‘రెడ్డిగారి’పై యుద్ధానికి ‘రాజుగారు’…రె‘ఢీ’

738

బెయిల్ రద్దు పిటిషన్‌తో రఘురాముడు ఇక తాడోపేడో
సీబీఐ అధికారులనూ వదలని రఘురాముడు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఇప్పటిదాకా వ్యంగ్యాస్త్రాలు, అనుకరణలు, ఆగ్రహాలతో వైకాపా దళపతి, ఏపీ సీఎం జగనన్నపై విరుచుకుపడుతున్న నర్సాపురం వైసీపీ రెబ్‌ల్ ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు.. ఇక ఆయనతో నేరుగా తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు రెడ్డిగారిపై రాజుగారు, యుద్ధానికి రెఢీ అయిపోయారు. రాజు న్యాయపోరాటం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ-మీడియా  వర్గాల్లో వ్యక్తమవుతోంది.

తన పార్టీ అధినేత జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించడంతో, జగన్‌పై ఆయన ఇక నేరుగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమయింది. తనపై జగన్ విధేయ బృందమే సీబీఐతో బ్యాంకు కేసులు పెట్టించారన్న కసితో రగిలిపోతున్న రాజు, ఏకంగా జగన్ స్వేచ్ఛాయుత రాజకీయ జీవితంపైనే దృష్టి సారించడం బట్టి.. రాజు ఇక ఎవరినీ లెక్కచేసే పరిస్థితిలో లేరని అర్ధమయింది. అంతకుముందే నర్సాపురం నియోజకవర్గంలో.. తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారన్న ఆగ్రహంతో రగిలిపోతున్న రాజును, తాజాగా బ్యాంకు కేసు తోడవడం అగ్గిరాముడిని చేసినట్టయింది.

అందుకే ఆయన నేరుగా జగన్ ఎక్కడయితే ఇబ్బందిపడతారో, ఏ కేసులో అయితే చిక్కులు ఎదుర్కొంటారో, సరిగ్గా అదే పాయింట్‌పై గురిపెట్టడం చర్చనీయాంశమయింది. ‘ ఎవరికయినా సహనం కొంతవరకే ఉంటుంది. ఆయన సీఎం అయితే నేను ఎంపీ. నా పుట్టలో వేలు పెడితే కుట్టనా? అయినా నన్ను వేధిస్తుంటే మౌనంగా ఉండటానికి ఆడనా? మాడానా’ అంటూ తాజాగా రాజు చేసిన వ్యాఖ్య బట్టి.. జగన్‌తో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్దంగా ఉన్న సంకేతాలు పంపిన ట్టయింది.

ఈ మొత్తం వ్యవహారంలో రాజు.. సీబీఐ అధికారులనూ విడిచిపెట్టకపోవడం విశేషం. బ్యాంకు కేసులో తనపై కేసు పెట్టడానికి కారకులయిన కొందరు సీబీఐ అధికారులపై ఆయన, నేరుగా హోంమంత్రిత్వ శాఖకే ఫిర్యాదు చేయడం ద్వారా, వారికీ హెచ్చరిక సంకేతం పంపారు. పైగా సదరు సీబీఐ అధికారుల కదలికలపై కూడా నిఘా వేయడం ద్వారా, వారినీ చిక్కుల్లోకి నెట్టారు. ఆ అధికారులు ఎప్పుడెప్పుడు తమ పార్టీ నేతలతో మాట్లాడారన్న విషయాలను కూడా వెల్లడించడం బట్టి, రాజు సొంత నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఒక్క సీబీఐ అధికారులు మాత్రమే కాకుండా, తనపై కేసు పెట్టిన బ్యాంకు బాసుల కదలికలపైనా, ఆయన కన్నేయడం ద్వారా.. తానెవరినీ విడిచిపెట్టబోనన్న మరో హెచ్చరిక సంకేతం కూడా పంపారు.

తనను హత్య చేసేందుకు కడప నుంచి వచ్చిన బృందాలు, వారి పేర్లు, వారెక్కడ ఉంటున్నారన్న సమాచారం కూడా బహిర్గతం చేస్తున్నారంటే… వైసీపీలోనే ఆయనకు ఉప్పందుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల సీఎం జగన్, కడప మాజీ ఎంపి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితులుగా ఉన్న కొందరితో,  వీడియోకాన్ఫరెన్స్ మాట్లాడార ంటూ వెల్లడించడం ద్వారా సంచలనం సృష్టించారు. అంటే దీన్నిబట్టి రఘురామకృష్ణంరాజుకు ‘చాలా పై స్థాయి’లోనే సమాచారం వస్తోందన్నది సుస్పష్టం.

అసలు బెయిల్‌పై ఉన్న జగన్ స్వేచ్ఛగా ఉన్నందుకే తనను వేధిస్తున్నందున, అసలు ఆ బెయిలే రద్దు చేయాలని కోర్టుకెక్కడం ద్వారా, జగన్ కేసు  మూలంపై దెబ్బకొట్టినట్టయింది. అదే సమయంలో తాను గాయపడిన పులినన్న సంకేతాలు, ప్రత్యర్ధులకు పంపినట్టయింది. వివేకా హత్య కేసును సీబీఐ ఎందుకు నాన్చుతోందంటూ గత కొద్దికాలం నుంచీ ఆయన,  రచ్చబండ వేదికగా నానా రచ్చ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వివేకా కుమార్తె కూడా ఢిల్లీ వెళ్లి ఇదే అంశంపై రచ్చ చేయడంతో, సీబీఐ మళ్లీ రంగంలోకి దిగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఒకరకంగా అలాంటి అనివార్య పరిస్థితి కల్పించారు. ఆ రకంగా రఘురామకృష్ణంరాజు ఆరోపణలు ఫలించినట్టయింది.

రఘరామకృష్ణంరాజుకు ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు లేకపోతే, ఆయన ఈ స్థాయిలో యుద్ధానికి సాహసించరన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. పార్లమెంటు జరుగుతున్న సమయంలో, అమరావతి రైతులకు కేంద్రమంత్రులతో అపాయింట్‌మెంట్లు ఇప్పించడం, వారికి ఢిల్లీలో వసతి ఏర్పాటుచేయించడం, ఇవికాక.. జగన్ వ్యతిరేక వర్గాలకు ఢిల్లీలో వేదిక కల్పించడం వంటి పనులన్నీ ఆయనే చేస్తున్నారు. అంటే కేంద్రపెద్దల ఆశీస్సులు లేకపోతే, ఒక సాధారణ ఎంపీ.. అందులోనూ సొంత పార్టీ పట్టించుకోని ఎంపీ,  ఈ స్థాయిలో అధికార పార్టీకి చెమటలు పట్టించడం అసాధ్యం.

నిజానికి, వైసీపీ నాయకత్వం ప్రమేయం లేకుండానే కీలకమైన పార్లమెంట్ స్టాండిం కమిటీ చైర్మన్ పదవి తెచ్చుకన్నారంటే, రఘురాముడు పలుకుబడి, పరిచయాలు ఏ స్థాయిలో విస్తరించాయో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేత దత్తాత్రేయ హూసబలేతో చర్చలు జరపటం ద్వారా, తాను సామాన్యుడిని కాదన్న సంకేతాలు పండటం చర్చనీయాంశమయింది. రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిళ్లకు వ్యతిరేకంగా కలసిపనిచేసేందుకు సంఘ్‌తో చర్చించడం సాధారణ విషయమేమీ కాదు.

  నిజానికి ఇప్పటివరకూ రాష్ట్ర బీజేపీ అగ్రనేతలే దత్తాజీని కలవలేకపోయారు. ఒక్క దత్తాజీనే కాదు. ఢిల్లీకి వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మోదీ, అమిత్‌షా, నద్దా అపాయింట్‌మెంట్లకే దిక్కు ఉండటం లేదు. చివరకు పార్టీ సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌జీ కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని దుస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేని.. వైసీపీ తిరుగుబాటు ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వీరందరినీ సులభంగా కలుస్తూ,  జగన్ సర్కారుపై ఫిర్యాదులు ఇస్తున్నారు. వీటికి మించి.. 13మందితో సీఆర్‌పీఎఫ్ బలగాల రక్షణకు తెచ్చుకున్నారు. వారు కాకుండా ప్రధానికి లేఖ రాసిన రెండున్నర రోజుల్లోనే ఢిల్లీలో ఆయనకు అదనపు భద్రత కల్పించారంటే.. ఆయనకు తెరవెనుక ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెప్పేందుకు  మేధావే కానక్కర్లేదు.

ఈ అంశాలన్నీ పరిశీలిస్తే.. అన్ని అస్త్రాలు తన అంబులపోదిలో సమకూర్చుకున్న తర్వాతనే ఆయన, సీఎం జగన్‌పై యుద్ధానికి సిద్ధమయ్యారన్నది కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన జగన్ బెయిల్ పిటిషన్ రద్దుపై వేసిన పిటిషన్ విచారణకు వస్తే, తదనంతర పరిణామాలు ఏమిటన్న అంశం ఆసక్తికరంగా మారింది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ తన కేసుల్లో ఉన్న వారిని ప్రభావితం చేస్తున్నారన్న కోణంలోనే, రఘురామకృష్ణంరాజు వాదన ఉండనుంది. ఆ మేరకు తన కేసులో జైలు శిక్ష అనుభవించిన వారికి ఇచ్చిన, పదవుల జాబితాను కూడా కోర్టుకు అందించనున్నారు.

అదేవిధంగా తాను జైలుకు వెళ్లేందుకు కారణమయిన పిటిషన్ వేసిన అశోక్‌గజపతిరాజు, దివంగత ఎర్రన్నాయుడు సోదరుడయిన అచ్చెన్నాయుడును కేసులతో వేధించడాన్ని కూడా,  తన వాదనకు ఆధారాలు సమకూర్చే అవకాశం లేకపోలేదు. బెయిల్ ఇచ్చేముందు కోర్టు పెట్టిన షరతులను ఉల్లంఘించి, తన పలుకుబడితో ప్రత్యర్ధులను ఇబ్బందిపెడుతున్నందున, జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న వాదన వినిపించేందుకు రఘురామకృష్ణంరాజు సిద్ధమవుతున్నట్లు సమాచారం.