పోలవరం “రివర్స్ గేర్”లో నడుస్తున్నదా!

517

పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు డిపిఆర్ -2కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన రు.55,548 కోట్ల వ్యయ అంచనాకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మోకాలడ్డింది. పర్యవసానంగా ప్రాజెక్టు నిర్మాణం నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుందా! అన్న అనుమానాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రాజెక్టు నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా 150 అడుగుల ఎత్తుతో నిర్మాణాన్ని పూర్తి చేసి, గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తారా! లేదా! అన్న అనుమానాలు ప్రజల్లో నెలకొని ఉన్నాయి.

ఈ పూర్వరంగంలో రాష్ట్ర ప్రభుత్వం రు. 3,222 కోట్ల అదనపు వ్యయానికి పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, ప్రజల్లో ఉన్న అనుమానాలకు బలం చేకూర్చడంతో పాటు ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి బరితెగించినట్లు స్పష్టమవుతున్నది.

పోలవరం జలాశయం నిర్మాణ పనులకు సంబంధించి “రివర్స్ టెండర్స్” ద్వారా రు.233 కోట్లు ఆదా చేశామని గొప్పగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు మొత్తం వ్యయ అంచనాను రు.5,535 నుండి రు.7,192 కోట్లకు అంటే రు.1,657 కోట్లు అదనంగా పెంచడాన్ని ఏమనాలి? పైపెచ్చు సిడబ్లుసి డిజైన్స్ లో చేసిన మార్పుల వల్ల పెంచాల్సి వచ్చిందని, పెరిగిన మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సిడబ్లుసి హామీ ఇచ్చినట్లుగా ప్రచారంలో పెట్టారు.

డిపిఆర్-2 అంచనా వ్యయానికే అంగీకారం తెలియజేయని మోడీ ప్రభుత్వం ఈ పెంచిన మొత్తాన్ని చెల్లిస్తుందా? “రివర్స్ టెండర్స్” పర్యవసానంగా ప్రాజెక్టు నిర్మాణంలో కాలయాపన జరుగుతుందని, వ్యయం పెరుగుతుందని, అలా పెరిగే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఏనాడో చెప్పేసింది. అందువల్ల ఈ పెంచిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సి ఉంటుంది.

నిర్మాణ సంస్థతో కుదుర్చుకొన్న ఒప్పందంలో ప్రస్తావించని పనులు కొన్ని ఉన్నాయట, వాటి అంచనా వ్యయం రు.653 కోట్లుగా నిర్ధారించారట. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదంలేని ఈ పనుల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా? అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికపై నిర్మించి, నీటిని అందించాలని ప్రజలు కోరుతుంటే ఆ వైపున  చర్యలు చేపట్టకుండా పోలవరం జలాశయం “డెడ్ స్టోరేజ్” నుండి అంటే 32 -35 మీటర్ల మధ్య జలాశయంలో నిల్వ ఉండే నీటిని తోడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మెట్ట ప్రాంతాల్లోని కరవు పీడిత ప్రాంతాలకు సరఫరా చేస్తామంటూ ఒక కొత్త ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని, దానికి రు.913 కోట్లు వ్యయ అంచనాకు పరిపాలనానుమతిఇస్తూ మరొక జీవోను ప్రభుత్వం జారీ చేసింది. దీనికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ ఆమోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంపాదించగలదా!

అసలు ఈ ఎత్తిపోతల పథకం అవసరమేంటి? పోలవరం నిర్మాణం పూర్తయ్యే వరకే పట్టిసీమ ఎత్తిపోతల పథకం వినియోగమని విధాన నిర్ణయంగా ప్రకటించి నిర్మించిన దాన్ని వ్యతిరేకించిన వారు నేడు పోలవరం ఎత్తిపోతల పథకాన్ని ఎలా సమర్థించుకొంటారు? ఎలా శాశ్వత ప్రాతిపదికపైన నిర్మిస్తారు? దానికయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించదు కదా! రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి కదా! ఏ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజలు భరించాలి.

పోలవరం కుడి కాలువను విస్తరించి, సామర్థ్యాన్ని పెంచి, 80 టియంసిల కంటే అధికంగా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించి, ఆ మేరకు ఆదా అయ్యే కృష్ణా జలాలను పెన్నా నదీ పరివాహక ప్రాంతానికి తరలించాలని, కృష్ణా నది వరద జలాలపై ఆధారపడి నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు ఆ నీటిని కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే, దానిపై దృష్టి సారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎత్తిపోతల పథకం అంటూ కొత్త ప్రతిపాదనకు పరిపాలనానుమతి ఇవ్వడం కరవు పీడిత రాయలసీమ ప్రాంతం మరియు ప్రకాశం జిల్లాకు తీరని అన్యాయం చేయడమే కదా!

 టి.లక్ష్మీనారాయణ
                                                        (ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)