నెలాఖరులోగా పాడి రైతుల నమోదు

666

ఒంగోలు, ఏప్రిల్ 15 (న్యూస్‌టైమ్): రైతు ఉత్పత్తిదారుల సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ ఆదేశించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాల సంస్థాగత స్వరూపంపై వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, డి.ఆర్.డి.ఏ., డ్వామా అధికారులకు గురువారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో మండల స్థాయి అధి కారులకు ఆయా శాఖల అధికారులు అవగాహన కల్పించారు. అనంతరం రైతు ప్రకాశం – కరదీపిక – 2 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆవిష్కరించారు.

రైతుల ఆదాయాలను పెంచడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు శిరోధార్యం కానున్నాయని కలెక్టర్ చెప్పారు. సంఘాలు చట్టబద్ధంగా నడిస్తే రైతులకు బహుళ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్ నాటికి గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నియామకాలు జరగాలన్నారు. అదే క్రమంలో సంస్థల రిజిస్ట్రేషన్ మే 31వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో సంఘాల సభ్యులకు శిక్షణలతో పాటు సంఘాల రిజిస్ట్రేషన్ కూడా జరగాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆ సంస్థలో వి.ఆర్.ఓ.లు, వ్యవసాయ లేదా ఉద్యానవన శాఖ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్, డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్ ను ఎక్స్ అఫిషియో పాలకవర్గ సభ్యులుగా నియమించాలన్నారు. 879 రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతు ఉత్పత్తి దారుల సంఘాల సంస్థాగత నిర్మాణం జరగాలన్నారు.

సంఘాలకు చెందిన బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా తెరవాలని, బైలా పుస్తకాలు పంపిణీ చెయ్యాలన్నారు. సంఘాల ద్వారా పంటల ఉత్పత్తి, విక్రయాలు మరింత పెరి గేలా చూడాలని, తద్వారా రైతులకు లబ్ది చేకూర్చే బాధ్యత అధి కారులపై ఉందన్నారు. ఇదే క్రమంలో జిల్లాలో డెయిరీ ఉత్పత్తులు, వాటి కార్యకలాపాలు విస్తృతం చెయ్యాలని ఆయన పలు సూచనలు చేశారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాల విధి విధానాలు, సభ్యుల హక్కులు, సమావేశ నిర్ణయాలు, తీర్మానాలు క్రమం తప్పకుండా దస్త్రాలలో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. సంఘాలు నైతిక విలువలతో ముందుకు సాగాలని, ఒకరికోసం అందరూ.. అందరికోసం ఒకరు అనే నినాదంతో సంఘం నడవాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామ స్థాయిలో చురుకుగా మెలిగే రైతులను మండల, జిల్లా స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంస్థలలోకి సభ్యులుగా చేర్చాలన్నారు. ఆ సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగానే సభ్యుల వాటా ధనం, నిధుల సమీకరణ, వినియోగం పక్కాగా ఉండాలని ఆయన తెలిపారు. సంఘాల నిర్వహణలో ఎదరయ్యే సమస్యలను అధిగమించడానికి రైతులను చైతన్య పరచాలన్నారు. పంట సాగు నుంచి అధిక దిగుబడి సాధించడం, విక్రయంలోనూ లాభాలు గడించేలా సంఘాలు వేదికగా నిలుస్తాయనే అంశాలపై రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలన్నారు. అధి కారుల సహకారం, శాస్త్రవేత్తల సూచనలతో పాటు బయ్యర్లే నేరుగా రైతుల వద్దకే వచ్చేలా సంఘాలతో బహుళ ప్రయోజనాలు కల్పించే విషయాలపై వివరించాలన్నారు. సంఘాలపై వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్‌బిఅండ్ఆర్) జె.వెంకట మురళి, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీరామమూర్తి , డి.ఆర్.డి.ఏ. పి.డి. బాబురావు, డ్వామా పి.డి. శీనారెడ్డి, ఏ.పి.ఎం.ఐ.పి. పి.డి. రవీంద్రబాబు, పశుసంవర్థక శాఖ జె.డి. బేబి రాణి, ఉద్యానవన శాఖ ఏ.డి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.