డీజీపీ సవాంగ్ వర్సెస్ ఏబీ వెంకటేశ్వరరావు!

716
– ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు  సీబీఐకి ఇవ్వండి!  
– డీజీపీ ఫోర్జరీ చేశారని ఆరోపణ
– సీఐడీ చీఫ్ సునీల్, ఏసీబీ చీఫ్ పీఎస్సార్ పాత్ర కూడా
– సహానీ, ప్రవీణ్ ప్రకాష్‌పై చర్యకు డిమాండ్
– సీఎస్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ
– సీఎస్ అంగీకరించకపోతే సుప్రీంకు వెళ్లే యోచన
– నంబి నారాయణ్ దారిలో ఏబీ వెంకటేశ్వరరావు
( మార్తి సుబ్రహ్మణ్యం)
 ఏపీ పోలీసు శాఖలో వార్ మొదలయింది. స్వయంగా డీజీపీనే డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారంటూ సస్పెండయిన డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు పోలీసు వర్గాల్లో సంచనలం సృష్టిస్తోంది. ఆ ఫోర్జరీ డాక్యుమెంట్లపై సీబీఐతో విచారణ చేయించాలంటూ ఏబీవీ.. సీఎస్‌కు రాసిన లేఖపై సరికొత్త చర్చకు దారితీసింది. స్వయంగా డీజీపీ ఏవిధంగా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేశారో, తనపై ఎవరెవరు కుట్రకు పాల్పడ్డారో వారి పేర్లను బయట పెట్టడం మరో సంచలనం. ఏబీవీ సీఎస్‌కు రాసిన లేఖ.. ఐపిఎస్‌లలో వర్గవిబేధాలు బట్టబయలుచేసింది. మరి ఈ అంశంలో డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.
సస్పెండుకు గురయిన సీనియర్ ఐపిఎస్, ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరో సంచలనానికి తెరలేపారు. తన కేసునకు సంబంధించి చోటు చేసుకున్న డాక్యుమెంట్ల ఫోర్జరీ వ్యవహారంపై  విచారణను,  సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్‌కు లేఖ రాశారు. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల వ్యవహారంలో  డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఉన్నారంటూ ఏబీవీ మరో సంచలన ఆరోపణకు తెరలేపారు. డీజీపీతో పాటు సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు, ఇంటలిజన్స్,  మరికొందరి పాత్ర ఉందంటూ ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఉమ్మడి, విభజిత రాష్ట్ర పోలీసు చరిత్రలో, ఈ విధంగా ఒక డీజీపీ స్థాయి అధికారి.. డీజీపీతో సహా సీనియర్ ఐపిఎస్‌ల చర్యలపై  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ఇదే ప్రథమం. ఫోర్జరీ డాక్యుమెంట్లపై  సీఐబీతో విచారణ జరిపించాలంటూ ఏబీవీ రాసిన లేఖ, ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమయింది.
ఎంక్వయిరీస్ ఆఫ్ కమిషన్ విచారణ సందర్భంగా తనపై దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, వాటినే ఆధారాలుగా ససమర్పించారంటూ స్పష్టం చేసిన 1989 బ్యాచ్‌కు చెందిన ఏబీవీ.. తాజాగా సీఎస్‌కు దానికి సంబంధించిన ఆరు పేజీల విశ్లేషణ లేఖను సమర్పించడం విశేషం. కాగా ఆయన తన కేసును 1994లో జరిగిన నంబినారాయణ్ ఉదంతంతో పోల్చారు. ఫోర్జరీలు, దొంగడాక్యుమెంట్లతో కొందరు పోలీసు అధికారులు తప్పుదోవపట్టించిన నంబి నారాయణ్ కేసులో.. తప్పుడు కేసు బనాయించినందుకు నంబికి, కేరళ సర్కారు కోటీ 30 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీవీ కూడా, అదే దారిలో పయనిస్తున్నట్లు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయం స్పష్టం చేస్తోంది. కాగా తనపై వచ్చిన తప్పుడు రిపోర్టులను తనిఖీ-నిర్థరణ  చేసుకోకుండా,  ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినందుకు అప్పటి సీఎస్ నీలం సహానీ, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో సీఎస్‌ను కోరారు.
ఇదిలాఉండగా ఏబీవీ విచారణ సందర్భంలో, ఆయన కోరిన విధంగా  2-2-20 నాటి మెమో కాపీ ఇవ్వాలని కమిషన్ కోరింది. కానీ డీజీపీ, సీఐడీ కార్యాలయాలు  వాటిని అందుబాటులో ఉంచలేదు.
అయితే.. గతంలో ఏబీవీ కేసుకు సంబంధించి క్యాట్‌లో వేసిన పిటిషన్‌కు ప్రభుత్వం కౌంటర్ వేసింది. ఆ సందర్భంలో ప్రభుత్వం 2.2-20 నాటి మెమో కాపీని క్యాట్‌కు సమర్పించింది. ఇప్పుడు ఆ కాపీనే బయటకు తీసిన ఏబీవీ, పోలీసు బాసులను  ఆత్మరక్షణలో నెట్టడం ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా ఏబీ ఆ కాపీనే ఇప్పుడు బ్రహ్మాస్త్రంగా మారినట్టయింది.
సీఎస్ నో అంటే సుప్రీంకు?
కాగా తన సస్పెన్షన్ వెనక దారి తీసిన కారణాలు, అందులో సహచర ఐపిఎస్‌ల పాత్రను 9 పేజీల లేఖలో వివరించిన ఏబీ వెంకటేశ్వరరావు, సీఎస్ నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ తనకు వ్యతిరేకంగా సృష్టించిన ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసు విచారణను,   ప్రభుత్వం సీబీఐకి ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచిస్తున్నట్లు ఆయన సహచరులు చెబుతున్నారు. ఇదిలాఉండగా మే 3న సుప్రీంకోర్టులో, ఏబీవీ కేసు తుది విచారణకు రానుంది. ఆయనపై ఎంక్వరీయిస్ ఆఫ్ కమిషన్ నిర్వహించిన విచారణ నివేదకను కూడా ఆలోగా సమర్పించాలని, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజా పరిణామాలపై అటు ఐపిఎస్ అధికారుల సంఘంలో కూడా సంకటంలో పడినట్టయింది. నష్టనివారణ కోసం సంఘం అత్యవసర సమావేశం నిర్వహిస్తుందా? లేక గతంలో మాదిరిగానే తనకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తుందా? అన్న చర్చ పోలీసు అధికారులో మొదలయింది. కొన్నేళ్ల నుంచి భేటీ కాని ఐపిఎస్ అధికారుల సంఘం సర్వసభ్య సమావేశం… సహచరుల మధ్య జరుగుతున్న ఘర్షణలో జోక్యం చేసుకోకపోవడం అటుంచి, కనీసం చర్చించకపోవడంపై అధికారులలో విస్మయం వ్యక్తవుతోంది.