నాయుడుపేటలో నద్దా సభకు అవమానం!

1288

వెక్కిరించిన ఖాళీ కుర్చీలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రంలో బీజేపీ-జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, పవన్ కల్యాణ్‌ను సీఎంను చేస్తామన్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం వైఫల్యం, చివరకు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దాకు అవమానం మిగిల్చింది. తాజాగా నాయుడుపేటలో నద్దాను ముఖ్య అతిథిగా పిలిచిన బహిరంగసభ, ఖాళీ కుర్చీలతో జాతీయ అధ్యక్షుడిని వెక్కిరించడంపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం వ్యూహలోపం-సమన్వయలేమి కారణంగా నద్దా సభ దారుణంగా విఫలమయిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే అగ్రనేతలు ఏపీకి వచ్చేందుకు వెనుకాడుతున్నారని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

నద్దా సభ సాయంత్రం  5 గంటలకు జరుగుతుందని ప్రకటించారు. ఆ ప్రకారంగా నెల్లూరు జిల్లా నుంచి మండలానికి నాలుగువందల మందిని తరలించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు తొలిసారిగా… మిగిలిన పార్టీల మాదిరిగానే,  తలకు 200 రూపాయలు ఇచ్చి ఆటోల్లో తరలించారు. ఆవిధంగా సాయంత్రం నాలుగుగంటల నుంచే జనం రావడం ప్రారంభించారు. కానీ సాయంత్రం ఆరున్నర వరకూ చూసిన దూరప్రాంతం నుంచి వచ్చిన జనాలు, అప్పటినుంచి జారుకోవడం మొదలుపెట్టారు. అసలు చాలామంది ఆటోల్లో నుంచి కూడా కిందకు దిగకపోవడం ఆశ్చర్యం. అప్పటివరకూ సుమారు ఆరేడువేల మంది వరకూ హాజరయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కానీ, నద్దా రావడం ఆలస్యం కావడంతో ముందువరసలో ఉన్న కొన్ని కుర్చీలు తప్ప, వెనక ఉన్న కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సోము వీర్రాజు నుంచి నద్దా వరకూ వాటినుద్దేశించే ప్రసంగించారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖాళీ కుర్చీలనుద్దేశించి ప్రసంగిస్తున్న వీర్రాజు అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

ఆ తర్వాత పార్టీలో చేరిన సినీనటి హేమ ప్రసంగంతో రత్నప్రభ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారా? పార్లమెంటుకు పోటీ చేస్తున్నారా? అన్న సందేహం ఏర్పడింది. అసెంబ్లీకి పోటీ చేస్తున్న రత్నప్రభను గెలిపించాలని హేమ కోరడంతో వేదికపై ఉన్న నేతలు తలపట్టుకోవలసి వచ్చింది. పైగా అసలు హేమకు అభ్యర్ధి పేరు కూడా తెలియకుండా మాట్లాడటంతో, జనాభా లెక్క కోసం, మా పార్టీలో కూడా సినిమా వాళ్లు చేరుతున్నారని చెప్పేందుకే ఆమెను తీసుకువచ్చినట్లు కనిపించిందన్న వ్యాఖ్యలు నేతల నుంచి వినిపించాయి.

నిజానికి అంతో ఇంతో కార్యకర్తల సంఖ్య ఉన్న తిరుపతిలో కాకుండా, తిరుపతికి దూరంగా ఉన్న నాయుడుపేటను ఎంచుకోవడంలోనే తమ  నాయకత్వం వైఫల్యం ఏమిటో బయటపడిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సమీప ప్రాంతంలో సభ నిర్వహించి ఉంటే, ఈ అవమానం జరిగేది కాదంటున్నారు. అక్కడయితే తిరుపతిలో ఉన్న స్థానికులు కూడా హాజరయ్యేవారని, అలా కాకుండా నాయుడుపేటలో నిర్వహించడం వల్ల సభ ఫెయిలయేందుకు కారణమయిందని విశ్లేషిస్తున్నారు.

అసలు పార్టీ అభ్యర్ధి రత్నప్రభ ప్రచార కార్యక్రమాలను కూడా, నాయకత్వం సరైన విధంగా రూపొందించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె రోజువారీ రోడ్‌షోలలో అగ్రనేతలెవరూ కనిపించడం లేదని, పలు జిల్లాల నుంచి ప్రచారానికి వచ్చిన కార్యకర్తలను పట్టించుకునే దిక్కులేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా రత్నప్రభ ప్రచారం కోసం వచ్చిన మాదిగ సామాజికవర్గం వారిని, పట్టించుకునే వారే కరువయ్యారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారం నిర్వహించిన తమ పార్టీకి, ప్రస్తుతం అన్ని పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లు దొరకని దుస్థితి ఏర్పడిందని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

అభ్యర్ధి రత్నప్రభ నామినేషన్ సమయంలో అభ్యర్ధిగా ప్రకటించడం, స్థానిక నాయకులు-శ్రేణులతో ఆమెకు పరిచయాలు లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఆమెను ఇంకా పార్టీ కార్యకర్తలు  బ్యూరోక్రాట్‌గానే చూస్తున్నారని, ఆమె వ్యవహార శైలి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.