చంద్రబాబు చేతి నుంచి టీడీపీ జారిపోతుందా..?!!

594

(వై.వి. రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్)

“ఒక రాజును సింహాసనం మీద కూర్చోపెట్టడానికి తెగిపడిన కంఠాలెన్నో” కొన్ని వందల సార్లు  ఈ పాట విని ఉంటాను. చరిత్ర అంటే భవిష్యత్తు పాఠం. చరిత్ర అంటే భవిష్యత్తుకు దారి. చరిత్రను చదివి గుణపాఠం నేర్చుకోనివారు ఆ చరిత్రలో కలిసి పోతారు. ఒక రాజ్యం నిలబడలన్నా, ఓ పార్టీ బతకాలన్నా సిద్దాంత బలం ఉండాలి.  ఓ నినాదం , ఓ  సిద్దాంతం ఒక రాజ్యాన్ని నిలబెడతాయి, ఓ జెండాను ఎగరేస్తాయి. చరిత్రలో చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి. అధికారంలోకి వచ్చాయి. కాలగర్భంలో కలిసి పోయాయి. కారణం..సిద్దాంత బలం లేకపోవడం, జనాలను ఉప్పెనల ఉరికించేలా నినాదాలు లేకపోవడం. కాలానుగుణంగా మారకపోవడం. “ఒక రాజకీయ పార్టీ పుట్టుకకు కారణాలు చాలా ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ భూస్థాపితం కావడానికి కారణాలు కూడా అనేకం ఉంటాయి”. ఎప్పుడైతే ప్రజలను మరిచి రాజకీయ నేతలు తమ  స్వార్ధం కోసం ఆలోచించడం  మొదలు పెడతారో అప్పటి నుంచే ఆ రాజకీయ పార్టీ పతనం ప్రారంభమవుతుంది.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఓ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడానికి సిద్దమైంది. ఆ పార్టీనే తెలుగు దేశం పార్టీ.

తెలుగు దేశం పార్టీ  మార్చి29, 1982లో బలమైన సిద్దాంతంతో పుట్టింది. అప్పటి వరకు వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. కార్మికులు, కర్షకులు, బడుగు, బలహీన వర్గాలే పునాదిగా టీడీపీ ఏర్పడింది. తెలుగు దేశం పార్టీ పుట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ వ్యతిరేకత, తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంగా పుట్టిన తెలుగు దేశం పార్టీ జనవరి9, 1983న అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 10వ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు.

భారత దేశ రాజకీయ చరిత్రలో తెలుగు దేశం పార్టీ ఓ సంచలనం. 1984 -89 మధ్య కాలంలో టీడీపీ లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. ఎన్టీఆర్‌ ముక్కు సూటితనం,  రాజకీయ అనుభవం లేకపోవడంతో తెలుగు దేశం పార్టీ అనేక ఒడిదుడుకులు గురైంది. 1983లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి చంద్రగిరిలో  చంద్రబాబు ఓడిపోయారు.  కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీలో చేరమంటే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును చంద్రబాబు అవమానించి పంపారు .  1983లో తెలుగు దేశం  అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్‌ సీఎం అయిన తరువాత మామకు దగ్గర కావడం ప్రారంభించారు. అప్పటికే రాజకీయ అనుభవం లేక ఎన్టీఆర్‌ టీమ్ ఇబ్బంది పడుతుంది. కాంగ్రెస్‌ తెరచాటు రాజకీయాలను ఎదుర్కోలేని పరిస్థితి. ఈ గ్యాప్‌నే చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుని మామ ఎన్టీఆర్‌కు దగ్గర కావడం ప్రారంభించారు. నాదెండ్ల భాష్కర రావు తిరుగుబాటు సమయంలో అన్నీ తానై చంద్రబాబు వ్యవహరించి ఎన్టీఆర్‌ మెప్పు పొందారు. అలా ఎన్టీఆర్‌కు దగ్గరైన చంద్రబాబు తన గ్రూప్‌ను పెంచుకోవడంపై దృష్టి పెట్టారు.

టీడీపీలోకి చంద్రబాబు రాకతోనే ఎన్టీఆర్‌ సీటుకు చాప కింద నీరయ్యారు. ఎన్టీఆర్‌ మంచితనం, అమాయకత్వాన్ని, రాజకీయంగా అనుభవం లేకపోవడాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
1989లో టీడీపీ ఘోరంగా ఓడి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.  1983లో  289 సీట్లలో పోటీ చేసి టీడీపీ 201 సీట్లు గెల్చుకుంది.  1985లో  250 సీట్లలో పోటీ చేసి 202 సీట్లలో విజయం సాధించింది.   1989కి వచ్చేసరికి  241 సీట్లలో పోటీ చేసి కేవలం 74 సీట్లను మాత్రమే ఎన్టీఆర్ గెల్చుకున్నారు.  1989 – 94 మధ్యలో టీడీపీ అనేక ఒడుదుడుకులకు లోనైంది. ఎన్టీఆర్ కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్‌కు లక్ష్మీ పార్వతీ దగ్గరైంది. ఆ తరువాత ఎన్టీఆర్‌ భార్య అయింది.1994 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ – లక్ష్మీ పార్వతి కలిసి పార్టీ ప్రచారం చేశారు. 1994లో టీడీపీ 251 సీట్లలో  పోటీ చేసి 216 సీట్లు గెల్చుకుంది.  కాంగ్రెస్ కేవలం 26 సీట్లకే పరిమితమైంది.

ఎన్టీఆర్ చేతిలో టీడీపీ ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగింది. ఎన్టీఆర్‌కు  రాజకీయాలు తెలియకపోవచ్చు. ఎన్టీఆర్‌కు పార్టీ ఎలా నడపాలో అవగాహన లేకపోవచ్చు. కానీ..ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో ఎన్టీఆర్‌కు తెలుసు. ఎన్టీఆర్‌కు కుల,మత. ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎన్టీఆర్‌కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉండేది. ఎప్పుడైతే టీడీపీ ఎన్టీఆర్‌ చేతి నుంచి చంద్రబాబు చేతిలోకి వచ్చిందో పతనం కావడం ప్రారంభమైంది. సెప్టెంబర్ 1, 1995న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రోజునే టీడీపీ పతనానికి పునాది పడింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ మారుమూల గ్రామాల్లోకి కూడా చొచ్చుకెళ్తే..చంద్రబాబు చేతిలోకి వచ్చాక టీడీపీ ఆ గ్రామాల నుంచే పతనం కావడం ప్రారంభమైంది.

దూరంగా ఉండి పంచె లాగడం కంటే దగ్గరుండి పంచె లాగడం సులభం. ఇది తెలుగు నాట సామెత. ఈ సామెతనే రాజకీయ సూత్రంగా  ఎన్టీఆర్‌ మీద చంద్రబాబు ప్రయోగించారు. ఎన్టీఆర్‌కు దూరంగా ఉంటే ఆయనను పడగొట్టడం కష్టమని గ్రహించిన చంద్రబాబు నమ్మకంతో దగ్గరై కూల్చేశారు.  సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు ప్రజలకు దగ్గర కావడం ప్రారంభించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవటంలో తనకు సహకరించిన ఎల్లో మీడియాతో ప్రజలకు దగ్గర కావాలనుకున్నారు. తనను గొప్ప విజనరీగా ఎల్లో మీడితో రాయించి, చూపించారు. తాను 18  గంటలు కష్టపడుతున్నానని రాయించుకున్నాడు.  ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాని ఎల్లో మీడియాలో గంటలుగంటలు చూపించుకున్నారు. మేధోపథనం, కసరత్తులు అనే పదాలు ఎల్లో మీడియా చంద్రబాబును ఎత్తడానికి బాగానే వాడింది. తనను వ్యక్తిగతంగా బలోపేతం చేసుకోవడంపై  దృష్టి పెట్టిన చంద్రబాబు పార్టీని మరిచిపోయారు. తాను బలంగా ఉంటే పార్టీ బలంగా ఉన్నట్లేనని చంద్రబాబు భావించి ఉంటారు. ఇది తప్పు. పార్టీ బలంగా ఉంటేనే నాయకుడు బలంగా ఉంటాడు. ఈ వాస్తవాన్ని చంద్రబాబు మరిచి పోయారు. కార్యకర్తల పార్టీని కార్పొరేట్ పార్టీ చేశారు. కార్యకర్తల భుజాల మీద మోసే జెండాను కార్పొరేట్, బ్యాంక్ డిఫాల్టర్ల కార్లకు కట్టించాడు. దీంతో  2000 సంవత్సరం ముందు నుంచే కార్యకర్తలు టీడీపీకి దూరం కావడం ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ను పడగొట్టడానికి లక్ష్మీ పార్వతిపై” రాజ్యాంగేతర శక్తి” అనే ముద్ర వేయించి అబద్దాలు ఆడారు. అటువంటి అబద్దాలనే  నాటి నుంచి నేటికి చంద్రబాబు నమ్ముకోవడం దురదృష్టకరం.

చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి  ఏడాది 1996లో లోక్‌ సభకు ఎన్నికలు జరిగితే  16 సీట్లు మాత్రమే వచ్చాయి.   ఆ తరువాత 1998లో కూడా లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ గెలిచిన సీట్లు  కేవలం 12. ఉమ్మడి ఏపీలో 42 లోక్ సభ సీట్లు ఉంటే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. సీఎంగా  బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్ కోసం ఎంత ప్రయత్నించినా, ఎల్లో మీడియా చేత విజనరీనని ప్రచారం చేయించుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. చంద్రబాబుకు కూడా తన ఇమేజ్‌ ఏంటో అర్ధమైంది.  1999లో వాజ్‌పేయి వేవ్ బాగుంది. కార్గిల్ యుద్ధంలో వాజ్‌పేయి నాయకత్వంలో పాకిస్థాన్‌పై భారత్ గెలిచింది. సింగిల్‌గా పోటీ చేస్తే టీడీపీ గెలవదని భావించిన చంద్రబాబు బీజేపీకి జై కొట్టారు. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి దయతో 29 లోక్‌సభ సీట్లు, 180 అసెంబ్లీ స్లానాలు గెల్చుకున్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా, వాజ్ పేయి వేవ్ లేకుండా ఉంటే 1999లో చంద్రబాబు రాజకీయ జీవితం డాక్టర్ వైఎస్ఆర్‌ చేతిలో ముగిసి ఉండేది. కానీ..చంద్రబాబు తన దురదృష్టానికి వాజ్ పేయి వేవ్‌ను అడ్డేసి కార్గిల్ వీరుల శవాలపై ఓట్లు వేరుకున్నారు. అంతేకాని..చంద్రబాబు ముఖం చూసి తెలుగు ప్రజలు ఓట్లు వేయలేదు. దీనిని కూడా ఎల్లో మీడియా చంద్రబాబు తెలివితేటలు వల్లనే టీడీపీ గెలిచిందని, చంద్రబాబు దయతోనే 1999లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిందని ప్రచారం చేసింది. కాని..గ్రౌండ్ లెవల్లో వాస్తవాలను వేరేగా ఉన్నాయి.

1999 నుంచి టీడీపీలో కార్యకర్తలు కనుమరుగై కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లు , బడా వ్యాపారస్తులు పట్టు బిగించడం ప్రారంభించారు. కార్యకర్తల నుంచి కమీషన్లు రావు కాబట్టి చంద్రబాబు కూడా కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించారు. విజనరీనని అని ప్రచారం చేయించుకునే చంద్రబాబుకు దూరదృష్టి లేదు. వ్యవస్థలను మేనేజ్ చేసినట్లు సమస్యలు పరిష్కరించలేకపోయారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో చంద్రబాబు నేల విడిచి సాము చేశారు. రైతులను పట్టించుకోలేదు. విద్యుత్‌ ఉద్యమాన్ని ఉక్కుపాదంలో అణచి వేశారు. ప్రశ్నిస్తే పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో వేసేవారు. రైతులకు సంకెళ్లు వేసి పీఎస్‌ల్లో వేశారు. రైతుల ఇళ్లను, ఆస్తులను జప్తు చేశారు. చంద్రబాబుపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.  ఈ సమయంలోనే అలిపిరిలో  చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేశారు. తృటిలో ప్రాణాపాయం నుంచి చంద్రబాబు బయటపడ్గారు. ఆ సానుభూతి నుంచి ఓట్లు దండుకోవాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎన్టీఏ పెద్దలను ఒప్పించి ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో తాను మునిగిందే కాకుండా వాజ్‌పేయిని కూడా చంద్రబాబు ముంచేశారు.  2004లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది.  చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 47  అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.  టీడీపీ 5 లోక్ సభ సీట్లుమాత్రమే గెల్చుకుంది . ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రజలు ఇంత ఘోరమైన ఓటమిని కట్టబెట్టినా చంద్రబాబు మారలేదు. తన ఓటమికి ప్రజలదే తప్పు అన్నట్లు మాట్లాడేవారు. ప్రపంచానికి ఐటీని పరిచయం చేసింది తానేనని, తనను ఓడించి తెలుగు ప్రజలు చారిత్రక తప్పిదం చేశారని అన్నట్లు చంద్రబాబు వ్యవహార శైలి ఉండేది. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ఆర్‌ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు చేసుకుని పాలన చేశారు. 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీలు, పేదలకు మరింత దగ్గరయ్యారు. చంద్రబాబు ఐటీ అంటే వైఎస్ఆర్‌ అగ్రి అని నినదించి రైతును రాజును చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను ఓడించడానికి చంద్రబాబు మహాకూటమి కట్టారు. మరోవైపు చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం.  చంద్రబాబు నాయకత్వంలోని మహాకూటమి, ప్రజారాజ్యాలను ఎదుర్కొని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌కు విజయాన్ని సాధించి పెట్టారు. గెలిచింది 156 సీట్లు అయినా మరోసారి ప్రజలు చంద్రబాబును నమ్మకుండా వైఎస్‌ఆర్‌ వెంట నిలిచారు. 33 లోక్‌సభ సీట్లు కూడా గెలిచి యూపీఏ -2 కు వైఎస్‌ఆర్‌ ఆక్సిజన్ అందించారు.

సెప్టెంబర్ 2, 2009లో వైఎస్ఆర్ అకాల మరణం తరువాత తలెత్తిన రాజకీయ పరిణామాలను ఎదుర్కోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. విశాల దృక్పథంతో కాకుండా స్వార్ధంగా ఆలోచించారు.
వైఎస్‌ఆర్‌ మరణం తరువాత ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమం విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం పాటించి నిండా మునిగిపోయారు. తెలంగాణలో ఆ ప్రాంత టీడీపీనేతలను, సీమాంధ్రలో ఈ  ప్రాంత టీడీపీ నేతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూశారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని రెండు సార్లు లేఖ ఇచ్చారు. తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఓ మాట మాట్లాడుతూ ప్రజల విశ్వసనీయతను కోల్పోయారు చంద్రబాబు. వైఎస్‌ఆర్‌ మరణంతో కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని అణచడానికి కుట్రలకు చంద్రబాబు పదును పెట్టారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని కాంగ్రెస్‌తో తెర వెనుక రాజకీయాలకు పదును పెట్టి వైఎస్ జగన్‌ను అకారణంగా జైల్లో వేయించారు. దీంతో..ప్రజల్లో వైఎస్‌ జగన్‌పై సానుభూతి, చంద్రబాబుపై కోపం పెరిగాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడం ఖాయమని ఢిల్లీకి కూడా అర్ధమైంది. వైఎస్ జగన్‌ను రాజకీయంగా అడ్డుకోవడానికి రాష్ట్ర విభజన చేయడమే మార్గమని సోనియా కోటరీ నిర్ణయించింది. కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీమాంధ్రకు పరిమితం చేయడానికే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఇస్తే 17 లోక్‌ సభ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలవొచ్చు అనేది కాంగ్రెస్ ఆలోచన. రాహుల్ గాంధీ పీఎం కావడానికి తెలంగాణలోని లోక్‌సభ స్థానాలు ఎంతోకొంత ఉపయోగపడతాయని సోనియా భావించి  ఉండొచ్చు. సీమాంధ్రలోని 25 లోక్ సభ స్థానాలను  కాంగ్రెస్ వదిలేసుకుంది. కానీ..దిగ్విజయ్‌కు కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పడంతో కాంగ్రెస్ కుదేలయింది. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఆ తరువాత మాట తప్పారు.

రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్‌పై సీమాంధ్రులు ఆగ్రహంగా ఉన్నారు. సీమాంధ్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేవ్ కొనసాగుతోంది. ఇది గమనించిన చంద్రబాబు తన నక్క జిత్తులకు పదును పెట్టారు. మోదీనే తమ ప్రధాని అభ్యర్ధి అని అప్పటికే బీజేపీ ప్రకటించింది. వైఎస్ జగన్‌తో పొత్తుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. కానీ..తాను ఒంటరిగారు బరిలోకి దిగాలని అనుకుంటున్నట్లు జగన్ బీజేపీకి స్పష్టం చేశారని సమాచారం. ఇదే  అదునుగా చంద్రబాబు బీజేపీ నేతలకు  దగ్గరయ్యారు. 2004లో బీజేపీ వల్లనే ఓడిపోయాను, కమలనాధుల ముఖం జన్మలో చూడనని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు దానిని మరిచి పోయి పొత్తు కోసం కమలనాధుల కాళ్లు పట్టుకున్నారు. అప్పటికే రాష్ట్రం విడిపోయి సీమాంధ్ర దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పెట్టిన కాంగ్రెస్‌ను పట్టించుకునేవారే లేకుండా పోయారు.
దేశంలో మోదీ వేవ్ బలంగా ఉంది. మరోవైపు తనకు పాలనా అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకుంటున్నారు.  600 దొంగ హామీలు ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్. బీజేపీ – జనసేనతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచారు. దశాబ్దం పాటు ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ చంద్రబాబు పాఠాలు నేర్చుకోలేదు. తాను మారానని ఎన్నికలకు ముందు పదేపదే చెప్పుకున్న చంద్రబాబు  మారలేదని రుజువైంది.

2014లో సీఎంగా ప్రమాణంచేసిన తరువాత చంద్రబాబు ప్రజాసంక్షేమం, రాష్ట్ర  ఆర్దిక వ్యవస్థ మీద దృష్టి పెట్టకుండా క్షుద్ర రాజకీయాలకు పదును పెట్టడం ప్రారంభించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఓటుకు కోట్లు ఎరవేశారు. దీంతో కేసీఆర్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని కరకట్ట మీద వచ్చి పడ్డారు. ఇక్కడ కూడా ప్రజారాజధానిని కాకుండా కులరాజధానిని నిర్మించి ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్నారు. రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర లేపారు. సింగపూర్‌తో ఒప్పందమని రైతుల భూములు కట్టబెట్టారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలి దోచుకోవడం – దాచుకోవడం మీద దృష్టి పెట్టారు. 2019 ఎన్నికలకు 15 రోజుల  ముందు రూ.5వేల కోట్లు అప్పు తెచ్చి..సీఎంగా వైఎస్ జగన్‌  ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు ఉంచారంటే  చంద్రబాబు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. పసుపు – కుంకుమ పేరుతో మహిళల ఓట్లు దండుకోవాలని చూసి వారి చేత చంద్రబాబు ఉప్పు – కారం  కొట్టించుకున్నారు. 5 ఏళ్లపాటు అధికారాన్ని దోచుకోవడానికి ఉపయోగించి, ఎన్నికల సమయంలో తాయిళాలు ప్రకటిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో 2019 ఎన్నికలు చూపించాయి. 2019 ఎన్నికల్లో  టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. వారిలో నలుగురు వైఎస్ఆర్ సీపీకి దగ్గరయ్యారు. వైఎస్‌ఆర్ సీపీ గేట్లు ఎత్తితే టీడీపీలో చంద్రబాబు, బాలకృష్ణ తప్పితే ఎవరూ మిగలరు. అయినా..చంద్రబాబు తన మైండ్ సెట్ మార్చుకోవడం లేదు.

2019 ఎన్నికల ఫలితాలు తరువాత టీడీపీ పతనం వేగం పుంజుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలులో కులం, మతం. ప్రాంతం. రాజకీయాలు చూడమని చెప్పిన జగన్ అమలు చేసి చూపిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, విద్యా, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు ప్రజల్లో సీఎం వైఎస్ జగన్‌పై నమ్మకం పెరిగేలా చేశాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీన,14 ఏళ్లు సీఎంగా చేశాను అని చెప్పుకోవడమే కానీ..చంద్రబాబు రాష్ట్రానికి చేసిందీ ఏమీ లేదనే ఫీలింగ్ ప్రజల్లోనే కాదు టీడీపీ కార్యకర్తల్లో కూడా రోజురోజుకు బలపడుతుంది.  దీనికి తోడు లోకేష్ టీడీపీ భారమయ్యారు. లోకేష్ ఉంటే టీడీపీ బాగుపడదని కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా “వాడే బాగుంటే పార్టీకి ఈ పరిస్థితి రాదు”అనే మాటలు పార్టీలో పెనుదుమారాన్నే లేపాయి. “17 తరువాత పార్టీ లేదు – బొక్కా లేదు”అన్న  అచ్చెన్నాయుడి  మాటలు టీడీపీ భవిష్యత్తును కళ్లకు కడుతున్నాయి. అచ్చెన్నాయుడి మాటలు చంద్రబాబు బలహీన నాయకత్వాన్ని తెలియజేస్తున్నాయి. చంద్రబాబుకు పార్టీ మీద పట్టు జారిపోతుందని చెప్పడానికి అచ్చెన్నాయుడు మాటలే నిదర్శనం. అమరావతి భూకుంభకోణం నుంచి బయటపడటానికి టీడీపీని చంద్రబాబు బీజేపీలో విలీనం చేస్తారనే వార్తలు కూడా కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.  చంద్రబాబు మీద కార్యకర్తలకు నమ్మకంపోయేలా చేశాయి. దీనికి తోడు పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం చంద్రబాబు నాయకత్వంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. జెడ్పీటీసీ,  ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకోవడంతోనే చంద్రబాబు పని అయిపోయిందని టీడీపీ నేతలే అంటున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలో కూడా బాబును అంటిపెట్టుకుని ఉన్న అశోక్ గజపతి పొలిట్ బ్యూరో సమావేశానిక గైర్హజరయ్యారంటేనే చంద్రబాబుకు ఆయన ఇస్తున్న విలువ  ఏపాటిదో అర్ధమవుతుంది.

తిరుపతి లోక్‌ సభ  ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్‌ల ప్రచార సరళిపై  టీడీపీ నేతలు, కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. తిరుపతికి తామేమీ చేశామో చెప్పుకోకుండా కుల, మతాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూడటంపై సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు. సమాజాన్ని చీల్చి ఓట్లు దండుకోవడమే చంద్రబాబుకు తెలుసంటూ తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెగిటివ్ రాజకీయాలకు కాలం చెల్లిందనే విషయాన్ని చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ గ్రహించలేకపోతున్నారు. అందుకే..టీడీపీ  సభల్లో, సమావేశాల్లో జూనియర్ ఎన్టీఆర్‌ పేరు వినిపిస్తుంది. జూనియర్ పేరు వినబడటం చంద్రబాబు, లోకేష్‌లకు కడుపు మంటగా ఉన్నప్పటికీ ఏం అనలేని పరిస్థితి..!. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తరువాత చంద్రబాబు చేతి నుంచి టీడీపీ జెండా వేగంగా జారిపోయే అవకాశముంది. 2024 ఎన్నికలను టీడీపీ చంద్రబాబు నేతృత్వంలో ఎదుర్కొన్నప్పటికీ ఓడిపోవడం ఖాయం. ఆ తరువాత టీడీపీ జెండాకు ఓనర్ ఎవరు అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది..!!.

సీనియర్  ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కాపాడుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్‌ రావాల్సిందేనా..?. 2024 తరువాత టీడీపీ జెండా నారా వారి చేతుల్లోంచి మళ్లీ నందమూరి వారి చేతుల్లోకి వెళ్లనుందా..?!!. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎంత అవమానకరంగా దించేశాడో, అంతే అవమానకరంగా చంద్రబాబు చేతుల్లోంచి టీడీపీ జెండాను లాక్కోవడానికి ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నాయనడంలో సందేహం లేదు. కార్యకర్తల నినాదాల్లోంచి పుట్టినవే ఆ ప్రణాళికలు..!!.