ఐటిఐ పరీక్షలలో ఆన్‌లైన్ అవినీతి

1079

ఆన్‌లైన్ పేరుతో ఆఫ్‌లైన్ జేబుదోపిడీ
విద్యార్థుల జేబులకు చిల్లు
వెయ్యి ఇస్తేనే గైడ్ చేస్తారట
పదికోట్ల కుంభకోణం?
(చిట్టాల రవికుమార్- అమరావతి )

ఏపీలో ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంటు విభాగం నిర్వహించే ఐటిఐ పరీక్షల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతున్న ఈ దోపిడీకి విద్యార్థుల జేబులకు ఆఫ్‌లైన్‌లో చిల్లులు పడుతున్నాయి. ఈ వ్యవహారంలో కింది స్థాయి ప్రభుత్వ ఐటిఏ ప్రిన్సిపాల్, సిబ్బంది నుంచి  ఆర్‌డీడీ కార్యాలయ అధికారుల స్థాయివరకూ అంతా భాగస్వాములేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవిధంగా దాదాపు పది కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరోనా కారణంగా ప్రస్తుతం ఐటిఐ పరీక్షలు ఆన్‌లైన్ (సీబీటీ)లో జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ప్రభుత్వ ఐటిఐలు, గ్రేడింగ్ ఉన్న ప్రైవేట్ ఐటిఐలు, స్కిల్ డెవలెప్‌సెంటర్లు ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో కంప్యూటర్ల సాయంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి డిపార్టుమెంట్ నుంచి ఒక ప్రిన్సిపాల్ లేదా ట్రైనింగ్ ఆఫీసర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. నోడల్ అధికారి కింద ముగ్గురు డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్లను నియమించారు.  విద్యార్ధులకు ఎగ్జామ్ హాల్‌లో గైడ్‌చేసి, వారి వివరాలన్నీ కంప్యూటర్‌లో ఎన్‌రోల్ చేయించడం వీరి బాధ్యత. అప్పుడుగానీ  ఎగ్జామ్ పేపర్ లాగిన్ ఓపెన్ కాదు. ఇవన్నీ కరెక్టుగా అప్‌లోడ్ చేయకపోతే విద్యార్ధులు పరీక్షకు అనర్హలవుతారు. ఆ సాంకేతిక సమస్యతో విద్యార్ధి పరీక్ష రాయలేక ఫెయిల్ అవుతారు. విద్యార్ధులు ఆఫ్‌లైన్ చదువుకున్న వారు కావడంతో, వారికి కంప్యూటర్‌పై తగిన అవగాహన లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఐటిఐ పరీక్ష నిర్వహకుల జేబు దోపిడీ ఇక్కడ నుంచే మొదలవుతోంది. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు ఒక విద్యార్ధికి వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే, గైడ్ చేసేది లేదని బెదిరిస్తున్న పరిస్థితి. దీనితో  తామెక్కడ ఫెయిలవుతామేమోనన్న భయంతో వారడిగిన వెయ్యి రూపాయలు సమర్పించుకోవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడిందని, విద్యార్ధుల తలిదండ్రులు వాపోతున్నారు. డబ్బులివ్వడానికి నిరాకరిస్తున్న తలిదండ్రులు, వారిని నిలదీస్తే.. ఈ డబ్బులు గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్, డిప్యూటీ డైరక్టర్, స్టేట్ డైరక్టరేట్‌లో  కార్యాలయ ముఖ్యులకు ఇవ్వాల్సి ఉంటుందన్న చిదంబ రహస్యాన్ని బయటపెడుతున్నారు. అసలు వారి ఆదేశాల మేరకే మేం ఇవన్నీ వసూలు చేస్తున్నామని కింది స్ధాయి సిబ్బంది కూడా అసలు విషయం చెబుతున్నారు.

ఈ విధంగా విద్యార్ధుల నుంచి జోన్ 1 పరిథిలోకి వచ్చే వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం; జోన్ 2 పరిథిలోకి వచ్చే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో అందరికీ వాటాలున్నాయన్న ఆరోపణలున్నందున, ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధం కాక విద్యార్ధులు అయోమయంలో ఉన్నారు.

చాలామంది విద్యార్థులకు కోర్సు పూర్తయి ఏడాది కావస్తున్నా, వారికి ఐటిఐ పాస్ సర్టిఫికెట్లు లేక ఖాళీగా ఉన్నారు. ఇది తలిదండ్రులకు మరింత భారంగా మారింది. ఎంతోమంది విద్యార్ధులకు ఫీజులు కట్టినా హాల్‌టికెట్లు రాలేదు. హాల్‌టికెట్లు  వచ్చిన వారేమో,ఎగ్జామ్ హాల్‌లో కంప్యూటర్ సమస్యల వల్ల వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈవిధంగా పరీక్షలకు హాజరయినప్పటికీ,  పరీక్ష రాయని వారిసంఖ్య వేలల్లోనే ఉంటుందని సమాచారం. ఈ పరిస్థితిలో విద్యార్ధులకు సహకరించాల్సిన అధికారులు, వారిని దోపిడీకి గురిచేయడంపై తలిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రధానంగా జోన్-1, 2 సంబంధించి ఆరు జిల్లాల్లో  ఒకే అధికారి రెండు చోట్లా ఇన్చార్జి డిప్యూటీ డైరక్టర్లుగా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒకే అధికారి ఆరు జిల్లాల పరీక్షలను ఎలా సమన్వయం చేయగలుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా ఓ ఉన్నతాధికారి ఆదేశాలు, మరో కీలక  అధికారి ఆశీస్సులతోనే ఈ వసూళ్ల బాగోతం కొనసాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది విద్యార్ధులు సిబీటీ.. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్‌లైన్)లో పరీక్షలు రాస్తున్నారు. వీరికి కంప్యూటర్ల విషయంలో  గైడ్ చేసే విధానాన్ని అడ్డుపెట్టుకుని,  ఒక్కో విద్యార్ధి నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తే అది దాదాపు పదికోట్ల రూపాయలవుతుందన్నమాట. సహజంగా ఐటిఐ పరీక్షలు, దాని విధానం ఏమిన్నది బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. పరీక్షా  కేంద్రాల బయట టెన్త్, ఇంటర్ పరీక్షలా పెద్ద హడావిడి ఉండకపోవడంతో, ఐటిఐ పరీక్షల్లో ఏం జరుగుతుందన్న విషయం బయటవారికి తెలిసే అవకాశం ఉండదు.

అంతా గుంభనంగా, సర్దుబాట్ల తరహాలో ఈ పరీక్షలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంటాయి. ఈ ధైర్యంతోనే ఐటిఐ అధికారులు- ఉద్యోగులు, ఇలాంటి అవినీతిచర్యలు కొనసాగిస్తున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఐటిఐ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవినీతిపై.. విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు విద్యార్ధులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఓముగ్గురు ఉన్నతాధికారుల  పాత్రపై విచారణ జరిపించాలన్నదే వారి ఫిర్యాదు సారాంశం.

ఫిర్యాదులు రాలేదు: లావణ్య
ఐటిఐలకు సంబంధించి తమకు ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డైరక్టర్ బొడ్డు లావణ్య చెప్పారు. కంప్యూటర్‌పై అవగాహనకు సంబంధించి సెకండ్ ఇయర్ బ్యాచ్‌కు కొన్ని సమస్యలుంటే ఉండవచ్చు.కానీ మిగిలిన వారికి మేం చాలాకాలం క్రితమే ట్రైనింగ్ ఇచ్చాం. ప్రైవేటు కాలేజీ వాళ్లు కోర్టుకు వెళ్లారు. మాకు పరీక్షల నిర్వహణపై ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. అయితే, రెండు జోన్లకు ఒకరినే ఇన్చార్జిని నియమించడంపై ప్రశ్నించగా, ప్రస్తుతం డిపార్టుమెంటులో కొన్ని ఖాళీలున్నందున ఆ విధంగా ఇన్చార్జులను నియమించాల్సి వచ్చిందన్నారు. జోన్ 2 కూడా జోన్ 1 పక్కనే ఉన్నందున,  రెండూ కలిపి ఒకరికే ఇచ్చామని చెప్పారు. ఆయనకు  హెడ్డాఫీసులోనే మరొక బాధ్యత అప్పగించామని ఆమె వివరణ ఇచ్చారు.

కానీ ప్రైవేటు కాలేజీలు కూడా సీబీటీలోనే జరుగుతుండటం గమనార్హం. ప్రైవేటు-ప్రభుత్వ విద్యార్ధులకు కలిపి పరీక్షలు నిర్వహిస్తున్నారు.  అయితే విద్యార్ధులు మాత్రం పాత పద్ధతిలోనే,  అంటే..  ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించాలని జనవరిలో హైకోర్టుకెళ్లారు. ముందు దానిపై స్టే ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్, తర్వాత అదే జడ్జి దాన్ని స్టే తొలగించి, సీబీటీ పద్ధతిలోనే పరీక్షలు రాయాలని ఆదేశించారు.