అభినవ అన్నమయ్య.. మన దీక్షితులయ్య!

861

జగన్నాధ స్మరణతో పులకిస్తున్న ఏడుకొండలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పూర్వం రాజుల కాలంలో భట్రాజలుండేవారు. రోజూ సవాలక్ష సమస్యలు, కోటి వర్రీస్‌తొ సతమతమయ్యే మహారాజులను ఆనందపరచడం భట్రాజుల పని. మహారాజులకు లేని గుణాలు కూడా సృష్టించి వారిని ఆకాశానికెత్తడం ద్వారా, ప్రభువులపై ఒత్తిడి త గ్గించి వారిని ప్రసన్నం చేసుకోవపడం వారి ప్రధాన విధి. వారిని కొలువులో నియమించేదే దానికోసం. తర్వాత రాజులు, రాజ్యాలు పోయి ప్రజలే ప్రభువులయిన ప్రజాస్వామ్య యుగం వచ్చేసింది. దానితో ఆ భట్రాజ వ్యవస్థ అంతరించింది. అయి తే ఆ కులానికి చెందిన వారిప్పుడు గౌరవప్రదమైన వృత్తుల్లో కొనసాగుతున్నారు. మరికొందరు ఉన్నత పదవుల్లో కూడా రాణిస్తున్నారు. అది వేరే విషయం!

కానీ.. రాజుల కాలం చివరిదశలో అంతరించిన భట్రాజ వ్యవస్థకు తిరిగి జీవం పోసేందుకు, రమణ దీక్షితుల వంటి డాక్టర్ పంండితోత్తములు చేస్తున్న కృషికి,  పాలక ప్రభువుల గుర్తింపు లభించడం గొప్ప విషయం. గత రెండేళ్ల ముందు నుంచీ.. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ..  దీక్షితుల వారు ‘జగన్నాధుడి’ కోసం అప్రతిహతంగా చేస్తున్న భజనకు ఆ జగన్నాధుడు కరుణించి, తిరిగి కొలువులో చేరే వరం ప్రసాదించాడు. దానితో పరమానందభరితుడయిన ఆ జగన్నాధభక్తుడు దీక్షితులుంగారు.. మహదానందంతో స్వామివారి కొలువులో మళ్లీ సేమ్ పొజిషన్‌లో చేరిపోయారు. సంతోషం. చేసిన సేవలు, పాడిన కీర్తనలు, మోసిన పల్లకీకి తగిన ప్రతిఫలం లభించడం మంచిదే కదా? దాదాపు రెండేళ్లపాటు అయ్యప్పదీక్ష మాదిరిగా డాక్టరు గారు వేసిన ‘జగన్నాధదీక్ష’కు.. ఆరకంగా శుభం కార్డు పడిందన్నమాట!

కానీ ఏమాటకు ఆమాట. చేసిన మేలు మర్చిపోయే కృతఝ్నలున్న ఈ రోజుల్లో,  ఊడిపోయిన ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చినందుకు ఎంతమంది విశ్వాసం ప్రకటిస్తారు చెప్పండి? అవి సాధు జంతువులకు మాత్రమే సాధ్యమయ్యే లక్షణం. మనుషులలో భూతద్దం వేసి వెతికినా కనిపించని విశ్వాసం అనే కృతజ్ఞత,  ఇంకా సజీవంగానే ఉందని దీక్షితులు రుజువు చేశారు. బహుశా ఆ కృతజ్ఞతతోనే జగన్‌బాబును ఆయన విష్థుమూర్తి రూపంలో వచ్చిన మహనీయుడిగా కీర్తించారు. అప్పటివరకూ వెంకటేశ్వరుడిపై లెక్కలేనన్ని కీర్తనలు రాసి పాడింది  ఒక్క అన్నమయ్య మాత్రమేనని.. ఆయన పరమపదించి శతాబ్దాలయిందని భక్త ప్రపంచానికి తెలిసేది. కానీ శ్రీమాన్ రమణ దీక్షితులుంగారి ‘జగన్నాధ’భజన పుణ్యాన.. అన్నమయ్య అశువులు బాయలేదు. దీక్షితులుగారి అంశలో ‘జగన్నాధభక్తుడి’గా వెంకటేశ్వరుని కొలువులో ఉన్నారన్న విషయం,  మొన్నామధ్య గానీ అనంతకోటి భక్తజనావళికి తెలియలేదు.

సరే.. తనకు కొలువు తనకు తిరిగి ఇప్పించిన విశ్వాసంతో ఒళ్లు పులకరించి, మనసు ఉప్పొంగి రమణ దీక్షితులు, జగనన్నను విష్ణుమూర్తితో పోల్చి ఉండటాన్ని తప్పుపట్టలేం. ముందే చెప్పినట్లు భజన వేయి రకాలు. తాళం అనేక రకాలుగా కొట్టవచ్చు. చిడతలు ఎన్నోరకాలుగా వాయించవచ్చు. కానీ… జగనన్నను విష్ణుమూర్తిగా అభివర్ణించిన దీక్షితులు, ఆయనకు తెలియకుండానే ఆ ‘కలియుగ మహావిష్ణువును’ అనవసరంగా విమర్శల బురదలోకి లాగారు. ఊడిపోయిన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించినందుకు, జగనన్న కొలువుదీరిన తాడేపల్లికి వెళ్లి, శాలువా కప్పి తిరుపతి ప్రసాదం, పులిహోర, వడ, పొంగలి పెట్టి.. రెండు పేజీల జగన్నాధస్తోత్రం పాడి, తన మానాన తాను కొలువుచేసుకుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు.

అలాకాకుండా.. తన విశ్వాసాన్ని విశ్వానికి తెలియచేయాలన్న తొందరలో, జగనన్నను విష్ణుమూర్తితో పోల్చడం ద్వారా ఆయన ఇరుకున్నది కాక, పాపం ఉద్యోగం ఇచ్చిన పాపానికి,  జగనన్ననూ ఆ విమర్శల బురదలో ఇరికించడమే ట్రాజిడీ. రమణ దీక్షితులు సీఎం జగనన్నను అలా విష్ణుమూర్తితో పోల్చారో లేదో.. ఇలా నలుగుచెరుగులా జగన్‌పై విమర్శల ప్రవాహం మొదలయింది. ప్రధానంగా సోషల్‌మీడియాలో విష్ణుమూర్తి వ్యాఖ్యలపై వెటకారపు వ్యాఖ్యలు జగనన్న పరువుతీశాయి. ‘మీ విష్ణుమూర్తిని ఒక్కసారైనా లక్ష్మీదేవితో కలసి తిరుమలేశుని దర్శించుకోమని చెప్పవయ్యా రమణ దీక్షితులూ’ అంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు.

మరికొందరు భజన చేసే తాళాల ఫొటో పెట్టి తాళాలు ఇలా కూడా కొడతారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ ఒక్కసారి కూడా భార్యతో తిరుమలకు వెళ్లలేదన్న విమర్శలు, ఇప్పుడు దీక్షిడతులు పుణ్యాన మరోసారి గుర్తుచేసినట్టయింది. ఆవిధంగా తన ఊడిపోయిన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించిన జగన్‌బాబుకు మేలు చేయకపోగా, పాతవన్నీ గుర్తుచేసి ఆయనను కొత్తగా ఇరికించారు. అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఇదే మరి!

సరే.. ఎలాగో ‘కలియుగ విష్ణుమూర్తి’ కరుణతో తిరిగి కొలువులో చేసిన దీక్షితులు డాక్టరు గారు, పనిలోపనిగా భక్తశిఖామణుల అజ్ఞానాంధకారాన్ని కూడా, చేతిలో కనిపించే సెల్‌ఫోన్‌తో పారద్రోలాల్సిన బాధ్యత తీసుకుంటే మంచిది. ఎందుకంటే.. గతంలో చంద్రబాబు నాయుడు ఆయన ఉద్యోగం ఊడగొట్టినప్పుడు, తిరుమలకు వచ్చే భక్తులు ఎట్టి పరిస్థితిలో హుండీలో కానుకలు వేయవద్దని పిలుపునిచ్చారు. ఆలయంలో అన్ని కార్యక్రమాలకు భక్తులు విరాళమిస్తుంటే, హుండీలో వేసిన కానుకలను టీటీడీ బోర్డు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారంటూ టన్నుల కొద్దీ కన్నీరు కార్చారు. చెన్నై, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో కార్చిన ఆ కన్నీరు మహాసముద్రమయి, ఆనాడు లోటస్‌పాండు వరకూ ప్రవహించింది. ఇది అందరికీ తెలిసిన పాత కథే.

అయితే.. అప్పుడు హుండీలో కానుకలు వేయవద్దని కన్నీరు మున్నీరయి అభ్యర్ధించిన అదే దీక్షితులుం గారు.. తిరిగి పాత ప్లేసులోకే వచ్చారు. కాబట్టి.. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా హుండీలో డబ్బులు వేయవద్దని, భక్తశిఖామణులకు పిలుపునిస్తారా? లేక తన కొలువు తనకు వచ్చేసింది కాబట్టి, తాను కోరుకున్న ‘జగన్నాధుడు’ విష్ణుమూర్తి అంశలో పరకాయ ప్రవేశం చేసి వచ్చారు కాబట్టి.. ‘‘అప్పుడు చెప్పిందంతా తూచ్. ఇప్పుడంతా నిక్షేపంగా కానుకులు హుండీలో వేయవచ్చని’’ సిగ్గుపడకుండా చెబుతారా అన్నదే అందరూ ఎదురుచూస్తున్న అంశం. ఫర్వాలేదు. ఇప్పుడు నేను వచ్చా కాబట్టి హ్యాపీగా కానుకలు వేసుకోవచ్చని చెబితే, భక్తజనం పుణ్యం పుచ్చిపోయినట్లే!

అన్నట్లు…పనిలోపనిగా, ఎన్నికల ముందు పింక్ డైమండ్ పోయిందని నానా యాగీ చేసిన  శ్రీమాన్ దీక్షితులు డాక్టరు గారు, ఇప్పుడు ఎలాగూ కొలువులో చేరిపోయారు కాబట్టి.. ‘పోయిన నీ పింక్ డైమండును తిరిగి నీవే తెచ్చుకోమని  వెంకన్న చెవిలో ఉచిత  సలహా ఊదితే ఆయన పుణ్యం ఊరకపోదు.

చాలామంది నాయకులు జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చినందుకు,  దీక్షితులను ఆడిపోసుకోవడం ఏమాత్రం బాగోలేదు. కొంతమంది చెట్టుకింద చిలకజోస్యం చెబుతుంటారు. నీకు రాజయోగం పడుతుందని మరికొంతమంది జోతిషులు చెబుతుంటారు. నీవు త్వరలో శుభవార్త వింటావని కోయదొరలు చేయిచూసి చెబుతుంటారు. ఇంకొందరు రాజశ్యామల యాగాలు చేసి, రాజకీయ నాయకులను మెప్పిస్తుంటారు.

ఏదైనా.. ఎవరైనా.. కూటికోసం కోటి విద్యలు. అంతే!  కాకపోతే యాచించడం,ఆశించే తీరులోనే తేడా!!  అప్పుల్లో అనేక రకాలుంటాయి. ముష్టిలో  వీరముష్టి వేరు. కొందరు లౌక్యంగా ఇతరులను పొగిడి అప్పు చేస్తారు. కానీ ప్రభుత్వాలు మాత్రం చాలా కాస్ట్లీగానే కనిపిస్తూ, అంతే కాస్ట్లీగా అప్పులు చేస్తుంది. అందరి లక్ష్యం మెప్పించి, ఒప్పించడమే. అందుకు మన జగన్నాధభక్తుడూ మినహాయింపు కాదు. జానెడు కడుపు నింపుకునేందుకు ‘జగన్నాధ’స్మరణ చేయడం తప్పు లేదు కదూ.. ఏమంటారు డాక్టరు గారూ?!