‘సాగర్’లో సానుభూతి సమరం

555

అందరి లక్ష్యం జానారెడ్డి!
( మార్తి సుబ్రహ్మణ్యం)

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులు సానుభూతి సమరం సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలయిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ అభ్యర్ధి కుందూరి జానారెడ్డి, ఇటీవల మృతి చెందిన టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య తనయుడు, నోముల భగత్ ఇద్దరూ సానుభూతినే నమ్ముకున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఒకరు రాజకీయ దురంధరుడయితే, మరొకరు తండ్రిని పోగొట్టుకున్న యువ నాయకుడు. ఇప్పుడు సాగర సమరం వీరిద్దరి మధ్యనే కొనసాగుతోంది. రంగంలో ఉన్న బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.  ఆ పార్టీ తన ఓటు బ్యాంకు పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తోంది. టీఆర్‌ఎస్-బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో జానారెడ్డినే లక్ష్యంగా ఎంచుకోవడం బట్టి ఆయనే ఉమ్మడి ప్రత్యర్థిలా మారారు.

ఇప్పటివరకూ కేవలం రెండు ఎన్నికల్లో తప్ప, మిగిలిన అన్ని ఎన్నికల యుద్ధాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డి,  తన రాజకీయ జీవితంలో గతంలో ఎప్పుడూ లేనంత ఒత్తిళ్ల మధ్య పోటీ చేస్తున్నారు. ఏ ఎన్నికల్లోనయినా తన నియోజకవర్గంలో చివరగా ప్రచారం చేసి, మిగిలిన అన్ని రోజులూ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్ధుల విజయానికి కేటాయించే జానారెడ్డి.. ఒకసారి రామ్మూర్తియాదవ్, మరోసారి గత ఎన్నికల్లో నోముల నర్శింహయ్య చేతిలో ఓడిపోయారు. జానారెడ్డి ఓడిన రెండుసార్లూ యాదవులే విజయం సాధించడం విశేషం. ఇప్పుడు కూడా ఆయన యాదవ అభ్యర్ధితోనే తలపడుతుండటం విశేషం.

దివంగత ఎమ్మెల్యే నోముల జీవించి ఉన్న సమయంలో, అభివృద్ధి కుంటుపడిన సందర్భంలో సీనియర్ అయిన జానారెడ్డిని ఓడించి పొరపాటు చేశామన్న భావన సాగర్ ప్రజల్లో ఉండేది. సాగర్ ప్రజలు జానారెడ్డిని ఆ స్థాయిలో తమ సొంతం చేసుకున్నారు. సాగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధి, ప్రాజెక్టులన్నీ ఆయన హయాంలో వచ్చినవే. హైదరాబాద్‌కు వచ్చే సాగర్ వాసులకు, ఎలాంటి లోటు లేకుండా వారి పనులు పూర్తి చేసి పంపించడం ఒక సంప్రదాయంగా వస్తోంది. నియోజకవర్గంలోని  మండలాల్లో, కొత్తగా కలిసిన మండలాలు మినహా, మిగిలిన అన్ని మండలాల్లోని గ్రామాలు జానారెడ్డికి కొట్టిన పిండి.

ఆయా గ్రామ నేతలను ఆయన పేరు పెట్టి మరీ పిలుస్తుంటారు. తమను ఆయన మెచ్చుకున్నా, ఆగ్రహించినా జనం పెద్దగా పట్టించుకోరు. తప్పు చేసిన నాయకులకు అందరి ఎదుటే అక్షింతలు వేస్తారు. మండల నేతలకు క్లాసులు పీకినా, చివరకు వారి పని పూర్తి చేసి పంపిస్తారు.  జానారెడ్డి ఆ స్థాయిలో వారి మనసులలో పెద్దమనిషిగా స్థిరపడిపోయారు. ఆ స్థాయిలో ప్రజలతో మమేకం అయిన జానారెడ్డి, తన స్వయంకృతంతో గత ఎన్నికలో ఓడిపోయారు. ప్రజల్లో ఆయనపై సానుభూతి కనిపిస్తుండటానికి అదొక ప్రధాన కారణం. ఆయన ఇప్పటికే మూడవ దఫా ప్రచారం నిర్వహిస్తుండటం విశేషం.

నాటి నుంచీ అక్కడి పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన తనయుడయిన రఘువీర్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ, నియోజకవర్గ వ్యవహారాలను తనయుడే చూసేవారు. స్థానిక నేతలతో సమీక్షలు, పార్టీపరమైన వ్యూహాలన్నీ ఆయనే రచించేవారు. ఇప్పుడు కూడా పేరుకు అభ్యర్ధి జానారెడ్డి అయినప్పటికీ.. ఎన్నిక వ్యూహమంతా తనయుడు రఘువీర్‌రెడ్డే తెర వెనుక నుంచి రచిస్తున్నారు. సాగర్ యువకుల్లో ఆయనకు ఓ క్రేజ్ ఉంది. ఇప్పుడు దానితోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గంతోపాటు, దశాబ్దాల క్రితమే ఆంధ్రా నుంచి వచ్చిన సెటిలర్లు పార్టీలకు అతీతంగా జానారెడ్డిని  బలపరుస్తుండటం విశేషం. తొలి నుంచీ గిరిజన తండాల్లో బలమైన పట్టున్న కాంగ్రెస్, ఇప్పుడు విజయం కోసం అదే తండాలపై ఆధారపడుతున్నట్లు క నిపిస్తోంది. అయితే తొలిసారి బీజేపీ గిరిజన అభ్యర్ధిని బరిలోకి దింపడంతో, సమీకరణల్లో మార్పు వచ్చే అవకాశం ఉందంటున్నారు.  ఇప్పటికే రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్‌అలీ వంటి నేతలంతా జానారె డ్డికి మద్దతుగా బరిలో ఉన్నారు.

ఇక అధికార టీఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కూడా, సానుభూతి ఆధారంగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. దానికి తగినట్లుగానే తండ్రి లేని బిడ్డగా, అర్బన్ ప్రాంతాల్లో ఆయన పట్ల సానుభూతి కనిపిస్తోంది. యువకుడైన భగత్ స్థానికంగా సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. తండ్రి జీవించి ఉండగా నియోజకవర్గంపై అవగాహన పెంచుకున్నారు. వీటికి మించి, నియోజకవర్గంలో యాదవుల సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం ఆయనకు కలసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో గిరిజనుల తర్వాత, ఎక్కువ సంఖ్యాబలం ఉన్నది యాదవులే.

నోముల నర్శింహయ్య జీవించిన సమయంలో మిగిలిన వర్గాల కంటే, యాదవులకే ఎక్కువ పనులు చేశారన్న ప్రచారం లేకపోలేదు. దానివల్ల మిగిలిన బీసీ కులాలు టీఆర్‌ఎస్‌కు దూరమయినందుకే, ఆ వర్గాలకు చెందిన టీఆర్‌ఎస్ బీసీ నేతలు ప్రచారం చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా,  గతంలో పోటీ చేసిన అనుభవం లేని భగత్, రాజకీయ దిగ్గజమైన జానారెడ్డిని ఢీకొంటున్నారు. తలసాని శ్రీనివాసయాదవ్ వంటి బలమైన మంత్రితో పాటు, జిల్లా ఎమ్మెల్యేలు భగత్ విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

ఇక బీజేపీ అభ్యర్ధి డాక్టర్ రవికుమార్ గిరిజన అభ్యర్ధి కావడంతో, ఆయన ఎవరి ఓట్లు చీలుస్తారోనన్న బెంగ కాంగ్రెస్-టీఆర్‌ఎస్‌లో  కనిపిస్తోంది. తొలుత బలహీనంగా ఉన్న బీజేపీ ప్రచారం, రెండు రోజుల నుంచి ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, డాక్టర్ లక్ష్మణ్ వంటి అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. జాతీయ నేత డి.కె.అరుణ, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి వంటి ప్రముఖులు తమ అనుచరులతో సాగర్‌లో మకాం వేశారు. పార్టీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ ఐదురోజుల పాటు సాగర్‌లోనే ఉండి ప్రచారం చేయనున్నారు. ఇటీవల పార్టీ అభ్యర్ధి డాక్టర్ రవికుమార్, తన సామాజికవర్గం వారిని ఓట్లు అభ్యర్ధిస్తూ, ’నాకు భయంగా ఉంది. అండగా నిలవాలంటూ’ భోరున విలపించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది.

అటు టీఆర్‌ఎస్ నుంచి ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఇటు బీజేపీ అభ్యర్ధికి ప్రచారం చేస్తున్న అగ్రనేతలంతా.. జానారెడ్డినే లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ నేతలు,  జానారెడ్డి గెలిచినా ఉపయోగం లేదనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. దీన్నిబట్టి  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.