బీజేపీని నమ్మి పగిలిపోయిన పవన్ ‘గ్లాసు’

855

ఖమ్మం, వరంగల్ ఎన్నికల్లో ‘గుర్తు’ గాయబ్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక సినిమాలో వంటపాత్రలో ఉన్న బ్రహ్మానందం..  గోడపై ఉన్న తన తండ్రి ఫొటోను పదేపదే చూస్తూ ‘‘ ఒరేయ్.. నువ్వలా చేసి ఉండకపోతే ఇప్పుడు నాకీ ఖర్మ పట్టేదికాదు’ అంటూ తన దుస్థితి గుర్తుకొచ్చినప్పుడల్లా, తండ్రిని తిడుతుంటాడు. అది సినిమాలో కామెడీ సీన్. ఇప్పుడు రాజకీయాల్లో జనసేనాధిపతి పవనన్న దుస్థితి కూడా సేమ్‌టు  సేమ్! ‘‘ ఆరోజు మొహమాటానికి పోకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఇప్పుడు ఈ ఖర్మ పట్టేదికాదని’’ బీజేపీ ఫొటోను చూస్తూ, తనను చూసి తానే జాలిపడే దుస్థితి. కాకపోతే బ్రహ్మానందానిది కామెడీ. పవనన్నయ్యది ట్రాజెడీ. మిగిలినదంతా సేమ్ టు సేమ్!

మొహమాటానికిపోతే ఎవరికో ఏదో అయినట్లు..   బీజేపీతో కోరి మరీ స్నేహం చేసినందుకు  జనసేన  అధినేత పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మకమైన తన పార్టీ గుర్తునే కోల్పోవలసి వచ్చింది. ఇది తెలంగాణలోని జనసైనికులకు ఆవేదన మిగిల్చింది.  మొన్నటికి మొన్న.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేయనందుకు, గ్లాసు గుర్తును నవతరం పార్టీ ఎగరవేసుకువెళ్లింది. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్  కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీతో మొహమాటానికి పోయినందుకు, జనసేన ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. బీజేపీ చేతిలో అవమానాల పాలవుతున్న వవన్‌కు ఇది రాజకీయంగా శరాఘాతంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్  ఎన్నికల్లో పోటీచేయాలని చాలాకాలం నుంచీ రంగం సిద్ధం చేసుకున్న జనసేన శ్రేణులకు.. ఇప్పుడు ఆ పార్టీ ‘గ్లాసు గుర్తు’ దూరమయింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం వల్ల, ఎన్నికల సంఘం  సాంకేతికంగా జనసేనకు ఖమ్మం వరంగల్ ఎన్నికల్లో గ్లాసు గుర్తు కేటాయించేందుకు నిరాకరించింది. స్థానిక ఎన్నికల్లో 10 శాతం సీట్లలో కూడా పోటీ చేయని కారణంగా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ గుర్తును జనసేనకు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్ధులు ఎవరు కోరుకుంటే వారికి కేటాయిస్తారు.

కాగా తాజా పరిణామాలు జనసేనను ఖంగుతినిపించాయి. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన దాదాపు 40 డివిజన్లలో పోటీ చేసేందుకు సిద్ధమయింది. వాటిలో కొందరు నామినేషన్లు కూడా వేశారు. అయితే తెలంగాణ బీజేపీ కాపు అగ్రనేతలు రంగంలోకి దిగి పవన్ కల్యాణ్‌ను బుజ్జగించారు. దానితో మెత్తబడిన పవన్, తమ పార్టీ అభ్యర్ధులు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయరని హామీ ఇచ్చారు. అయితే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఆ పరిణామంలో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలి, తమను అవమానపరిచిందన్న వ్యాఖ్యలు జనసేనలో వినిపించాయి. ఆ పరాభవాన్ని మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుర్తు చేసుకున్న పవనన్నయ్య.. చివరాఖరన టీఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నట్లు ప్రకటించి, అందరినీ హాశ్చర్యపరిచారు.

మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 10 శాతం స్థానాల్లో పోటీ చేయకపోతే, మిగిలిన ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆయా పార్టీలకు సొంత గుర్తులు కేటాయించదు. ఇది రాజకీయ పార్టీలు స్థాపించిన వారికి తెలుసు. అయితే దానిపై   పవన్‌కు అవగాహన లేకపోవడమే, తాజా చేదు అనుభవానికి కారణంగా కనిపిస్తోంది. కనీసం పార్టీకి చె ందిన సీనియర్లు కూడా రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించకపోవడంతో, రెండు కార్పొరేషన్లలో గ్లాసు గుర్తుతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సంఘటనతో, జనసేన అధినేత పవన్‌కు సరైన సలహాలిచ్చే వారు లేరన్నది మరోసారి స్పష్టమయింది.   ‘అత్తారింటికిదారేది’ సినిమాలో.. ‘‘ఎవడిది వాడే పట్టుకోవాల్రోయ్. అవతలోడిది పట్టుకోవాలనుకుంటే ఇదిగో ఇలానే ఉంటద ’న్న పవన్ డైలాగును ఇప్పుడు..  గ్లాసు గుర్తు దక్కించుకునే అభ్యర్ధులు ఆయనకే అప్పచెబుతారేమో? మొత్తానికి తెలంగాణ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘గ్లాసు’ పగిలిపోయింది. తన ‘గ్లాసు’ను మరొకరు లాక్కుని పోటీ చేస్తే ఆ కిక్కే వేరప్పా!