బీజేపీ ప్రచారానికి జడ్పీ ఎన్నికల దెబ్బ!

0
46

తిరుపతి నుంచి వెనక్కి వెళ్లిపోతున్న బీజేపీ కార్యకర్తలు
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలే దిక్కు
( మార్తి సుబ్రహ్మణ్యం- తిరుపతి)

తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీకి జడ్పీ ఎన్నికల దెబ్బ తగిలింది. ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న వందలాది మంది కార్యకర్తలు, త్వరలో జరగనున్న జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల కోసం తిరిగి తమ గ్రామాలకు వెళ్లిపోతుండటంతో, కరపత్రాల పంపిణీ వ్యవస్థకు విఘాతం ఏర్పడింది. ఇది బీజేపీ ప్రచారం మందగించడానికి కారణమవుతోంది. క్యాడర్ లేక ఇతర జిల్లాల నుంచి వచ్చే వారిపై ఆధారపడుతున్న బీజేపీకి ఇది ఒక గుణపాఠమేనన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

ఏప్రిల్ 17న జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారానికి, రాష్ట్రంలోని కార్యకర్తలంతా హాజరుకావాలని బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దియోథర్ ఆదేశించారు. దానికి స్పందించిన జిల్లా పార్టీ నాయకత్వాలు తొలుత, తిరుపతి అసెంబ్లీ నియోకవర్గానికి వంద మంది చొప్పున కార్యకర్తలను పంపించాయి. కొద్దిరోజుల క్రితం ఆ సంఖ్య 200కు పెరిగింది. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ పరిథిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, దాదాపు 1500 మంది ‘వివిధ క్షేత్రాలకు’ చెందిన కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారంతోపాటు, ప్రతి ఇంటికీ కరపత్రాలు ఇవ్వడం వారికి కేటాయించిన ప్రధాన బాధ్యత. అయితే ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే, సంఘ్ పరివార్ సంస్థలు ప్రచారంలో ఉన్నాయి.

వైసీపీ,టీడీపీ మాదిరిగా నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల యంత్రాంగం లేకపోవడంతో, బీజేపీ నాయకత్వం అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం తిరుపతి లోక్‌సభ పరిథిలోని 7 నియోజకవర్గాల్లో బీజేపీ  ఒంటరిగా అన్ని పోలింగ్ బూత్ ఏజెంట్లను నియమించుకునే పరిస్థితిలో కూడా లేదు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో, కనీసం 250 పోలింగ్‌బూత్‌లు ఉంటాయి. ఆ లెక్కన కనీసం అక్కడ ఒక ఏజెంటు అవసరం ఉంటుంది. ఆ ప్రకారంగా 1750 మంది కార్యకర్తలు కావల్సి ఉంది.

అంతమంది కార్యకర్తల సంఖ్య లేని కారణంగానే.. ఇటీవలి జరిగిన సర్పంచ్, వార్డుసభ్యులు, మున్సిపల్ ఎన్నికల్లో, బీజేపీ నామమాత్రంగా పోటీ చేయాల్సి వచ్చింది. తొలి నుంచీ క్యాడర్‌ను పెంచుకోవడంలో బీజేపీ నాయకత్వాలు పెద్దగా శ్రద్ధగా చూపని కారణంగానే, ఈ పరిస్థితి ఏర్పందని సీనియర్లు చెబుతుంటారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో కూడా బయట నుంచి కార్యకర్తలను తెప్పించుకోవలసిన దుస్థితి ఏర్పడేందుకు, నాయకత్వాల వైఫల్యమే కారణమని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.

బయట ప్రాంతాల నుంచి వచ్చి కార్యకర్తలు పనిచేస్తున్న నేపథ్యంలో, ఏప్రిల్ 8న జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బీజేపీకి శరాఘాతంగా పరిణమించాయి. కొన్ని నెలల క్రితమే నామినేషన్లు వేసిన అభ్యర్ధులు కూడా, ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నారు. వారితోపాటు నియోజకవర్గ, మండల స్థాయి నేతలు కూడా ఉప ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో, ఇప్పుడు వారంతా సొంత ప్రాంతాలకు తిరిగివెళ్లిపోతున్న పరిస్ధితి ఏర్పడింది. దానితో  తిరుపతి ఎన్నిక ప్రచారం మందగించే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటివరకూ వారంతా తమకు కేటాయించిన గ్రామాల్లోనే ఉండి, ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇంకా పూర్తి స్థాయిలో కర పత్రాలు కూడా పంపిణీ చేయలేదని తెలుస్తోంది.

ప్రధానంగా పార్టీకి చెందిన కొందరు అగ్రనేతలు, తమ అనుచరులతో పెద్ద సంఖ్యలోనే తిరుపతి ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులయితే, భారీ సంఖ్యలో తిరుపతికి వచ్చారు. అయితే, ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు ఉండటంతో ఆయన అనుచరులంతా వెనక్కి వెళ్లిపోతున్నట్లు చెబుతున్నారు. ఫ్యాక్షన్ నాయకుడయిన ఆదినారాయణరెడ్డి వ్యక్తిగత సత్తా కారణంగానే, ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది. అది ఆయన వ్యక్తిగత సామర్థ్యమే తప్ప, అందులో పార్టీ పాత్ర లేదన్నది బహిరంగ రహస్యం.  మరో ఫ్యాక్షన్ నేత వరదాపురం సూరి కూడా భారీ సంఖ్యలో తన అనుచరులను తిరుపతిలో మోహరించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న  కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన బీజేపీ అగ్రనేతలంతా, జడ్పీటీసీ ఎన్నికల కారణంతో తిరిగి వెనక్కి వెళుతున్నారు. తమ గ్రామాల్లో నిలబెట్టిన అభ్యర్ధులను గెలిపించుకోవాలన్న పట్టుదలే దానికి కారణం.  దీనితో గ్రామాల్లో ప్రచారం చేసేందుకు కార్యకర్తలు కరవయిన పరిస్థితి ఏర్పడింది.

అయితే, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మాత్రం, ఇంకా గ్రామాల్లోనే పనిచేస్తుండటం బీజేపీ అభ్యర్ధికి ఊరటనిచ్చే అంశం. బీజేపీ అధికార ప్రతినిధి, తొలిరోజుల్లో మాదిగ దండోరా ఉద్యమాన్ని సమన్వయ పరిచిన విల్సన్.. మాదిగ వర్గానికి చెందిన కార్యకర్తలను నియోజకవర్గాల వారీగా మోహరించారు. ‘మన మాదిగ బిడ్డను ఆశీర్వదించ’మనే కరపత్రాలతో మాదిగపల్లెలకు వెళుతున్నారు. మాదిగ ప్రముఖులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి మాల వర్గానికి చెందిన వారు కాగా, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ మాదిగ వర్గానికి చెందిన వారు.