‘దేశం’ పార్టీ దివాలా తీసిందా?

1309

బాబు చేతిలో ఆర్ధిక వ్యవహారాలు లేవా?
ఎన్నికల ముందు అప్పులు తీర్చని నాయకత్వం
ఇంకా బాబు చుట్టూ తిరుగుతున్న నాటి అభ్యర్ధులు
హల్‌చల్ చేస్తున్న అచ్చెన్న వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం- అమరావతి)

కాంగ్రెస్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆర్ధికంగా దివాలా తీసిందా? పార్టీతోపాటు, ఆర్ధిక అధికారాలన్నీ అధినేత చంద్రబాబునాయుడు చేతుల నుంచి జారిపోయాయా? బాబు పట్టించుకుంటే పార్టీ ఇలా ఎలా ఉంటుందంటూ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు పార్టీ వర్గాలకు ఆలోచనలో పడేసింది. ప్రధానంగా లోకేష్ పనితీరుపై పార్టీ సీనియర్లు సైతం అసంతృప్తిగా ఉన్నారన్న వాస్తవాన్ని ఆ వీడియో బట్టబయలు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎన్నికలంటే తిరుగులేని ఎనర్జీతో పనిచేసే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, అసెంబ్లీ ఎన్నికల మధ్య నుంచే చేతులెత్తేయడంపై ఆ పార్టీ వర్గాల్లో అప్పట్లోనే చర్చ జరిగింది. టీడీపీకి ఆర్ధికసాయం అందించే వ్యక్తులు, సంస్థలపై కేంద్రం ఐటి, ఇన్‌కంటాక్స్ దాడులు చేయడంతో.. టీడీపీ అభ్యర్ధులు అసలు సమయంలో చేతులెత్తేశారు. దానితో ‘‘నిధులు మీరే సర్దుబాటు చేసుకోండి. ఎన్నికలయ్యాక ఇస్తామ’’ని నాయకత్వం హామీ ఇచ్చింది.

ఆ ప్రకారంగా నాయకత్వ హామీతో అభ్యర్ధులంతా దొరికినచోటల్లా  అప్పులు చేశారు. ఎన్నికల తర్వాత డబ్బు సర్దుబాటు హామీపై, నాయకత్వం నోరు మెదపకపోవడంతో అభ్యర్ధులు బిత్తరపోయారు. పైగా కనీసం ఫోన్లు కూడా తీయకపోవడం, బాబు ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో అభ్యర్ధుల పరిస్థితి గందరగోళంగా మారింది. డబ్బులడిగితే తప్పించుకుని తిరుగుతున్న వైనంతో అభ్యర్ధులు విసిగిపోయారు. గతంలో కాపు అభ్యర్ధులంతా కాకినాడలో దీనిపైనే సమావేశం నిర్వహించి, పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలని తీర్మానించారు. ఆ తర్వాత ఆ సమావేశంలో పాల్గొన్న చాలామంది కాపు నేతలు వైసీపీలో చేరారు.

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి, ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికయిన ఓ మాజీ మంత్రయితే, తనకు అప్పులిచ్చిన వారిని నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లడం అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ‘‘మీరు హామీ ఇస్తే అప్పులవాళ్లు కొంతకాలం ఆగుతారని’’ సదరు ఎమ్మెల్సీ అభ్యర్ధించినా, చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో విసుగుచెందిన ఆయన,  వైసీపీలో చేరిపోయారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం, రాజీనామా చేసి తన పార్టీలో చేరిన ఆ ఎమ్మెల్సీకి,  మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మరో కేంద్ర మాజీ మంత్రిదీ ఇదే ఆర్ధిక సంకటం.  ఆయన ఇంటి చుట్టూ అప్పులిచ్చిన వాళ్లు తిరుగుతున్నారు. నాలుగుకోట్లు అప్పులు చేసిన ఆయన, ఇంకా చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప, ఫలితం సున్నా రెండేళ్ల నుంచి అభ్యర్ధులందరిదీ ఇదే తంతు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చెందిన  టీడీపీ మాజీ నాయకుడు, ఇప్పటి బీజేపీ నేత రామకృష్ణకు చెందిన  ఆర్కే ఈవెంట్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీకి సైతం,  పార్టీ నాయకత్వం ఇప్పటిదాకా 23 కోట్లు చెల్లించాల్సి ఉంది. టీడీపీ నిర్వహించే మహానాడు, అధికారంలో ఉన్నప్పుడు చివరిరోజుల్లో చేసిన ధర్మపోరాట దీక్షలు, రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ-పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన దాదాపు  బహిరంగలు, 12 ధర్మపోరాటదీక్ష సభలు, విజయవాడ, వైజాగ్ మహానాడుకు సంబంధించి వేదిక ఏర్పాట్లన్నీ,  ఆయన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీయే చేసింది. దాదాపు 80 బహిరంగసభలన్నీ ఈ కంపెనీయే నిర్వహించింది.  ‘‘వాటి బిల్లులన్నీ సబ్ మిట్ చేసినా ఇప్పటివరకూ ఫలితం శూన్యం. ఫోన్లు చేసినా స్పందన లేదు. బాబుగారిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ దొరకడం లేదు. అంతా తప్పించుకుని తిరుగుతున్నార’ని రామకృష్ణ వాపోయారు.  చివరకు పార్టీ కార్యక్రమాలు తీసిన వీడియో గ్రాఫర్లు, కెమెరామెన్లకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది.

ఇక ఎన్నికల ముందు వరసగా ఐదురోజుల పాటు పార్టీ పరంగా వివిధ పత్రికలు, చానెళ్లకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చింది. అందుకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సి ఉంది. చివరకు చిన్న పత్రికలకు రావలసిన బకాయిలు కూడా ఎగ్గొట్టారు. ఇప్పటివ రకూ వాటికి డబ్బులు చెల్లించకుండా, ముఖం చాటేస్తున్న దుస్థితిలో ఉంది. అదే ఎన్నికల్లో యాడ్స్ ఇచ్చిన వైసీపీ, వాటికి అప్పుడే డబ్బులు చెల్లించింది. ఇక అనేకమంది ఎమ్మెల్యే అభ్యర్ధులు సైతం స్థానిక మీడియా ప్రతినిధులకు యాడ్స్‌తోపాటు, ట్రాన్స్‌పోర్టు యజమానులకు ఇప్పటిదాకా  బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఎన్నికల్లో పార్టీకి జెండాలు, వాహనాలు, మైకులు, ప్రింటింగ్, భోజన సౌకర్యాలు ఏర్పాటుచేసిన వారికి సైతం ఇప్పటివరకూ డబ్బులు చెల్లించకపోవడంతో, వారంతా పార్టీ ఆఫీసు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటి బాధితుల సంఖ్యకు లెక్కలేదు. అయితే వీరి సమస్యలు వినడమే తప్ప, వారికి హామీ ఇచ్చే స్థాయి నేత ఎవరూ లేకపోవడంతో.. చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసుకు వచ్చినప్పుడు, ఆయనకే చెప్పాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. కానీ బాబు మాత్రం పార్టీ ఆఫీసుకు పెద్దగా రావడం లేదు.వచ్చినా నేతలను తప్ప, మిగిలిన వారిని కలవకుండా వెళ్లిపోతున్నారు. ఇక లోకేష్  సంగతి సరేసరి.

తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వద్దకు, హైదరాబాద్‌కు చెందిన పార్టీ నేత వెంకటేశ్వరరావు వచ్చి తన గోడు వినిపించుకున్నారు. తనకు రావలసిన బకాయిల గురించి మొత్తుకున్న వీడియో ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో  హల్‌చల్ చేస్తోంది. అది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కెఎల్ నారాయణకు చెబితే 3 కోట్లు ఇస్తాడు. ఒక్కమాట చెప్పమనండి. లేకపోతే మొత్తం 1200 కోట్లు స్మాష్ చేస్తాను. లోకేష్ కనీసం త నతో మాట్లాడటం లేదని ఆవేశపడిన సదరు బాధితుడితో..  ‘పెద్దాయనతో చెబుతానని’ అచ్చెన్న హామీ ఇచ్చారు.

దానికి స్పందించిన సదరు బాధితుడు వెంకటేశ్వరరావు… ‘‘పెద్దాయన పట్టించుకుంటే ఈ పరిస్థితి ఎందుకు? నేను మూడుసార్లు బాబును కలిశాను సార్. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కలిస్తే నేను చేస్తానమ్మా అన్నారు. లోకేష్  ఏమో నన్ను ఎవరో దొంగనుచూసినట్లు చూస్తున్నాడు. మరీ అంత అన్యాయమా సార్? నేనెంత సర్వీసు చేశాను? మనిషికి కనీసం విలువ ఇవ్వాలి కదా’ అని ఆవేదనతో స్పందించాడు. దానితో అచ్చెన్న కూడా అందుకుని ‘పోనీయ్ మనుషులయితే బాగుంటే మనకు ఎందుకీ పరిస్థితి?  17 ఎలక్షన్లు అయితే అంతా ఫ్రీ అవుతాం. తర్వాత  పార్టీ లేదు. తొక్కలేదు’’ అంటూ స్వయంగా పార్టీ అధ్యక్షుడయిన  అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆ వీడియో పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ తర్వాత తనకూ లోకేష్‌కూ విబేధాలు సృష్టించేందుకు చేస్తున్న కుట్రలు పనిచేయమని అచ్చెన్న ఓ ట్వీట్ చేయడం గమనార్హం.

నిజానికి, చంద్రబాబు నాయుడు చేతిలో ఆర్ధిక నిర్వహణ పెత్తనం ఉంటే పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేది కాదని, ఆయనతో కొన్ని దశాబ్దాల నుంచి కలసి పయనిస్తున్న సీనియర్లు చెబుతున్నారు. గతంలో ఎన్నో ఎన్నికలు నిర్వహించిన చంద్రబాబు, డబ్బులు లెక్కచేయకుండా ఎన్నికలు నిర్వహించేవారన్నారు.  తాము తక్కువ చె ప్పినా దానికంటే ఎక్కువ ఇచ్చి, ఎన్నికల్లో పోరాడిన సందర్భాలను వారు గుర్తు చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పటికీ, ఎన్నికల్లో చంద్రబాబు పంపిన నిధులు చూసి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భయపడ్డారని గుర్తు చేస్తున్నారు.

అసలు రాష్ట్రంలో ఎన్నికలను అత్యంత ఖరీదైన ప్రక్రియగా మార్చింది తమ పార్టీయేనని, ఇప్పుడు అలాంటి పార్టీ.. అభ్యర్ధులకు ఎన్నికల్లో నయాపైసా ఇవ్వలేని దుస్థితిలో  ఉండటమే విషాదమని, కోస్తాకు చెందిన ఓ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా సార్ తమిళనాడు, బెంగాల్, కర్నాటక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకూ నిధులు పంపించేవారు. ఆయన దగ్గర డబ్బులుంటే అస్సలు ఆగరు. కానీ ఇప్పుడు డబ్బు పెత్తనం ఆయన చేతి నుంచి జారిపోయింది. అందుకే ఎన్నికల్లో డబ్బులు పెట్టలేకపోయాం. అయినా సరే దీనికి మేం మా సార్‌ను తప్పుపట్టం. ఆయనకున్న సమస్యలు ఆయనకున్నాయ’ని సదరు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టే చంద్రబాబుకు, ఆచితూచి అడుగులేసి, లాభనష్టాలు లెక్కలేసే లోకేష్ వ్యవహార శైలికీ చాలా తేడా ఉందని వివరించారు.

డబ్బు విషయంలో పట్టువిడుపులతో ఉండే బాబు చేతిలో, ప్రస్తుతం ఆర్ధిక నిర్వహణ లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని సీనియర్లు అసలు రహస్యం చెబుతున్నారు. దానికితోడు డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం లేదన్న ముందుచూపు కూడా లేకపోలేదంటున్నారు.  లోకేష్ తోపాటు కుటుంబసభ్యులే పార్టీ ఆర్ధిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని, వారితో  తాము చంద్రబాబు వద్ద మాట్లాడినంత స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నామని ఓ మాజీ మంత్రి చెప్పారు. బాబు చేతిలో  ఆర్థికవ్యవహారాల నిర్వహణ అంశం లేనందుకే.. ఇటీవలి మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్ధులకు పార్టీ నయాపైసా సాయం చేయలేకపోయిందని వివరించారు. చివరకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా,  అభ్యర్ధులకు నయాపైసా సాయం చేయలేకపోయిందని గుర్తు చేశారు.