అంబేద్కర్ ఆలోచనలు సజీవం

247

విశాఖపట్నం, ఏప్రిల్ 14 (న్యూస్‌టైమ్): రాజ్యంగ నిర్మాత ‘భారతరత్న’ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు సజీవంగా నిలపాల్సిన అవసరం ఉందని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి అన్నారు. బుధవారం ఏయూలో నిర్వహించిన అబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఏయూ న్యాయ కళాశాల వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పరిపాలనా భవనం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నూతనంగా రూసా నిధులు రూ 90 లక్షలతో ఆధునీకరించిన ఆర్ట్స్ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబద్కేర్ అసెంబ్లీ మందిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ఆచరణలో చూపుతున్న మన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. మహిళలకు 50 శాతం పైగా పదవులు కేటాయిస్తూ సామాజిక వికాసానికి నాంది పలుకుతున్నారన్నారు. దీనిని నాడు అంబేద్కర్ కోరుకున్నారని, నేడు రాష్ట్రంలో ఇది అమలు అవుతోందన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, తత్వాన్ని అర్ధం చేసుకుంటూ నిస్వార్ధంగా పనిచేయాలని సూచించారు.

చారిత్రక సంపదగా నిలచిన అసెంబ్లీ మందిరాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించడం జరిగిందన్నారు. మేధో చర్చల వేదికగా ఇది నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి. క్రిష్ణమోహన్, అంబేద్కర్ అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య టి. శోభశ్రీ, ఎస్సీ, ఎస్టీ, బిసి సి బోధన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి. అర్జున్, ప్రిన్సిపాల్స్ ఆచార్య కె.శ్రీనివాస రావు, పేరి శ్రీనివాస రావు, ఎస్.సుమిత్ర, పి. రాజేంద్ర కర్మార్కర్, ఎస్.కె భట్టి, గిరిజా శంకర్, ఏయూ పాలక మండలి సభ్యురాలు పవార్, ఆటా అధ్యక్షుడు జాలాది రవి, ఆచార్య టి.షారోన్ రాజు, ఎన్.ఏ.డి పాల్, డీన్లు, అధికారులు, వార్డెన్లు, ఆచార్యులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.