‘ఆహార క్రాంతి’ ఆరంభం

482

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (న్యూస్‌టైమ్): ఆహారంలో పోషక విలువలు, దేశంలో స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే పోషకాహారం, పండ్లు, కూరగాయలు తదితర అంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘ఆహార క్రాంతి’ పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం, శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన, భూగోళ శాస్త్రాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించారు. ‘ఆహార క్రాంతి’ కార్యక్రమాన్ని, విజ్ఞాన భారతి (విభా), ప్రపంచ భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల వేదిక (జిస్ట్-జీఐఎస్‌టీ), విజ్ఞాన ప్రసార్, ప్రవాసీ భారతీయ అకాడమిక్, సైంటిఫిక్ సంపర్క్) వంటి సంస్థలు కలసికట్టుగా ప్రారంభించాయి. ఉత్తమ ఆహారం- ఉత్తమ అవగాహన అన్న ధ్యేయంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. దేశంలోను, ప్రపంచ వ్యాప్తంగానూ ఎదురవుతున్న ఆకలి బాధలు, విపరీతమైన వ్యాధులు అన్న సమస్యను నిర్మూలించే లక్ష్యంతో ఉద్యమ కార్యక్రమంగా ఆహార క్రాంతి పథకానికి రూపుద్దిద్దారు. వాస్తవానికి మనం తీసుకుంటున్న ఆహారానికి రెండు రెట్లకు మించిన పరిమాణంలో మనదేశంలో ఆహారోత్పత్తి జరుగుతోందని పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.

అయినా, మనదేశంలో ఎక్కువ మందికి పౌష్టికాహార లోపం సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. పౌష్టికాహారం గురించి జనంలో తగిన అవగాహన లోపించడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయసిద్ధమైన ఆహారం గొప్పతనాన్ని, ఆహార విలువలను, స్థానికంగా లభించే పండ్లు, కూరగాయల రోగనిరోధక శక్తిని, సమతుల ఆహారం సృష్టించే అద్భుతాలను గురించి ప్రజలకు తగిన అవగాహన కల్పించేందుకు ఆహార క్రాంతి కార్యక్రమాన్ని తయారు చేశారు. స్థానికంగా లభించే పండ్లలో, కూరగాయల్లో నిక్షిప్తమైన సమతుల పోషకాహార విలువలపై దృష్టిని మరోసారి కేంద్రీకరించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది.

విజ్ఞాన భారతి. జిస్ట్ వేదిక వంటి సంస్థలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చొరవ తీసుకోగా, ఈ పథకంలో పాలు పంచుకోవడానికి మరిన్ని ఇతర సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఇందుకోసం తమ అనుభవాన్ని, వనరులను సమీకరించేందుకు అవి తమ అంగీకారం తెలియజేశాయి. దీనికి తోడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రిత్వ శాఖలు, సంస్థలు,.. కేంద్ర శాస్త్రవిజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన శాఖకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ అయిన విజ్ఞాన్ ప్రసార్, ప్రభాస్ సంస్థ కూడా కార్యక్రమానికి అసరమైన సహాయ సహకారాలు అందించాయి. ఒక వైపు కార్యక్రమం ముందుకు సాగుతుండగా, మరిన్ని సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఆహార క్రాంతి కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించిన సందర్భంగా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ కార్యక్రమమైన ఆహార క్రాంతి పథకాన్ని అన్నపూర్ణ మాత చైత్ర నవరాత్రి రోజున ప్రారంభించడం ఎంతో సముచితమని అన్నారు.

‘‘ప్రస్తుతం కోవిడ్-19 వంటి మహమ్మారి వైరస్ దాడితో దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో వైరస్ దాడి తీవ్రతను తగ్గించేందుకు సమతుల ఆహారం ఒక ప్రత్యేక ఆయుధంగా పనిచేస్తుంది. ఇలాంటి తరుణంలో సమతుల ఆహారం ప్రాముఖ్యతను తెలియజెప్పడం, ఆ అంశంపై అవగాహన కల్పించడం గతంలోకంటే మరింత ముఖ్యం.’’ అని ఆయన అన్నారు.

విదేశాల్లోని భారతీయ శాస్త్రవేత్తలు ఈ ఉద్యమ కార్యక్రమంలో ముందువరుసలో ఉండటం అభినందనీయమన్నారు. ‘‘సమతుల ఆహారంపై సందేశాన్ని ప్రతి భారతీయుడికి చేర్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ప్రశస్తమైనది. ఈ కార్యక్రమంకోసం మీరు రూపొందించిన చిహ్నం కూడా ఎంతో ప్రశంసనీయం, ఉత్తమ ఆహారం, ఉత్తమ అవగాహన అనే నినాదం దేశ ప్రజలందరినీ సమైక్యం చేస్తుంది. కలసికట్టుగా నడిపిస్తుంది.’’ అని ఆయన అన్నారు. ఆహార క్రాంతి పథకానికి ప్రజా ఉద్యమ కార్యక్రమంగా తగిన రూపురేఖలు తీర్చిద్దేందుకు తమ సేవలందించిన జిస్ట్ సంస్థకు చెందిన డాక్టర్ యెల్లోజీ రావు మిరాజ్కర్, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రఫుల్ కృష్ణల సేవలను కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘మీరంతా మీ సామర్థ్యంతో ఓ భారీ కార్యక్రమాన్ని చేపట్టారని మాకు తెలుసు. ఇది సామాన్య ప్రజలకు చేరడానికి హరిత విప్లవం, క్షీర విప్లవం లాగా అనేక సంవత్సరాలపాటు ముందుకు సాగాలి.’’ అని ఆయన అన్నారు.

సుసంపన్నమైన సమాజానికి ఆరోగ్యవంతులైన వ్యక్తుల నాయకత్వం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ విషయంలో భారతీయ ఆయుర్వేద వైద్య విధానం యావత్ ప్రపంచానికీ మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఈ రోజున మనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలను, సామాజిక సవాళ్లను పరిష్కరించేందుకు ఈ వైద్య విజ్ఞానాన్ని వినియోగించాల్సిన తరుణం ఆసన్నమైందని కేంద్రమంత్రి అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికీ ఉత్తమ ఆహారం ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడమే ఆహార క్రాంతి లక్ష్యమన్నారు. దేశంలోని అన్ని మూలలకూ ఈ సందేశం చేరేలా సమాజంలోని ప్రతి వర్గానికి ఈ కార్యక్రమంలో ప్రమేయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

విజ్ఞాన్ ప్రసార్ సంస్థ డైరెక్టర్ నకుల్ ప్రశార్ మాట్లాడుతూ ఆహార క్రాంతి కార్యక్రమం పలు రకాలుగా పనిచేస్తుందన్నారు. సమతుల ఆహారంపై మరింత అవగాహన, మెరుగైన పోషక విలువలు, మెరుగైన వ్యవసాయం వంటి అంశాలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుందన్నారు. ఉత్తమ ఆహారం ఆవశ్యకతకు సంబంధించిన సందేశాలను పాఠ్యాంశాల ద్వారా, ఇతర బోధనా పద్ధతుల ద్వారా ఈ పథకం వ్యాపింపజేస్తుందన్నారు. కార్యక్రమానికి సంబంధించిన అంశాలను ఇంగ్లీషు, హిందీలతోపాటుగా అన్ని స్థానిక భాషల్లోనూ ఆన్ లైన్ ద్వారా, ఇతర మార్గాలద్వారా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణపై ఈ కార్యక్రమం దృష్టిని కేంద్రీకరిస్తుందని, తద్వారా పెద్దసంఖ్యలో విద్యార్థులకు సందేశాన్ని అందజేస్తారని, విద్యార్థుల ద్వారా వారి కుటుంబాలకు, చివరకు సమాజానికి పౌష్టికాహార సందేశం అందుతుందని ఆయన చెప్పారు. ఆహార క్రాంతి కార్యక్రమంపై ఇంగ్లీష్, హిందీ భాషల్లో వెలువరించిన నెలవారీ సమాచార లేఖలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. విజ్ఞాన ప్రసార్ సంస్థ ఈ సమాచార లేఖలను ప్రచురిస్తోంది. విజ్ఞాన భారతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భట్కర్, ప్రభాస్ సంస్థకు చెందిన ధ్యానేశ్వర్, విజ్ఞాన భారతి ప్రధాన కార్యదర్శి సుధీర్జీ భదోరియా, జాతీయ నిర్వాహక కార్యదర్శి జయంత్ సహస్ర బుధే, జిస్ట్ వేదికకు చెందిన డాక్టర్ యెల్లోజీరావు మిరాజ్కర్, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రఫుల్ కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వినూత్నకార్యక్రమం ప్రపంచం యావత్తూ అనుసరించదగిన ఆదర్శ పథకంగా నిలిచిపోగలదన్న ఆశాభావాన్నివారు వ్యక్తంచేశారు.