వచ్చే వారంలో కలెక్టర్ల బదిలీలు?

1060

విశాఖకు కడప కలెక్టర్?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక పరిపాలనలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా  కలెక్టర్ల బదిలీపై  కసరత్తు ప్రారంభించింది. నిజానికి మూడు నెలల క్రితమే కలెక్టర్ల బదిలీపై నిర్ణయం తీసుకున్నప్పటికీ, మధ్యలో ఎన్నికల కోడ్ రావడంతో బదిలీలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక, అంతకుముందు జడ్పీ ఎన్నికలు కూడా ముగియడంతో మళ్లీ బదిలీలపై దృష్టి సారించింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వచ్చే వారంలోనే పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ కానున్నారు. విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పనితీరు ఆధారంగా ఈ బదిలీలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కడప కలెక్టర్‌గా హరికిరణ్‌ను  విశాఖపట్నం బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత విశాఖ కలెక్టర్ పనితీరుపై స్థానిక వైసీపీ నేతలు సంతృప్తిగా లేరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన కార్యాలయంలో పెద్దగా అందుబాటులో ఉండరన్న ఫిర్యాదులున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకదశలో ఆయనను సీఎంఓకు బదిలీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది.  కానీ అదంతా ఒకవర్గం మీడియా కావాలని ప్రచారం చేసివట్లు తేలింది. మరొకవైపు ఆయన కూడా బదిలీ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా భూముల వ్యవహారంపై వస్తున్న ఒత్తిళ్లకు ఆయన తాళలేకపోతున్నారంటున్నారు. కాగా కడప కలెక్టర్ హరికిరణ్‌కు సమర్ధుడైన అధికారిగా పేరుంది.

అయితే గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్‌నూ మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు ఆయనను గుంటూరు కలెక్టర్‌గా నియమించారు. అయితే, విశాఖ కలెక్టర్‌గా ప్రస్తుతం కడప కలెక్టర్‌గా ఉన్న హరికి రణ్‌ను బదిలీ చేయవచ్చని తెలుస్తోంది. కాగా ఇప్పటివరకూ భరత్‌గుప్తను విశాఖ కలెక్టర్‌గా నియమించవచ్చని, ఆ మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి సిఫారసు చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.

ఇదిలాఉండగా, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఆయనతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సఖ్యతగా లేకపోగా, విబేధిస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సహా ఎవరూ కలెక్టర్ పనితీరుపై సంతృప్తితో లేరు. ఇటీవల ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి  ఆయనపై బహిరంగం విమర్శలు చేయడం, వివాదాస్పదంగా మారింది. దానిపై తెలుగు రాష్ట్రాల్లో దళిత సంఘాలన్నీ రోడ్డెక్కి, ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికే కలెక్టర్ వ్యక్తిగత వ్యవహారశైలి, దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో ఆయనను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మీడియా ప్రచారం కోసమే ఆయన పనిచేస్తారని, ఎవరికీ అందుబాటులో ఉండరన్నది  అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రధాన ఫిర్యాదు. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేస్తే, కులపరమైన మరో వివాదం తలెత్తే ప్రమాదం ఉందని సీఎంఓ భావిస్తోంది. అయితే ఒకవేళ ఆయనను తొలగిస్తే, ఆ స్థానంలో మరో దళిత అధికారినే నియమించవచ్చని ఓ ఉన్నతాధికారి వివరించారు.

ఇక వివేక్ యాదవ్‌ను గుంటూరు కలెక్టర్‌గా నియమించడం ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా, ఎస్‌ఈసీ ఆదేశాలను అమలు చేయడం అనివార్యమయినందున, ఆయనను కూడా మార్చే అవకాశం లేకపోలేదంటున్నారు. తాజాగా కార్తికేయ మిశ్రాను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం, ఆయన స్థానంలో పనిచేసిన ముత్యాలరాజును, సీఎంఓలో అదనపు కార్యదర్శిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు,  అప్పట్లో అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న  కార్తికేయ మిశ్రాను,  పశ్చిమ గోదావరి కలెక్టర్‌గా నియమించడంపై  వైసీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ అధికార మీడియాలో కూడా,  అప్పట్లో ఆయనపై కథనాలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, సీఎంఓలో చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి ఆశీస్సులతోనే, కార్తికేయ మిశ్రాకు ఆ పోస్టింగ్ దక్కినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు కీలకమైన పోస్టింగులు దక్కడం వెనక ఆ కీలక అధికారి ఆశీస్సులున్నాయని.. అందుకే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా  పనిచేసిన వారికి సైతం, తమ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉన్న  పోస్టింగులు దక్కుతున్నాయన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.