వకీల్‌సాబ్ చూస్తే…కరోనా రాదు..ట!

576

తెలంగాణలో పవన్ సినిమాకు థియేటర్ల మినహాయింపు
                            ( మార్తి సుబ్రహ్మణ్యం)

కరోనాకు మందులు, చికిత్స ఉన్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన పనిలేదు. కోవిడ్ టెస్టులు కూడా చేయించుకోవలసిన పనిలేదు. ఆసుపత్రుల కోసం పరుగులు తీయాల్సిన పనిలేదు. వీటికి ఒకటే విరుగుడు. ఒకటే మందు. అదే వకీల్‌సాబ్ సినిమా! పవన్ హీరోగా నటించిన వకీల్‌సాబ్  సినిమాకు వెళితే ఎవరికీ కరోనా రాదు. సామాజికదూరం పాటించకుండా వకీల్‌సాబ్ థియేటర్‌కు వెళ్లినా బేఫికర్. అవును. ప్రభుత్వమే ఆ మేరకు భరోసా ఇచ్చింది. ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు కూడా ఆమేరకు ధైర్యం చెబుతున్నారు. అందుకే  తెలంగాణ మొత్తం థియేటర్లు  మూతపడినా.. ఒక వకీల్‌సాబ్ సినిమా థియేటర్లు మాత్రం నడుస్తాయి. అదే వకీల్‌సాబ్ స్పెషాలిటీ. కావాలంటే మీరే చూడండి.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు రక్షించేందుకు రంగంలోకి దిగింది. అందులో భాగంగా రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. చివరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా రద్దు చేసింది. బార్లు, వైన్‌షాపులు, రెస్టారెంట్లు సహా అన్ని దుకాణాలు రాత్రి 9 గంటల తర్వాత చేయడంపై ఆంక్షలు విధించింది. దీనితో కరోనా వ్యాప్తి కొంతవరకూ అడ్డుకట్టవేసేందుకు అవకాశం ఏర్పడింది.

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా తెలంగాణలోని అన్ని సినిమా థియేటర్లను మూసివేసినట్లు ఎగ్జిబిటర్లు, ధియేటర్ యజమానులు ప్రకటించారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను మాత్రం, మూసివేత నుంచి మినహాయించడం విమర్శలకు దారితీస్తోంది. నిజానికి వకీల్‌సాబ్ కంటే ముందు విడుదలయిన సినిమాలు కూడా నడుస్తున్నాయి. కానీ ఒక్క వకీల్‌సాబ్ సినిమాకే మినహాయింపు ఎందుకన్న ప్రశ్నలు,  చిన్న సినిమా నిర్మాతల నుంచి వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించి వకీల్‌సాబ్ నిర్మాత దిల్‌రాజు  చేసిన ఒత్తిళ్ల ఫలితంగానే పవన్‌కల్యాణ్ సినిమాకు మినహాయింపు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు నిర్వహించిన సమావేశంలో భారీ పెట్టుబడి తీసుకున్నందున, ఈ పరిస్థితిలో వకీల్‌సాబ్ ప్రదర్శిస్తున్న థియేటర్లు కూడా మూసివేస్తే.. తాము రోడ్డునపడతామన్న ఆందోళన వ్యక్తమయింది. దీనితో సినిమాపెద్దలు వకీల్‌సాబ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను మినహాయించేలా చేసినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 2600 సినిమా థియేటర్లు ఉండగా, ఒక్క  దిల్‌రాజు చేతిలోనే సగానికిపై  థియేటర్లు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా  తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వకీల్‌సాబ్ సినిమా చూస్తే కరోనా రాదన్న సంకేతం ఇచ్చినట్టయింది. కాబట్టి.. జనం కరోనాకు భయపడకుండా, ఎంచక్కా థియేటర్‌లో పక్క పక్క సీట్లో కూర్చుని వకీల్‌సాబ్ సినిమా చూసినా ఎలాంటి వైరస్ రాదు. ఆ ప్రకారంగా ఆ సినిమా థియేటర్ల చుట్టూ పవన్ కల్యాణ్ యాంటీవైరస్ అరేంజి చేశారన్నమాట.