దార్శనికుడు,అలుపెరుగని కార్యశీలి…చంద్రబాబు

714

అధికారంలో వున్నా,ప్రతిపక్షంలో వున్నా ప్రజాసేవే పరమావధిగా స్థిత ప్రజ్ఞతో ఒక ప్రత్యేక జీవన సరళిని అనుసరిస్తున్ననాయకుడు చంద్రబాబు.ధీరులకు గెలుపోటముల లెక్కల అవసరం వుండదు.నిరంతరం ప్రజాక్షేమమే వారి ధ్యాస . ప్రపంచ రాజకీయ యువనిక పై సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు.1956 నుండి ఇప్పటివరకు సుధీర్ఘ రాజకీయ అనుభవంలో ఆయనతో పోల్చ తగ్గ సీనియర్ నాయకుడు మరొకరు లేరు.71 ఏళ్ల వయస్సుఆయనది అందులో 43 ఏళ్ళు ప్రజాజీవితమే.ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ద్వారా తన సుధీర్ఘ రాజకీయ జీవితాన్ని సార్ధకం చేసుకొనే సువర్ణావకాశం చంద్రబాబుకి దక్కిన అపూర్వ వరం.ఆయన అనేక యుద్దములు నారియు తేరిన నాయకుడు.అనుభవం రీత్యా తల పండిన యోధుడు.పడిలేచే కడలి తరంగం లాంటి  చంద్రబాబు ని ఇతర రాజకీయ నాయకులకు భిన్నంగా ఎలుగెత్తి చూపేది ఆయనలోని వెన్ను చూపని ధీరత్వమే.

ఇప్పటికీ 71ఏళ్ల వయస్సులోనూ అలుపెరుగని యోధుడిలా ప్రజలకోసం ముందుకు సాగుతున్న నాయకుడు. రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు చేసిన కృషిని, అభివృద్ధిని,పడిన తపనను ఆయన 71వ జన్మదినం సందర్భంగా నెమరు వేసుకోవడం లో తప్పులేదని భావిస్తున్నాను. రాజకీయంగా ఎవరు అంగీకరించినా,అంగీకరించక పోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పరిపాలనలో కానీ,విభజిత నవ్యాoద్ర పరిపాలనలో కానీ చంద్రబాబు కి ప్రత్యేక మైన స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్ధేశించుకొని కాలంతో పోటీ పడ్డారు ఆయన.

విభజన అనంతరం నవ్యాoధ్రను అభివృద్ధి చెయ్యడానికి తనను,తాను రాష్ట్రానికి సమర్పించుకున్నారు. కష్టాల సుడిగుండంలో వున్న రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చడానికి ఒక కర్మ యోగిలా కార్యాచరణకి శ్రీకారం  చుట్టారు.71 ఏళ్ల వయసు లోను విశ్రాoతి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు.కాళ్ళకి చక్రాలు,కాలానికి రెక్కలు తొడిగిన అవిశ్రాoత పథికుడు చంద్రబాబు.కానీ ఎన్నికల్లో గెలుపోటములు సహజం.ఎంతో మంది మేటి నాయకులు కూడా ఎన్నికల్లో మట్టి కరిచిన విషయాన్ని మర్చి పోవద్దు. కొన్నిసార్లు ప్రజలు కొత్తవారు చెప్పిన మాటలకు,కొత్తదనానికి ఆకర్షితులు అవడమో,మోసపోవడమో జరుగుతుంది. నేడు అదే జరిగింది. ఒక్క చాన్సు ఇవ్వండి అన్న వేడుకోళ్లు,నవమోసాలతో కూడిన నవరత్నాలు,ఆడ కుండా ఆడిన  అబద్దాలు జగన్మోహన్ రెడ్డి అధికారానికి బాటలు వేసాయి.నేడు చంద్రబాబు ఓడి పోయాడని కొందరు ఎగతాళి చెయ్యవచ్చు,అవమానకరంగా మాట్లాడ వచ్చు. కానీ ఏనుగు పడుకొని వున్నాఅది  గుర్రం ఎత్తు ఉంటుందని వారికి తెలియదు. నేడు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలనా తీరును పరిశీలించిన వారికి రాష్ట్ర భవిష్యత్ పట్ల ఆందోళన కలగక మానదు. రాష్ట్రం ఎదోర్కొంటున్న సమస్యలు,సవాళ్ళు అన్నీ,ఇన్ని కావు.

కార్య సాధనలో కర్తవ్య పరాయణుడు చంద్రబాబు. కొందరు అభివృద్ధికి అడ్డుపడినా విభజన సమస్యలు,ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టినా ఆత్మ స్థైర్యంతో అన్నింటిని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పధం  వైపు నడిపించారు ఆయన.సంక్లిష్టతను సంక్షోభాన్ని సవాలుగా స్వీకరించారు. సవాళ్లలో నుంచి ప్రతిభను ప్రజ్వలనం చేశారు. కొత్త ఆలోచన చేసి ఆచరించి రాష్ట్రాన్నిఅభివృద్ధి బాట పట్టించారు.విధ్వంసక విభజన జరిగి అనాధగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ ను అక్కున చేర్చుకొని పునాదులనుండి నవ్యాoధ్ర నిర్మాణానికి నడుంబిగించిన నాయకుడు ఆయన. ఎవరు అవునన్నా కాదన్నానిరాశ చెందని తత్వం,అలసట ఎరుగని ధీరత్వంతో నవ్యాoధ్ర ను దైన్యం నుంచి ధైర్యంలోకి  తెచ్చిన ఘనత చంద్రబాబుదే.

ఐదేళ్లలో కాళ్ళ మీద నిలబడటమే గగనం అనుకొనే స్థితి నుంచి తలఎత్తి చూసే స్థాయికి ఎదిగింది ఆంధ్రప్రదేశ్. కోత్త రాష్ట్రంలోపాలన మొదలు పెట్టడానికి నిలువ నీడలేదు. శూన్యం నుంచి ఆయన పరిపాలన ప్రారంభించారు. ఉరుముతున్న సవాళ్ళ మద్య నూతన రాష్ట్రంలో సారధ్యం చేపట్టినా ఏ దశలోనూ తాను పరిష్కరించలేనంతటి పెద్ద సమస్యలున్నాయని చంద్రబాబు భావించలేదు.జీతాలకు కూడా సరిపడా రాబడిలేని రాష్ట్రాన్ని సాకేందుకు ఆయన అనుసరించిన విధానాలు సత్పలితాలను ఇచ్చాయి. దార్శనికతతో నవ్యాoధ్ర  భవ్య భవితకు బలమైన పునాది వేశారు.

కూర్చోవడానికి కుర్చీ లేదు, సమావేశాలకు వేదికలు లేవు.హోటల్లో సమావేశాలు, బస్సులో పడుకొని పరిపాలన సాగించారు. రాజధాని లేదు, ఆర్ధిక వనరులు లేవు, కేంద్ర సాయంలేదు. ప్రతిపక్షాల అడ్డంకులు, ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో పోరాడి రాష్ట్రాన్ని వెలుగుబాట పట్టించారు. ఏమీలేని స్థితి నుండి ఐదేళ్లలో అన్నీ సమకూర్చుకున్నామన్న భావన ప్రజల్లో కల్పించారు. సామాజిక, ఆర్ధిక మానవాభివృద్ది సూచికల ప్రాతిపదికన 2029నాటికి భారత్ లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్న లక్ష్యంతో అభివృద్ది ప్రణాళికలు రచించారు. సమర్ధతను, పరిమిత వనరులను గరిష్ట ప్రయోజనదాయకంగా మలచుకొని ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగాన నిలబెట్టేందుకు అత్యున్నత లక్ష్యం నిర్దేశించుకొని ప్రతిక్షణం దాని సాధన కోసం పరిశ్రమించారు చంద్రబాబు.పరిస్థితులకు తగ్గట్లుగా అవసరాలను కుదించుకోవడం వెనుకబాటు.అదే అవసరాలకు తగ్గట్లు సామర్ధ్యాలను పెంచుకోవడం,అవకాశాలను అందుకోవడం దార్శనికత.ఇలాంటి ముందు చూపుతోనే రాష్ట్రాన్ని ముందుకు నడిపించింది చంద్రబాబు నాయకత్వం.

కోట్లాది తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వేగంగా ప్రజా రాజధాని నిర్మాణానికి నడుం బిగించారు.నిర్మాణం అంటే ఇసుక,ఇటుకలు,సిమెంట్ కాదని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ఆకారమని,కలలకు సాకారమని అమరావతి నిర్మాణం సాక్షిగా నిరూపించాలనుకొన్నారు. అమరావతిని అద్భుతంగా నిర్మించి తెలుగు ప్రజల తలరాతలు అపూర్వం చేయాలని చంద్రబాబు తపన పడ్డారు.అమరావతి నిర్మాణం పూర్తయితే ఐదు కోట్ల ప్రజల ప్రస్థానం మరో మలుపు తిరిగి ఐదు కోట్ల ప్రజల తలరాతలు అపూర్వం అయ్యేవి.

చంద్రబాబు పిలుపుకు స్పందించిన రైతులు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు భూములు ఇవ్వడం గర్వకారణం. చంద్రబాబు పాలనలో నవ్యాoధ్ర అద్భుత ప్రగతి సాధించింది.రాష్ట్రం ప్రపంచంలో ఎట్రాక్టీవ్ సెంటర్ గా,డెస్ట్రినేషన్ సెంటర్ గా ఎదిగింది. 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనలో ఆంద్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. సరికొత్త ప్రణాళికలు రచించి,ఆదాయ వనరులు పెంచి,రాష్ట్ర భవిష్యత్ తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు చెయ్యని కృషి లేదు. అతి వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను దేశం ముందు నిలిపారు చంద్రబాబు ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాలు అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా నిలిపారు. నిరుపేదలు, రైతులు, మహిళలు, కార్మికులు, దళితులు ఇలా అన్ని వర్గాల జీవనాన్ని గుణాత్మకంగా మార్చేందుకు బృహత్తర లక్ష్య సాధన కోసం విలక్షణమైన ఎన్నో సామాజిక పథకాలకు శ్రీకారం చుట్టి బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు చంద్రబాబు.

రాష్ట్రాన్ని  కరువు రహిత రాష్ట్రంగా మార్చాలన్న ధృఢ సంకల్పంతో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.70వేల కోట్లు ఖర్చు చేశారు. దశాబ్ధాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టును 70శాతం పూర్తిచేశారు.నదులు అనుసంధానం అనే ఆదర్సాన్ని నిజం చేసి చూపిన ఒక వజ్ర సంకల్పుడు చంద్రబాబు.ఎత్తిపోతల పధకం ద్వారా నిర్మించిన ఆధునిక దేవాలయం వల్ల పట్టిసీమ పవిత్రమయింది.

వరదలా వచ్చిన విదేశీ పెట్టుబడులు,లక్షల మందికి ఉపాధి కల్పన అన్ని ఉంటే పరిశ్రమలు రావడం పెద్ద విషయం కాదు.కానీ అన్ని కోల్పోయన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించి,పరిశ్రమలు ఆకర్షించి,ఉపాధి కల్పించి,అద్భుతాలు సృష్టించడం నవ్యాoధ్రలోనే సాధ్యమైంది. పారిశ్రామిక ప్రగతి పరుగుల వెనుక చంద్రబాబు కఠోర శ్రమ ఉంది.ఆయన హయాంలోవేలకోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయంటే చంద్రబాబు దక్షతే దానికి కారణం.అచేతనంగా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారో లేదో అన్న సందేహాలు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశంలోనే వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ను మొదటిస్థానంలో నిలిపారు చంద్రబాబు. ఆర్ధిక ఇబ్బందుల్లోనూ దేశంలో మరే రాష్ట్రం సాధించనంత వృద్దిరేటును ఆంధ్రప్రదేశ్ సాధించడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ వృద్దిరేటు 11.2శాతం ఉండగా అదే కేంద్ర వృద్దిరేటు 6.9శాతం మాత్రమే ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వృద్దిరేటు 17.1శాతం కాగా జాతీయస్థాయిలో అది 3.8శాతం మాత్రమే నమోదు అయింది.

సుధీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అంతే కాలం ప్రతిపక్షనాయకుడిగా కొనసాగారు.ఆయన ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి చేపట్టిన విన్నూత్న కార్యక్రమాలు యావత్ భారత దేశాన్నే కాక,ప్రపంచ ఆర్ధిక నిపుణులను ఆకర్షించాయి.ఐ టీ అంటే తెలియని రోజుల్లోనే హైదారాబాద్ లో ఐ టి రంగాన్ని అభివృద్ది చెయ్యడం చంద్రబాబుకే సాధ్యమైంది.ఆయన విశేష కృషికి అద్భుతవరం హైటెక్ సిటీ.భారీ వేతనాల తో కూడిన లక్షలాది ఉధ్యోగాలు,ఏటా వేల కోట్ల రూపాయల ఐటి ఎగుమతులు ఈరోజు సాధ్యమవుతున్నాయి అంటే ఆనాటి చంద్రబాబు కృషే కారణం.

బెంగుళూరు,ముంభై తో పోటీ పడి ఐటి రంగాన్ని హైదారాబాద్ ఆకర్షించడానికి చంద్రబాబు చొరవే కారణం.ఐటి ఇండియన్ ఆఫ్ ది మిలీనీయంగా ప్రసిద్ది పొందారు. హైదారాబాద్ లో బిజినెస్ స్కూలు,ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు,రోడ్ల విస్తరణ,కొత్తరోడ్ల నిర్మాణం,గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లకు రూపకల్పన,వంటి అద్భుత కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్దిని పరుగులు పెట్టించారు.ప్రాధమిక విద్య మొదలుకొని ఉన్నత విద్యవరకు ప్రోత్సాహం అందించారు.విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల ఎంతో మంది యువతీ,యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసింది.మహిళా సాధికారత సాధించాలని స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు.చంద్రబాబు చేపట్టిన అనేక సంస్కరణలు,అమలు చేసిన ప్రణాళికలు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.

ఆనాడు దూరదృష్టితో చంద్రబాబు నెలకొల్పిన బయోటెక్ పార్క్ నేడు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే ప్రక్రియలో భారత దేశాన్ని ముందు వరుసలో నిలిపింది.ఆయన పునాది వేసిన జీనోమ్ వ్యాలీ వైపు దేశమంతా చూసింది. అనేక విపత్తుల సమయాల్లో కార్యక్షేత్రంలో తానూ ముందుండి ప్రభుత్వ యంత్రాoగాన్నికార్యోన్ముఖులు చేసి విపత్తులు ఎదుర్కొన్న ఘనత చంద్రబాబు దే. ప్రత్యర్థుల సైతం ప్రశ్నించడానికి వీలు లేనంతగా కష్ట పడే తత్వం చంద్రబాబుది.అధికారం అనుభవించడం కోసం కాదని ప్రజలకోసం ఆహరహం శ్రమించడం కోసమని విశ్వసించే అరుదైన నాయకుడు చంద్రబాబు.భావితరాల శ్రేయస్సు కోసం నిరంతర ఆలోచనలతో విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో తనకు తానె సాటిఅని నిరూపించుకొన్న కార్యదక్షుడు. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంధి పలికి దేశ రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఒకానొక దశలో చంద్రబాబు ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా తన రాజకీయ జీవితమే కాదు,తన సేవ కూడా రాష్ట్రానికే అంకితం అని స్పష్టం చేసిన నాయకుడు చంద్రబాబు.

ఆధునిక భారత దేశపు  క్రాoతాదర్సుల్లో ఒకరు,గొప్ప క్రియా శీలిగా,ప్రగతి సాధకునిగా,ప్రేరణ శక్తిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం పొందిన  కార్యదక్షుడు అని  నేను ఎరిగిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు [అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపు అధినేత ]  రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు,తర్వాత ప్రజలకు ఎదో ఒకటి చెయ్యాలనే బృహత్ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మధ్యనే ఎక్కువగా గడపడం చంద్రబాబుకి అలవాటు. ఆ అలవాటే ఆయనకు ఉత్తమ రాజనీతి వేత్తగా మారేందుకు సహకరించింది.  పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలన్నదే ఆయన ఆశయం. అందుకు సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేశారు.

పదవి అంటే  అధికారం,అధికారం తెచ్చిపెట్టే  అహంకారం,అహంతో  వచ్చే తలబిరుసు కాదని,పదవి అంటే బాధ్యత,మరింత వినయంతో కూడిన కర్తవ్యపాలన అని నమ్మే,చేప్పే,ఆచరించే నాయకుడు చంద్రబాబు. ప్రజలే ముందు,ప్రజలే ముఖ్యం అని అధికారులకు చెప్పిన,పాలనలో నియమ నిబంధనలు గురించి చెప్పిన,పాలనలో  మానవీయత మరవద్దని చెప్పిన ఆదర్శనాయకుడు చంద్రబాబు. ఆయన అంకిత భావం,కృషి,పట్టుదల,నిబద్దత,ఆయన క్రాంత దర్శనం అమోఘం.ఆయన అనన్య పాలనా దక్షుడు.చేవగల నేత,గొప్ప సూక్ష్మ గ్రాహి,దార్శనికుడు,అలుపెరుగని కార్య శీలి అయిన చంద్రబాబు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ  రాష్ట్రప్రజలు,ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన అశేష అభిమానులు తరపున చంద్రబాబు గార్కి 71 వ జన్మ దిన శుభాకాంక్షలు.

-నీరుకొండ ప్రసాద్