స్త్రీలను వేదాలు చదవొద్దన్నదెవరు?

697

గార్గి, రోమష,
ఘోషా, విశ్వవర,
ఆత్రేయి, లోపాముద్ర,
వసుత్రపత్ని, ఇంద్రాణి,
అపాల, శ్రద్ధ,
వైవశ్వతి, యామి,
పౌలమి, సూర్య,
శ్వాస్తి, శిఖండిని,
ఊర్వశి, సచి,
దేవరాణి, ఇంద్రమాత,
గోద, జుహు,
మైత్రేయి.

వీళ్ళంతా వేదాలలో ఉదహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను నేర్చుకొని వాటికి సూక్తాలు వ్రాసి వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీరు.

మహిళాయోగులు, స్త్రీబుుషులు, యోగినులు, స్త్రీ మునులనే మాటలను మనం వినివుంటాం. కానీ వీరిని బుుషికలు లేదా బ్రహ్మవాదినులని పిలవాలి.

బుుగ్వేదంలో 23 మంది బుుషికలు సూక్తాలు రచించారు. అపాల రచించిన సూక్తానికి ఆమె పేరు మీదనే అపాలసూక్తమని పేరు.

విశ్వవర ఐదవ మండలంలోని 28 వ సూక్తాన్ని లోపాముద్ర 19వ సూక్తాన్ని దర్శించారు. బుుగ్వేదంలో 125 సూక్తాన్ని జుహు దర్శించింది.

గార్గి బుుషిక యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది.

వేదకాలనిర్ణయం 5000 సం॥ నుండి 1500 క్రితం సంవత్సరాల కాలంనాటివని భావిస్తే అప్పటికే స్త్రీవిద్యకు అత్యంత విలువ ఇచ్చినట్లు భావించాలి. వేదాలకు భాష్యాలు చెప్పడమంత సులభమైన ప్రక్రియేమికాదు. వేదాలను క్షుణ్ణంగా చదవాలి. అంటే లోతుగా అధ్యయనం చెయ్యాలి. జ్ఞానసముపార్జన చెయ్యాలి.

ఇప్పటికి 1500 సంవత్సరాల క్రిందటవరకు స్త్రీలకు అన్ని రంగాలలోనూ సమాన అవకాశాలుండేవి. మనదేశంపైకి గ్రీకులు (యవనులు) పర్షియన్లు, కుషాణులు, హూణులు దండయాత్రలు చేసి భూభాగాలను ఆక్రమించి రాజ్యాలను స్థాపించినా వారెవరు మన సంస్కృతీ సంప్రాదాయాలను పాడుచేయలేదు. పైగావారు మనదేశ సంస్కృతీ సంప్రాదాయాలను మతాలను గౌరవించి హిందూమతాన్నో బౌద్ధాన్నో స్వీకరించారు. హూణ చక్రవర్తి మినాండర్, కుషాణులు ఈ కోవలోనివారే.కాని తురుష్కులు, అరబ్బులు మొదలైన ముస్లీములు దండయాత్రలు జరిపి రాజ్యాలు ఏర్పాటుచేయడంతో, భూభాగాలను భారతీయులు కోల్పోవడమేగాక తీవ్రమైన గ్లానికి కూడా గురైనారు.

 

స్త్రీలను చెరబట్టడం, స్త్రీలను చెరచడం, స్త్రీలను బానిసలుగా చేసుకోవడం, స్త్రీలకోసమే యుద్ధాలు చేయడం, వారిని మతం లోనికి మార్బడం ముస్లీంల పాలనలో జరిగింది. భారతీయ స్త్రీలు అనాదిగా మానానికి అత్యంత విలువ ఇస్తారన్నసంగతి జగమెరిగిన సత్యం. ముస్లీంల పాలబడి మానం కోల్పోవడం కంటే ప్రాణాన్ని త్యజించడమే మేలని భావించారు. అలా పుట్టిందే జోహార్ పద్ధతి. ఈ పద్ధతిలో ముస్లీంల బారిన పడకుండా అంత:పుర స్త్రీలు పెద్దపెద్ద జ్వాలలను ఏర్పాటుచేసి అందులో ప్రాణాలు అర్పించేవారు.

యుద్ధంలో పురుషులు మరణిస్తే ఆ వీరుని ఇల్లాలు శత్రువుల చేతికి చిక్కకుండా సహగమనం చేసేది. ముస్లీంల తరువాత భారతాన్ని పాలించిన ఆంగ్లేయులు స్త్రీవిద్యకోసం కృషి చేసినా, అది మతమార్పిడీలకేనన్నది జగమెరిగిన సత్యం.

గ్రీకులు మహ్మదీయులు ఆంగ్లేయులు భారతస్త్రీలను అసామాన్యంగా బాధించారు. స్త్రీలను చెరపట్టడం బలత్కారం చేయడం బానిసలుగా మార్చడంతో స్త్రీలను ఏ విధంగానైనా రక్షించుకోవాలనే తాపత్రయం పెరిగింది.

అందుకే శాస్త్ర సమ్మతం కాకపోయినా బాల్యవివాహాలు చేశారు. అలా చేస్తే వివాహితుల జోలికిరారనేది నమ్మకం.

హిందూ మహిళలను పరపురుషుల కంటపడనీయకుండా పరదాపద్ధతి ఘోషా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది.

యవనులు ముస్లీములు బ్రిటిష్ వారి పాలనలో స్త్రీలు రకరకాలుగా శారీరకంగా పీడించబడినా ఇంకా అనేకరకాలుగా అణగతొక్కబడినప్పటికి స్త్రీలు నాటికే అనేక రంగాలలో పురోభివృద్ధి సాధించారు.

కాకతీయ మహాసామ్రాజ్యాన్ని ఏలిన రాణిరుద్రమదేవి, డిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీని ఎదిరించిన చిత్తోడు దుర్గాన్ని పాలించినరాణి పద్మిని, పాలనలో అనేక సంస్కరణలను చేపట్టి ప్రజలకొరకు రహదారులను, సత్రాలను, చెరువులను దేవాలయాలను నిర్మించి అద్భుతమైన పాలనను అందించి మధురను శత్రువశం కాకుండా కాపాడిన రాణిమంగమ్మ, ఔరంగజేబునే ఎదిరించి నిలచిన కిత్తూరు రాణి చెన్నమ్మ, మహారాష్ట్ర రాణీ తారాబాయి, విధర్మీయులు ధ్వంసం చేసిన ఎన్నో హిందూ దేవాలయాలను పునరుద్ధరించిన మాల్వా మహారాణి అహల్యాబాయి హోల్కర్, బ్రిటిష్ వారి దమననీతికి ఎదురొడ్డి పోరాడి మరణించిన రాణి ఝాన్సీలక్ష్మీ బాయి, స్వతంత్ర్య పోరాటంలో పాల్గొనిన సుచేత కృపలాని, సరోజినీనాయుడు, కస్తూరిబా మొదలైన వారు, శివాజీని హైందవ వీరునిగా తీర్చిదిద్దిన జిజియ బాయి, కవయిత్రులు గంగాంబ, రామభద్రాంబ,మొల్ల, మొదలైనవారు, సావిత్రి బాయ్ పూలే వంటి సంస్కరణవాదులు, ఆకొన్నవారికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ లాంటి వారు లేకపోలేదు.
వీరి పురోభివద్ధికి ఏ శక్తులూ అడ్డుపడలేదు. ఇప్పటిక్కూడా ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఆధునిక మహిళలు శర వేగంగా దూసుకు పోతున్నారు కదా?

– జిబి విశ్వనాథ, 9441245857, అనంతపురం.

( VSK ANDHRAPRADESH )