అగ్నికి ఆహుతవుతున్న అడవులు

403

పచ్చని చెట్లు బూడిదవుతున్నాయి
అటవీ దహనాలతో పర్యావరణానికి పెనుముప్పు
మెదక్‌ జిల్లాలో 57,300 హెక్టార్లల్లో అటవీ ప్రాంతం

మెదక్‌ జిల్లాలో 57,300 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నది. అడవులను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పోచారం(వన్యప్రాణి సంరక్షణ విభాగం), మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, పెద్దశంకరంపేట, కౌడిపల్లి, తూప్రాన్‌ రేంజ్‌లను ఏర్పాటు చేసింది. కానీ, ప్రతి ఏడాది ఎండకాలం వచ్చిందంటే చాలు అడవుల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. వందలాది ఎకరాల్లో విస్తరించిన పచ్చని అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవుల్లో పశువుల కాపరులు బీడీ తాగి వేయడం, వన భోజనాలకు వెళ్లిన వారు నిప్పు చల్లార్చకపోవడం వంటి అనుకోకుండా చేసిన తప్పులకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, సమయానికి మంటలు ఆర్పేవారు లేకపోవడంతో అడవులు కాలి బూడిదవుతున్నాయనే ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి.

పల్లెబాటలో జంతువులు..
తరచూ అడవుల్లో మంటలు ఎగిసిపడుతుండడం వల్ల చెట్లు కాలిపోయి అక్కడి జంతువులు సమీప గ్రామాల్లోకి పరుగులు తీస్తున్నాయి. మంటల వేడిమికి, అడవంతా వ్యాపించే పొగను తట్టుకోలేక కొన్ని జంతువులు, పక్షులు దూరంగా పారిపోతున్నాయి. పక్షుల గూళ్లు కాలి బూడిదవుతున్నాయి. ఇకపోతే కోతులు రోడ్లపై పరుగులు తీస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కోతులు ఆహారం కోసం పల్లెల్లోకి వచ్చి ఇండ్లపై దండెత్తుతున్నాయి. అడవి పందులు పొలాల్లోకి వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

బూడిదవుతున్న పచ్చని చెట్లు..
అడవుల్లోని పచ్చని చెట్లు బుగ్గిపాలవుతున్నాయి. అసలే ఎండలు కొన్ని రోజులుగా విశ్వరూపం చూపిస్తుండడంతో అడవి అంతా మోడువారింది. ఇలా అడవులు కాలుతుండడంతో పచ్చని చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. బీడీ ఆకుల కోసం అడవులకు వచ్చేవారు అడవిలో సంచరిస్తుంటారు. ఆ సమయంలో అనుకోకుండా బీడీలు తాగేందుకు నిప్పంటించుకుని అక్కడే వేయడంతో ఆ నిప్పు రవ్వలు ఎండిన ఆకులపై పడి మంటలు రేగుతున్నాయనే ఆరోపణలూ లేకపోలేదు. అయితే అడవులు ప్రమాదవశాత్తు కాలుతున్నాయా..? ఎవరైనా అగ్గి రాజేస్తున్నారా..? అనేది అంతుచిక్కడం లేదు. ఏదేమైనా అధికారులు అప్రమత్తంగా ఉండి అడవులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రతి రేంజ్‌లో ఆరుగురిని నియమించాం..
మెదక్‌ జిల్లాలోని అడవుల్లో మంటలు చెలరేగుతున్నది వాస్తవమే. ఈ అడవుల్లో ఆరు రేంజ్‌లు ఉన్నాయి. ప్రతి రేంజ్‌లో ఆరుగురు సిబ్బందిని నియమించాం. అడవుల్లో పశువులు కాసే వారు బీడీ తాగి పడేయడం, అడవికి దగ్గర వంటలు వండుకొని మంటలు చల్లార్చకపోవడం వల్ల అగ్గి రాజుకుంటోంది. ప్రతిరోజు 3, 4 చోట్ల అడవులు కాలుతున్నాయి. అడవుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నాం.