శ్రీ కంచి పరమాచార్య వైభవమ్

0
56

ఆయుర్వేద వైద్యం – బొమ్మల కొలువు

అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు.

”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు.

”పాలక్కాడ్ కేరళ”

వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”

“సరే. నీ పేరు ఏంటి?”

“హరిహర సుబ్రమణియన్”

“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”

అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో,  ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.

”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

మహాస్వామి వారు నవ్వుతూ “భేష్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు.

”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”

అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”

“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”

“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”

“నీకు వివాహం అయ్యిందా?”

“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”

“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”

అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”

“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”

అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. చాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తాకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”

“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపాయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళిపోతుంది”

పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నావు కదూ?”

“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళిపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”

మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు.

ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.

కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ డబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్తబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నట్టుగా చూసారు.

అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.”

మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో, “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.

మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

(సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్)