దేశం ఊపిరి ఎప్పుడో ఆగింది!

512

ప్రాణ వాయువు అందక …
ప్రాణాలు పోవడం ఈ దేశానికి కొత్త కాదు !
అబద్ధాన్ని నిజం అని నమ్మించి మోసం చేసినప్పుడే
నిజాయితీ ఊపిరి ఆగిపోయింది…

మతాన్ని ముందు పెట్టి … పక్కనున్న మనిషిని పరాయివాణ్ని
చేసినప్పుడే… మానవత్వం ఆఖరి శ్వాస విడిచింది…
డిగ్రీలున్నాయంటూ దొంగ సర్టిఫికెట్ పుట్టించినపుడే
అర్హతకు ఆయువు మూడింది..

ప్రశ్నిస్తే… దేశ ద్రోహిగా ముద్ర వేసినప్పుడే
స్వేచ్ఛ ప్రాణం పోయింది…
పార్టీలను నివులునా చీల్చి…ప్రభుత్వాల్ని కూల్చినప్పుడే
ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ ఆగింది…

పెద్ద నోట్ల రద్దు పేరుతో పెద్ద కోట్లకు పహారా కాసినప్పుడే
చెమట చుక్క బతుకు చితి-కి పోయింది…ఉద్యోగాల్లేక రేపటి తరం అధోగతి పాలవుతుంటే…
పకోడీలు అమ్ముకోమన్నప్పుడే భవిష్యత్ బిక్కచచ్చిపోయింది…

చేతగాక చేతులెత్తేసి… పెట్రో ధరలు పెంచి పిండుకున్నప్పుడే
సమర్థత శవంలా చతికిల పడింది…

మండీలను ముండ మోయించి… రైతు కుత్తుక మీద కత్తి పెట్టినప్పుడే…
దేశంలో చిత్తశుద్ధికి చివరి శ్వాస పోయింది…

గడ్డాలు పెంచి… వేషాలు మార్చి… అధికారం యావతో
అంథకారాన్ని ఏలుతున్నప్పుడే… ఆశ అడుగంటింది…

కరోనాను మించిన చేతగానితనం దేశాన్ని కమ్మేసినప్పుడే…
బతుకేంటో… రేపేంటో అనే భయం బతికి… ధైర్యాన్ని చంపేసింది !

ఇప్పుడీ వైరస్ కరోనా ఓ లెక్కా ?

కోట్లలో లక్షల మందికి వచ్చి…
లక్షల్లో వేల ప్రాణాలు పోతుంటే…

ధేడేల్ ధడేల్ మని ఫిడేల్ వాయిస్తున్న నిలువు గడ్డం నీరోలు…
కనీసం ఆక్సిజన్ అందించలేని అసమర్థులు…

ఆలోచనలేని, ఆదుకోలేని, వ్యవస్థల్ని సచేతనంగా నడపలేని…
దద్దమ్మల పెద్దమ్మలు…

ఈ కరోనాలకు చలిస్తారా ?
లేని సమర్థతను ఎక్కడి నుంచి దిగుమతి చేస్తారు ?

అయినా కరోనా ఇప్పుడు మ్యుటేషన్లు చూపిస్తోందేమో…

ఏడేళ్ల నుంచి ఏడాదికో రకంగా మారుతున్న భక్త మ్యుటేషన్లు…
దేశాన్ని కమ్మేసి… ఆమ్మేశాయ్…
మనకి తెలియడం లేదంతే !

ఇన్ని ఊపిరులు ఆగినా… మన రాజకీయం ఆగిందా ?
కొన్ని గొర్రెలు పోతే…
ఉన్న పుర్రెలతోనే క్షుద్రం చేద్దామనే బరితెగింపు పెరిగింది తప్ప !

అందుకే…
ఆక్సిజన్ అందక ప్రాణాలు పోవడం ఈ దేశానికి కొత్త కాదు !!

కానీ ఒక్కటే ఆశ…

ఇంత జరగక ముందే…
ఒక్కడు ఊపిరి ఆడటం లేదు అంటూ విలవిలా కొట్టుకోగానే…
కళ్లు తెరిచింది అమెరికా !

ఆ ఫ్లాయిడ్ ప్రాణం విలువ…
అమెరికా పగ్గాలనే మార్చేసింది…
కొత్త భవిష్యత్ కి బాటలు వేసింది…
అందుకే అమెరికాను అభివృద్ధి చెందిన దేశం అంటారేమో !

మన కళ్ల ముందే, ఇన్ని వ్యవస్థల ఊపిరి తీసేశాం…
మనవి, మనవాళ్లవి… మన చుట్టూ ఉన్నవాళ్లవీ !

ఇన్నిన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్…
ఆక్సిజన్ అందక ఆయువు తీరిపోతోంది

మరి ఇప్పుడైనా కళ్లు తెరుద్దామా ? వద్దా ?
తెలుసుకుందామా ? వద్దా ?

పోయే ప్రతీ ప్రాణం…
కొత్త ఆలోచనకి ఊపిరి పోయాలి !
మార్పు కోసం మన ప్రయత్నం మొదలవ్వాలి !
మతంలోనో… మత్తులోనో… మూర్ఖత్వంలోనో… మునిగిపోతే
ఏదో రోజు మన ప్రాణం కూడా …
నిశ్శబ్దంగా నిశీధిలో కలిసిపోగలదు !!

Disclaimer :
నేను BJP/RSS
  -బీ హ్యాపీ