూచించారు. ఇదిలా ఉండగా వైద్యరంగంలోనూ నాడు – నేడు కార్యక్రమాలను సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, వీటికి నిధుల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉండేలా కృషి చేస్తున్నారన్నారని చెప్పారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. నెట్వర్క్ ఆసుపత్రిలన్నింటిలో ఆరోగ్యమిత్రలతో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ డెస్క్లను మరింత మెరుగుపర్చడం ద్వారా రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందేలా చూస్తున్నామన్నారు.

అనారోగ్య పరిస్థితులు తలెత్తినపుడు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే ఆసుపత్రులపై అవగాహన కల్పించడం, రిఫరల్ సేవలు ఎక్కడున్నాయన్న దానిపై కూడా విస్తృతమైన ప్రచారం చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరును కూడా సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, ఆరోగ్య అవసరాలను పరిశీలిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లో లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశాల ప్రకారం వైద్యఖర్చు రూ.వెయ్యి దాటితే 2,436 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.