జగన్ రెడ్డి కాదు..జాంబీరెడ్డి..

511

– నారా లోకేష్ ఎద్దేవా

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి జాంబీ రెడ్డిలా తయారయ్యాడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సంక్షేమం లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వారికి ఆనందం వస్తుందని,కానీ జాంబీరెడ్డికి టిడిపి నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టడం,అరెస్ట్ చెయ్యడంలోనే ఆనందం వస్తుందని ఆయన విమర్శించారు. గురువారం నాడు అనపర్తి నియోజకవర్గం రామవరం వచ్చిన లోకేష్ ఇటీవల అక్రమ కేసులలో ఇరుక్కుని వేధింపులకు గురయిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న జాంబీరెడ్డి రెండేళ్ల పాలనలో 25 మంది టిడిపి కార్యకర్తలను హత్య చేయించాడని లోకేష్ ఆరోపించారు. రోజుకో టిడిపి నాయకుడిపై కేసు.. రెండు రోజులకో అరెస్ట్… ఇవ్వన్నీ టివిలో చూసి తాడేపల్లి కొంపలో జాంబీరెడ్డి తొడ కొట్టుకోవడం నిత్యకృత్యంగా మారిందని ఆయన విమర్శించారు. అనపర్తిలో గత రెండేళ్ళుగా  అభివృద్ధి నిల్లు…అవినీతి ఫుల్లు.. అని ఆయన వ్యాఖ్యానించారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి కాదు ఆయన యాక్టర్  సూర్యనారాయణరెడ్డి అని విమర్శించారు. అనపర్తిలో టిడిపి నేత రామకృష్ణారెడ్డి యాక్టర్ సూర్యనారాయణరెడ్డి అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తు చేశారు.
ఇందులోముఖ్యంగా 10 అంశాలు ఉన్నాయని లోకేష్ వివరించారు.
    కాపవరంలో గ్రావెల్ మాఫియా గుట్టు రామకృష్ణారెడ్డి  బయటపెట్టారని చెప్పారు. నాగార్జునా ఫెర్టిలైజర్స్ కి చెందిన 200 ఎకరాల భూమి పట్టాలు ఇవ్వడానికి తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం  పొజిషన్ తీసుకోక ముందే 400 కోట్ల విలువైన గ్రావెల్ ను  యాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, దోపిడీ చంద్రశేఖరరెడ్డి అక్రమంగా తరలించారని ఆయన ఆరోపించారు. దీనిని రామకృష్ణారెడ్డి ఆధారాలతో సహా స్కామ్ బయటపెట్టి అక్రమ మైనింగ్ అడ్డుకున్నారని, రూ.1.22 కోట్లు పెనాల్టీ కట్టేలా చేసారని గుర్తు చేశారు. దొంతమూరు గ్రావెల్ మాఫియాలో పర్మిషన్ లేని భూముల్లో ఎమ్మెల్యే బినామీలు వీర్రాజు, శ్రీనివాస రావు మైనింగ్ చేస్తూ కోట్లు మింగుతున్నారని, ఈ ఇద్దరూ తెల్ల రేషన్ కార్దుదారులని ఆయన చెప్పారు.  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుకునే వీళ్లు మైనింగ్ శాఖకు లక్షల్లో సెస్ ఎలా చెల్లిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పేదలకు పట్టాలు ఇవ్వడానికి అని 18 ఎకరాలు సేకరించారని, ఆ భూములలో  పైన హెచ్.టి విద్యుత్  లైన్, కింద గ్యాస్ పైప్ లైన్, వరద వస్తే ఏడు అడుగుల నీరు నిలుస్తుందని చెప్పారు.  కనీసం రూ. 5లక్షలు విలువ చెయ్యని భూమిని ఎకరం రూ. 60 లక్షలకు కొన్నారని, పేదల పేరుతో యాక్టర్ సూర్యనారాయణరెడ్డి భూదందాని రామకృష్ణారెడ్డి బయట పెట్టారని లోకేష్ తెలిపారు. ఒక్క భూసేకరణ లోనే ఎమ్మెల్యే వాటా 5 కోట్లు అని ఆయన ఆరోపించారు.  ఆఖరికి బిసి, ఎస్సి శ్మశానాలు కూడా కొట్టేయాలని ఈ దుర్మార్గులు చూశారని లోకేష్ మండిపడ్డారు.
      ఇక అనపర్తి పేకాటకి డెన్ గా మారిపోయిందని, 8 పేకాట క్లబ్బులు ఇక్కడ  నడిపిస్తున్నారని, వీటి ద్వారా  నెలకి యాక్టర్ సూర్యనారాయణరెడ్డి 50 లక్షలు ఆదాయం వస్తోందని ఆయన ఆరోపించారు. జాంబీ రెడ్డి స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ లాంటి చెత్త లిక్కర్ తెస్తే నేను మాత్రం తక్కువ తిన్నానా అని యాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అనపర్తిలో నాటుసారా తెచ్చారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటుసారా తాగి దళిత యువకుడు మరణించాడని ఆయన విచారం వ్యక్తం చేశారు.
తూకంలో మోసం చేసి  దొంతమూరులో ఒక పామాయిల్ కంపెనీ  రైతులను రూ. 5 కోట్ల మేర మోసం చేసిందని, ఈ వ్యవహారంలో న్యాయం చేస్తానన్న ఎమ్మెల్యే 50 లక్షలు రైతులకు ఇచ్చి 2 కోట్లు కొట్టేశారని ఆయన ఆరోపించారు.  కరోనాని కూడా క్యాష్ చేసుకున్న ఘనత యాక్టర్ సూర్యనారాయణ రెడ్డికే దక్కుతుందని లోకేష్ ఎద్దేవా చేశారు. కరోనా పేరుతో రూ. 2 కోట్లు వసూలు చేసి సీఎం సహాయనిధికి రూ.69 లక్షలు మాత్రమే చెల్లించారని,  మరి మిగిలిన మొత్తం యాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తిన్నారా? అని ఆయన నిలదీశారు. బావమరిది కాలేజీ కోసం రూ. 20 కోట్ల విలువైన భూమి కొట్టేయడానికి 100 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారని, అనపర్తిలో ఆంజినేయ నగర్ రహదారి మూసేశారని ఆయన విమర్శించారు. దీంతో అరుణ కుమారి అనే మహిళ నా చావుకి కారణం ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చెప్పారు. ఇక పోలీసుల అక్రమ కేసుల విషయానికి వస్తే  రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తలపై 97 కేసులు పెట్టారని లోకేష్ ఆరోపించారు. పోలీసుల వేధింపుల వలన టిడిపి కార్యకర్త పంపన ఆనంద రావు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనపర్తిలో ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టినందుకు రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారని పేర్కొన్నారు. 2005 నుండే సత్తిరాజురెడ్డికి కుటుంబంతో సంబంధాలు లేవని,
ఇక ఆయన గురించి నా కంటే మీకే బాగా తెలుసునని లోకేష్ అన్నారు. 2021 జనవరి 18న సత్తిరాజు రెడ్డి బలభద్రపురం సమీపంలో కెనాల్ రోడ్డుపై పడి చనిపోయారని, జనవరి 15న మన యాక్టర్ సూర్యనారాయణరెడ్డి   సత్తిరాజు రెడ్డికి వైద్యం చేశారని గుర్తు చేశారు. హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది అని చెప్పి రాజమండ్రి బొల్లినేని హాస్పటల్ కి రిఫర్ చేసారని చెప్పారు. జనవరి 19న పోస్ట్ మార్టం రిపోర్టులో గుండెపోటు అని తేలిందని, అయినా యాక్టర్ శవ రాజకీయం మొదలెట్టి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అప్పుడు కుదరక పోవడంతో ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ని తారుమారు చేశారని, విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఎమ్మెల్యే ఒత్తిడితో ఆత్మహత్యగా మార్చి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని లోకేష్ ఆరోపించారు.

 

8 రోజుల పాటు కాకినాడ సబ్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని వేధించారని ఆరోపించారు.  ఆఖరికి రామకృష్ణారెడ్డికి బెయిల్ వస్తే ఆయనను కలవనీయకుండా జిల్లా వ్యాప్తంగా  టిడిపి నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారని లోకేష్ మండిపడ్డారు. చెయ్యని నేరానికి ఊచలు లెక్క పెట్టించారని, చెయ్యని తప్పులకు కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరి మీరు చేస్తున్న అవినీతి ఆధారాలతో సహా మా దగ్గర ఉందని, టిడిపి అధికారంలోకి వచ్చాకా అన్ని దర్యాప్తు చేస్తామని హెచ్చరించారు.

జాంబీరెడ్డికి, యాక్టర్ సూర్యనారాయణరెడ్డికి జైలులో చిప్ప కూడు ఖాయమని లోకేష్ జోస్యం చెప్పారు. ”కొంతమంది పోలీసులు అధికారులకు చెప్తున్నా.. మేము బ్లాక్ బుక్ సిద్ధం చేస్తున్నాం.. కొంతమంది చట్టానికి వ్యతిరేకంగా మా కార్యకర్తలు,నాయకులపై కేసులు పెడుతున్నారు.. వారందరి పేర్లు సిద్ధంగా ఉన్నాయి.. వాళ్లంతా మూల్యం చెల్లించుకోక తప్పదు” అని లోకేష్ హెచ్చరించారు.
నా పై కేసులు పెట్టండి భరిస్తా…నన్ను అరెస్ట్ చెయ్యండి బాధపడను…నా కార్యకర్తల జోలికి వస్తే ఎవ్వడిని వదిలిపెట్టను.వడ్డీతో సహా ఇచ్చేస్తా” అని లోకేష్ ఉద్వేగంగా చెప్పారు. ఈ సమావేశంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గం టిడిపి అధ్యక్షులు కె.ఎస్. జవహర్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అనపర్తి  మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.