కోవిడ్ నిబంధనలు పట్టని పార్టీలు !

0
138

సాగర్, తిరుపతిలో వంద లాదిమందితో ర్యాలీలు
సభల్లో నేతల మధ్య కనిపించని భౌతిక దూరం
పార్టీల ప్రచారంపై పోలీసుల పక్షపాతం
రూల్సు సామాన్యులకేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం )

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రెండవ దశలో కూడా విజృంభిస్తోంది. దానితో కేంద్రం  రంగంలోకి దిగి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ప్రధాని మోదీ కరోనా రెండవ దశపై అప్రమత్తంగా ఉండాలని, వాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఫలితంగా ఆంధ్రపదేశ్-తెలంగాణ రాష్ట్రాలు ప్రజలందరినీ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశాయి. మాస్కులు ధరించకపోతే 200 నుంచి 2 వేల వరకూ చలాన్లు విధిస్తున్నాయి. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ఈ విషయంలో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దానితో రోడ్డెక్కిన పోలీసులు, మాస్కులు ధరించని వారిపై చలాన్ల కొరడా ఝళిపిస్తున్నారు. దీనితో విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి నగరాల్లో ప్రజలు పోలీసు చలాన్లకు భయపడి మాస్కులు తప్పనిసరిగా వాడుతున్న సంస్కృతి  మొదలయింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం, ఈ నిబంధన అంత కఠినంగా అమలుచేస్తున్న దాఖలాలు లేవు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం, కరోనా దృష్ట్యా పండుగలపై నిషేధం విధించారు. సామూహిక కార్యక్రమాలు తగ్గించుకోవాలని సూచించారు. వివాహాలకు అతిధుల సంఖ్యను కుదించుకోవాలని సూచించారు. స్కూళ్లను మూసివేస్తూ ఆదేశాలిచ్చారు. కానీ ఏపీలో మాత్రం ఇలాంటి నిబంధనలు ఇంకా ప్రవేశపెట్టలేదు. కానీ, మాస్కులపై మాత్రం ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

ఇవన్నీ  బాగున్నప్పటికీ, రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాత్రం కోవిడ్ నిబంధనలను,  ఏ ఒక్క  రాజకీయ పార్టీలు కూడా పాటించకపోవడం, పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజలు మాస్కులు ధరించకపోతే చలాన్లు విధిస్తున్న పోలీసులు, అధికార-విపక్ష పార్టీల కార్యక్రమాల్లో జరుగుతున్న ఉల్లంఘనలపై మాత్రం ఎందుకు చలాన్లు వేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు రాజకీయ పార్టీలు అతీతతమా? అవి సామాన్యులకే పరిమితమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల ఏపీ-తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ, మున్సిపల్ , స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలేవీ, తమ ప్రచారంలో కోవిడ్ నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించలేదు. వందల సంఖ్యలో కార్యకర్తల ర్యాలీలు, భారీ సంఖ్యలో నామినేషన్లతో కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. అయినా రెండు రాష్ట్రాల పోలీసులు ఏ ఒక్క పార్టీ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలపైనయినా చలాన్లు విధించకపోవడం విమర్శలకు తావిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో అమిత్‌షా, కేటీఆర్  పాల్గొన్న ప్రచార సభలలోనూ కోవిడ్ నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

తాజాగా తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఏపీలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం జరుగుతోంది. సాగర్‌లో ప్రధాన పార్టీలయిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు వందలాది మందితో వెళ్లి నామినేషన్లు వేశారు. ఆ సందర్భంలో మాస్కులు ధరించిన వారి సంఖ్య బహు తక్కువయితే, భౌతిక దూరం పాటించిన వారి సంఖ్య శూన్యం. చివరకు ఇంటింటి ప్రచారంలో కూడా డజన్ల మంది పాల్గొంటున్నారు. అక్కడా ఇదే పరిస్థితి. అందులో పాల్గొన్న ఏ ఒక్క పార్టీ కార్యకర్తమీదయినా పోలీసులు చలాన్లు విధించలేదు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి హాజరయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీకి దాదాపు 2 వేల మంది యువకులు హాజరయ్యారు. చంద్రగిరికి చెందిన హాస్టళ్ల విద్యార్ధులు వారిలో ఎక్కువగా ఉన్నారు. ఏపీలోని హాస్టళ్లకు కరోనా సోకుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ ర్యాలీలో పాల్గొన్న యువకుల్లో మాస్కులు పెట్టుకున్న వారు పెద్దగా కనిపించలేదు. తర్వాత నిర్వహించిన సభలోనూ అవే దృశ్యాలు కనిపించాయి. చివరకు వేదికపై ఉన్న  బీజేపీ-జనసేన నే తలూ భౌతిక దూరం పాటించలేదు. ఇటీవల పవన్ హీరోగా నటించిన ‘వకీల్‌సాబ్’ ట్రైలర్ సినిమా చూసేందుకు,  తిరుపతిలోని ఓ థియేటర్‌లో అభిమానులు ఎగబడ్డారు. ఆ తొక్కిసలాటలో హాల్‌లోని అద్దాలు పగిలిపోయాయి. హాల్‌లో దూసుకువచ్చిన వారిలో మాస్కులు పెట్టుకుని కనిపించిన వారి సంఖ్య స్వల్పం.

ఇక తిరుపతి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి ప్రచారంలో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. వాహనంపై ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా, చాలామంది మాస్కులతో కనిపించలేదు.  గురుమూర్తి నామినేషన్ కూడా వేలాదిమందితో జరిగింది. ఆ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలెవరూ మాస్కులు ధరించిన దాఖలాలు లేవు. అందులో పాల్గొన్న వేలాదిమంది కార్యకర్తలకు భౌతిక దూరం పాటించాలన్న స్పృహ కూడా రాలేదు.  టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి కూడా అట్టహాసంగానే నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా కోవిడ్ నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించలేదు.

ఇటీవల వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి మనుమరాలు పుట్టినరోజు వేడుకలు, హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించారు. ఆ కార్యక్రమానికి వీవీఐపీలు హాజరయ్యారు. దానికి రెండువేల మంది హాజరయ్యారన్న వార్తలు  సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇలాంటి భారీ కార్యక్రమాలు, వందలు-వేల మంది భాగస్వామ్యం ఉన్న వేడుకలు ఏపీ-తెలంగాణలో నిర్విఘ్నంగా జరుగుతున్నా, పొలీసులు వాటిని నియంత్రించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి భారీ కార్యక్రమాల్లో కోవిడ్ నింబంధనలు పాటించని వారిపై, చలాన్లు వేయని కారణం వల్లనే, ఎవరికీ భయం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కరోనా కాలంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి కుటుంబంలో వివాహవేడుక జరిగింది. దానికి 45 మంది మాత్రమే హాజరయ్యారు.  కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించి, ఎమ్మార్వో అనుమతి తీసుకున్నారు. ఆవిధంగా  ఆ వివాహ వేడుకను సాదాసీదాగా, కుటుంబ సభ్యులకే పరిమితం చేసి  నిర్వహించిన డీజీపీ మహేందర్‌రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఉంది. నిజానికి డీజీపీ స్థాయి అధికారి తలచుకుంటే వేలమందిని ఆహ్వానించవచ్చు. కానీ ఆయన తన స్థాయి కంటే, నిబంధనలు పాటించేందుకే ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం. ఇక నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తనను కలిసేందుకు వచ్చే వారిని, కరోనా టెస్టులు చేసుకుని రావాలని సూచిస్తుండటం ద్వారా ఒక మంచి సంప్రదాయానికి తెరలేపారు.