తెలంగాణ బీజేపీలో వర్గపోరు

844

కిషన్‌రెడ్డి వర్గెస్ సంజయ్
కేటీఆర్‌ను కలవడంపై సీనియర్ల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

కేసీఆర్ సర్కారుపై పోరాడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్‌ను,  తమ పార్టీ సీనియర్లు ఒక కార్పొరేటర్ సీటు కోసం సమావేశం కావడంపై తెలంగాణ బీజేపీ సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. లింగోజీగూడ కార్పొరేటర్ ఏకగ్రీవ ఎన్నిక కోసం అభ్యర్ధించేందుకు తమ పార్టీ నేతలు కేటీఆర్ వద్దకు వెళ్లడం, అందుకు ఆయన సానుకూలంగా అంగీకరించడం వల్ల కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తాజా పరిణామాలు తెలంగాణ బీజేపీలో వర్గ విబేధాలను బట్టబయలు చేశాయి. లింగోజీగూడ కార్పొరేటర్ ఏకగ్రీవ ఎన్నిక వ్యవహారం.. కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి- రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య విబేధాల తోపాటు, ఆధిపత్య వర్గపోరును బయటపెట్టాయన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఓ వైపు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో సీరియస్‌గా పోరాడుతున్న సమయంలో, పోలింగ్‌కు ఒకరోజు ముందు.. హైదరాబాద్ జిల్లా పార్టీ నేతలు,  టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్- మంత్రి కేటీఆర్‌ను కలవడం వల్ల, టీఆర్‌ఎస్‌తో తాము రహస్య ఒప్పందం చేసుకున్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపించినట్టయిందని బీజేపీ నేతలు తలపట్టుకుంటున్నారు.

అసలు లింగోజీగూడ కార్పొరేటర్ ఎన్నిక ఏకగ్రీవంపై పార్టీలో ఏ స్థాయిలోనూ చర్చించలేదని, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లాలని అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఆదేశించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆ నిర్ణయం జిల్లా స్థాయిలో జరిగినప్పటయికీ, అందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి కూడా తీసుకోకవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేవలం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాల ప్రకారమే రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలు నిర్ణయం తీసుకుని, రాష్ట్ర అధ్యక్షుడిని లెక్కచేయకపోవడం బట్టి.. హైదరాబాద్-రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఏమాత్రం పట్టులేదన్న విషయం, మరోసారి స్పష్టమయిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో కూడా, రాష్ట్ర అధ్యక్షుడి ప్రమేయం లేకుండా కిషన్‌రెడ్డి-లక్ష్మణ్  ఇద్దరు అంతా తామై నిర్ణయాలు తీసుకున్నారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

ఓవైపు టీఆర్‌ఎస్‌తో పోరాటం చేస్తూ, మరోవైపు అదే పార్టీని కేవలం ఒక కార్పొరేటర్ సీటు కోసం ప్రాధేయపడటం వల్ల, కింది స్థాయి కార్యకర్తల్లో పోరాటపటిమ తగ్గడంతోపాటు.. పై స్థాయిలో అంతా అధికార పార్టీతో బాగుంటే, తాము మాత్రం అదే టీఆర్‌ఎస్‌పై పోరాడి అనవసరంగా కేసులపాలయి, కోర్టు చుట్టూ ఎందుకు తిరగాలన్న భావన పెరిగేందుకు ఈ పరిణామం కారణమవుతోంది.  ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కొందరు బీజేపీ అగ్రనేతలు,  వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటు సాకుతో కేసీఆర్‌తో భేటీ అయిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

ఎన్నికల ముందు తమ పార్టీకి చెందిన కొందరు అగ్రనేతలు, ఐదు నియోజకవర్గాల్లో తమపై బలహీనమైన అభ్యర్ధులను పెట్టాలని, టీఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారన్న విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని చెబుతున్నారు. సీఎంఓలోని ఒక అధికారి రాయబారిగా, బీజేపీలో ప్రస్తుత కీలక నేత వద్ద ప్రెస్‌నోట్లు, రిప్రజెంటేషన్లు రాసే ఉస్మానియాకు చెందిన ఓ ప్రొఫెసర్ నివాసంలో ఐదు స్ధానాల్లో సర్దుబాటు జరిగిన వైనం పార్టీలో అందరికీ తెలిసిందేనంటున్నారు.

ఆ ఘటన మర్చిపోకముందే, తమ పార్టీ నేతలు కేటీఆర్ వద్దకు వెళ్లడాన్ని క్యాడర్ ఏవిధంగా అర్ధం చేసుకోవాలని నేతలు ప్రశ్నిస్తున్నారు.
 ‘ఇప్పటికే మేం టీఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందం చేసుకుని, కాంగ్రెస్‌ను ఓడించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న భావన అందరిలో ఉంది. మొన్న కేసీఆర్ నాగార్జునసాగర్‌లో మా పార్టీని కాకుండా కాంగ్రెస్‌నే విమర్శించారు. కేసీఆర్- కేటీఆర్‌ను మా అధ్యక్షుడు సంజయ్ రోజూ తిడుతున్నా కూడా టీఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడి చేయడం లేదు. ఇవన్నీ బీజేపీ-టీఆర్‌ఎస్ సఖ్యతగా ఉన్నాయని సంకేతాలిచ్చేవే. ఇప్పుడు మా పార్టీ నేతలు నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడ కేటీఆర్‌ను కలసి లింగోజీగూడలో పోటీ చేయవద్దని కోరడం, ఆయన అందుకు అంగీకరించడం బట్టి,  క్యాడర్ మనోభావాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండ’ని ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఇప్పటికే నలుగురైదురు సీనియర్లు..  బండి సంజయ్‌ను ఏమాత్రం లెక్కచేయడం లేదని, ఆయనను ఇంకా ‘కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి నేత’గానే పరిగణిస్తున్నారన్న వ్యాఖ్యలు,  పార్టీ వర్గాల్లో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. కానీ సంజయ్ అధ్యక్షుడయిన తర్వాతనే, రాష్ట్రంలో బీజేపీ స్పీడు పెరిగిన విషయాన్ని విస్మరించకూడదని గుర్తు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా కిషన్‌రెడ్డి ..వరంగల్ అభ్యర్ధి ప్రేమేందర్‌రెడ్డికి ఎక్కువ  ప్రాధాన్యం ఇస్తే, సంజయ్ పెద్దగా పట్టించుకోలేదన్న  వ్యాఖ్యలు వినిపించిన విషయం తెలిసిందే. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికను సంజయ్ సీనియర్‌గా తీసుకుంటే, కిషన్‌రెడ్డి పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపించాయి.

మరోవైపు.. రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ కూడా ఎవరినీ పరిగణనలోకి తీసుకోకుండా, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న మరో విమర్శ వినిపిస్తోంది. ఆయన కూడా  రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను పెద్దగా సీరియస్‌గా తీసుకోకుండా, అంతా తానయి నడిపిస్తున్నారని, నిజానికి కిషన్‌రెడ్డి-సంజయ్ కంటే ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో మంత్రి శ్రీనివాసే  పవర్‌ఫుల్ నేతగా మారారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ-ఆర్గనైజేషన్ రెండింటిలోనూ ఆయనదే కీలకపాత్ర అంటున్నారు. ఇవన్నీ బీజేపీలో వర్గవిబేధాలు స్పష్టం చేసే అంశాలేనని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.