బాబు రాజకీయ ప్రస్థానం జగన్ చేతిలో ముగిసినట్టేనా…?

0
856

1978 శాసన సభ ఎన్నికలతో ప్రారంభమైన చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ముగింపున‌కు వచ్చేసినట్టే కనబడుతోంద‌ని లోకల్ పోల్స్ ఫలితాలు సూచిస్తున్నాయి. 2019 లో 15 శాతం సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ- రెండేళ్ల తర్వాత‌ జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం అంతే స్థాయి ఫలితాలకు పరిమితమైంది.

2019లో ఓడిపోయినప్పటికీ- 2024 లో పార్టీని తిరిగి అధికారంలోకి తేగల “గన్ పౌడర్” తన వద్ద ఉందని రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు అవలంబించిన రాజకీయ సాముగరిడీలు అనితర సాధ్యం.
ప్రతి చిన్న, పెద్ద విషయానికి టీవీల్లో లైవ్ ప్రదర్శనలు, జగన్‌కు హెచ్చరికలు, ప్రభుత్వం పై విమర్శలు టీడీపీ కార్యకర్తలతో గంటలకొద్దీ టెలికాన్ఫ‌రెన్సులు, నాయకులతో వీడియో కాన్ఫ‌రెన్సులు, మధ్య మధ్యలో ట్వీట్లు, టీవీల్లో జగన్‌కు వ్యతిరేకంగా డిబేట్లు, క్రమం తప్పకుండా జగన్ పై సబ్బం హరిని ఏబీఎన్, టీవీ 5 ద్వారా ఉసి గొల్పడం, పనిలో పనిగా కుమారుడు లోకేష్ ను రాష్ట్రంలో తిప్పడం….ఇలా శత సహస్ర టక్కు, టమార , గజ కర్ణ, గోకర్ణ విద్యలను ఆయన ప్రదర్శిస్తూ వచ్చారు.

నిజానికి 70 ఏళ్ల వయస్సులో అంత ఎనర్జిటిక్ గా ఉండడం చిన్న విషయం కాదు. చంద్ర‌బాబు ప్రత్యర్ధులు సైతం ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. తాను ఫైటింగ్ మోడ్‌లో ఉన్నాననే సందేశాన్ని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి పంపాలనేది ఆయన అభిమతం.

అయినప్పటికీ, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో 2019 ఎన్నికల నాటి సీనే పునరావృతమవడం తథ్యం అని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టీడీపీకి వెన్నెముకగా నిలుస్తున్న కమ్మ కులంలోని ముఖ్యులు ఓ అభిప్రాయానికి వచ్చేశారు.ఇందుకు కారణాలు లేకపోలేదు.2014 లో గెలవగానే,
1) బెజవాడే రాజధాని అంటూ ఒక ఆత్మహత్యా సదృశమైన రాజకీయ నిర్ణయాన్ని తీసేసుకుని, జనంపై రుద్దే ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘బెజవాడ’ అనగానే, రాష్ట్రవ్యాప్తంగా కమ్మ వ్యతిరేక వాసనలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
13 జిల్లాలతో కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రంలో కమ్మ కులాన్ని -సామాజికంగా, ఆర్థికం గా,రాజకీయంగా మరింత సంఘటితం చేయడం కోసమే చంద్రబాబు బెజవాడను రాజధాని చేయబోతున్నారనే భావం దావానలంలా రాష్ట్రాన్ని చుట్టుముట్టేసింది. గతంలో ఓ సారి తెలుగుదేశం ఓడిపోవడానికి కూడా బెజవాడే కారణమైంది.
తనకు రక్షణ కల్పించాలంటూ బందర్ రోడ్ మీద నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 26న హత్య చేయించడంతో, రాష్ట్ర వ్యాప్తంగా కాపులలో పెల్లుబికిన ఆగ్రహావేశాలు- తెలుగుదేశంను గద్దె దింపాయి. మళ్లీ ఇప్పుడు, బెజవాడ కేంద్రంగా రాష్ట్రంలో పెత్తనానికి కమ్మ కులం రెడి అవుతున్నదనే అనుమానాల మధ్య – తెలుగుదేశం ఓటమికి 2014 లోనే తొలి బీజం పడింది.
2) నారా లోకేష్ అనే పేద్ద గుదిబండను మెడకు కట్టుకుని , చంద్రబాబు – రెండో భీకరమైన తప్పిదానికి పాల్పడ్డారు. ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించగల లక్షణాలు, మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్, వ్యవహార శైలి మొదలైన వాటిల్లో – జనం మెచ్చి, మేకతోలు కప్ప గలిగిన లక్షణం ఒక్కటీ లోకేష్‌కు లేదని ఆ పార్టీ ముఖ్యులు ప్రైవేట్ సంభాషణల్లో గుసగుసలాడడం అనేది ఓ బహిరంగ రహస్యం. తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలో – లోకేష్ వల్ల చంద్రబాబుకు వచ్చిన అపకీర్తి అంతా…ఇంతా కాదు.
3) కాపులు.తమకు రిజర్వేషన్ అమలు చేయమని కాపులు ఏమీ అడగలేదు. అయితే, అది తమకు ఉంటే తమ పిల్లలకు మెరుగైన విద్యాబుద్ధులు చెప్పించుకోడానికి బాగుంటుందనే కోరిక వారిలో ఉంద‌నే  విషయం పసిగట్టిన చంద్రబాబు-2014 ఎన్నికల ముందునాటి పాదయాత్రలో-కాపులకు రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తనదీ అంటూ రోజు కు  నాలుగు సార్లు హామీ ఇస్తూ వచ్చారు. ఏటా 500 కోట్ల ఆర్ధిక సహాయంతో కాపు కార్పొరేషన్ పెట్టి, ఐదేళ్లకూ 2500 కోట్లు ఇస్తాను అంటూ ఊరూ…వాడా టముకు వేసుకుంటూ వెళ్లారు.
నిజానికి ఈ రెండూ…కాపులు ఊహించనివి. కానీ, చంద్రబాబు వీటి గురించి పదే పదే మాట్లాడుతూ ఉండడంతో, నిజమేనని నమ్మారు కాపులు. అధికారంలోకి వచ్చాక,తన హామీలను మర్చి పోయినట్టు నటించడానికి, గుర్తు చేసిన వారిని అవమానించడానికి, హామీలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు జనాలను నమ్మించడానికి చంద్రబాబు ప్రదర్శించిన క్షుద్ర విద్యల గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే….అంత మంచిది. లేకపోతే అదే ఓ పెద్ద గ్రంధం అవుతుంది.
4) రాజాంతః పురాలలో రాణులకు అందుబాటులో ఉండడానికి పురుషులను నియోగించరు. నపుంసకులను, అనామకులను, రాణులకు ఏ రకమైన ‘ఇబ్బందీ’ కలిగించలేని వారిని నియోగిస్తుంటారు. విరాట రాజు కూతురు ఉత్తరకు నృత్యం, ఆటా…పాటా నేర్పించడానికి బృహన్నలను ఏర్పాటు చేశారు గానీ, నాట్యాచార్యుడిని కాదు.
అలా, రాజకీయంగా తలా తోకా లేని వారిని మంత్రులుగా చేసి– వారెవరూ పని చేయడం లేదంటూ – ప్రజల దృష్టిలో వారిని ఉత్తి చవటాయిలను చేస్తూ, తానొక్కడినే రేయింబవళ్ళూ పని చేస్తున్నాననే బిల్డప్ ఇవ్వడం- జనానికి, చంద్రబాబు పై గౌరవం తగ్గేట్టు చేసింది. దీనికి తోడు ,నారా లోకేష్ తెలుగు భాషా పాండిత్యం ఒకటి. అది వారిద్దరినీ నవ్వులపాలు చేసింది. దీనికి తోడు లోకేష్ కు సలహాదారులుగా ఓ అరడజను మంది బృహన్నలలు.
5) రాష్ట్రాన్ని విడదీసిన వారు- కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. మీ ఏడుపేదో మీరు ఏడవండి అన్నారు. నిజమే. ప్రజలకు కావలసింది రాజధాని కాదు. కూడు, గుడ్డ, గూడు. నూటికి 99 మందికి కావలసినవి ఇవే. ఇవి సగౌరవంగా సమకూర్చుకునే సామాజిక పరిస్థితులు. వీరికి రాజధాని ఎక్కడ, ఎలా , ఎందుకు ఉండాలి అన్నది పట్టదు.

పిల్లి నల్లగా ఉంటే ఏమిటి…? తెల్లగా ఉంటే ఏమిటి? ఎలుకను పట్టుకుంటుందా …లేదా అన్నదే ముఖ్యం అని ఓ చైనా పెద్దమనిషి చెప్పినట్టు- ‘రాజధాని ఎలా ఉంటే ఏమిటి? మా ఊరి ఎస్ఐ, ఎం.ఆర్.ఓ మమ్మల్ని పీడించకుండా పనులు చేస్తున్నారా ? లేదా అనేదే ప్రజలకు ముఖ్యం.ఆ 99 శాతం ప్రజలను,వారి ఈతిబాధలను వదిలేసి, మిగిలిన ఒక్క శాతం మందికే అవసరమైన ‘రాజధాని’ ని పట్టుకుని  ఐదేళ్లూ చంద్రబాబు వేలాడారు.

రాజకీయ నాయకులు,వారి  తాబేదారులు,వారి కుడి ఎడమలు,కాంట్రాక్టర్లు,పవర్ బ్రోకర్లు, పైరవీకారులు, వైట్ & వైట్ గాళ్ళు,రేబాన్ కళ్ళజోడు బ్యాచ్ లే,నైక్ బూట్స్ బాపతు, అధికారులు,వారి గాడ్ ఫాదర్లు, వీళ్ళందరి మీదా పడి బతికే జనానికి రాజధాని అనేది కావాలి.మామూలుగా తమ బతుకు తాము గౌరవంగా, ఇబ్బందులు లేకుండా బతుకుదామనుకునే మధ్య తరగతి,దిగువ మధ్య తరగతి, పేద వర్గాల వారికి- రాజధాని ఎక్కడ ఉంటే ఏమిటి…? అసలు ఉండకపోతే ఏమిటి?
ఇది సింపుల్ లాజిక్కు. ప్లెయిన్  కామన్ సెన్స్ పాయింట్చంద్రబాబు- కీర్తి కండూతికి లోనై పోయి,ఈ సింపుల్ లాజిక్ ను వదిలేసి,నేల విడిచి సాము చేశారు.

6) పోలవరం ప్రాజెక్ట్ ను కూడా తన రాజకీయం కోసం, తన ప్రచారం కోసం వాడుకున్నారు. రైతుల కోసమైతే, దాని నిర్మాణాన్ని రాయపాటి సాంబశివరావుకు అప్పచెప్పి ఉండేవారు కాదు.రాష్ట్రం నలుమూలల నుంచీ బస్సులు పెట్టి,టీడీపీ వాళ్ళను పోగేసి పోలవరం తోలుకెళ్లి,ఉచిత భోజనాలు,ఉచిత బస్సు పేరుతో వందలకోట్లు గోదారి లో గుమ్మరించేసి ఉండేవారు కాదు.ఇలా,జనాన్ని వెర్రి పప్పల కింద జమవేసి 99 తప్పులు చేస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు,100 వ తప్పుతో నరేంద్ర మోడీకి దొరికిపోయారు. ఆ నాటి శిశుపాలుడు గనుక శ్రీకృష్ణుడిని తూలనాడినట్టుగా – చంద్రబాబు నాయుడు సాక్షాత్తూ దేశ ప్రధాని పదవిలో ఉన్న నరేంద్రమోడీని తూలనాడడం తో- 100 తప్పులు పూర్తయ్యాయి
ఫలితంగా- 2019 ఎన్నికల్లో టీడీపీ కి 23 సీట్లు వచ్చాయి. చంద్రబాబు వాగాడంబర రాజకీయానికీ ‘శుభం’ కార్డు పడింది. బాబు ఏపని చేసినా…దానిలో చిత్తశుద్ధి ఉండదు అనడానికి,కాపుల అంశాన్ని డీల్ చేసిన తీరే నిదర్శనం. కాపు జపం ఎక్కువ కావడంతో బీసీలు టీడీపీకి దూరం జరిగారు. కాపు జపంలో చిత్తశుద్ధి లేక,కాపులు దూరం అయ్యారు.

కాపుల కోసమని చంద్రబాబు బీసీలను దూరం చేసుకుని ఉండాల్సింది కాదని టీడీపీ నేతలు ఇప్పుడు తీరిగ్గా నాలిక్కరుచుకుంటున్నారు. కాపులకు పొలిటికల్ లాయల్టీ అంటూ ఉండదని అలాంటి వారి కోసం టీడీపీకి దశాబ్దాలు తరబడి అండగా ఉంటున్న బీసీలను బాబు దూరం చేసుకున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారంలో లేని సమయంలోనే 151 సీట్లు తెచ్చుకున్న జగన్ ఇక అధికారంలో ఉండగా – చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఈ 23 కూడా దక్కడం కష్టమనే నిర్వేదానికి కూడా టీడీపీ అభిమానులు కొందరు లోనవుతున్నారు.

ఎందుకంటే-ఈ సారి జరగబోయే ఎన్నికల నాటికి కూడా మోడీ,అమిత్ షా ద్వయమే ఢిల్లీ లో అధికార చక్రం తిప్పుతూ ఉంటారు కదా! అందుకని,మొన్న వచ్చిన 23 కే బాబును లిమిట్ చేయడానికి ఏమి చేయాలో…. వారు అది చేస్తారు. ప్రతి దానికీ ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. వైఎస్ ఉండగా రూపు దిద్దుకున్న క్యాంప్ కార్యాలయం ఇప్పుడు ఉందా? కాల గర్భం లో కలిసి పోయింది. హైదరాబాద్‌లో ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ఇప్పుడు ఉందా? కాల గర్భంలో కలిసిపోయింది.

అంతదాకా ఎందుకు? ఆంధ్రాబ్యాంక్ ఉంది. ఆంధ్రులకు అతిప్రియమైన బ్యాంకు.భోగరాజు పట్టాభిరామయ్య గారు మచిలీపట్నంలో 1923 నవంబర్ 28 న ప్రారంభించారు. కాలక్రమంలో శాఖోపశాఖలుగా దేశ విదేశాల్లో విస్తరించి, దేశ ఆర్థిక చిత్రపటంలో కీలక స్థానం ఆక్రమించింది.కోట్లాదిమంది ఖాతాదారుల జీవితాల్లో అంతర్భాగమైంది.మరి ఇప్పుడు ఏది? కాల గర్భంలో కలిసిపోయింది. అంటే దాని ఎక్స్పైరీ డేట్ రాగానే, అది కనుమరుగై పోయింది.

అలాగే, చంద్రబాబు రాజకీయానికీ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అనేది ‘దేశం’ అభిమానుల ఉవాచ. రాజకీయాల్లోనే కొనసాగదలుచుకుంటే -కాలు, చెయ్యి ఆడుతున్నంత వరకూ కొనసాగవచ్చు….సీపీఐ నారాయణ, రామకృష్ణ లాగా కొనసాగవచ్చు.అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కాకపోతే,ఆయన నాయకత్వంలో టీడీపీ అధికారంలోకి వచ్చే సమస్యే లేదనే విషయమై ఇప్పుడు దేశీయులలో ఓ స్పష్టత వచ్చింది

చంద్రబాబు రాజకీయం ముగింపున‌కు వచ్చినట్టేనని ‘దేశం’ పరిణామాలపై చర్చించే వారు భావించడానికి ఒక ప్రధాన కారణం- ఆయన వయస్సు.ఈ సారి ఎన్నికల నాటికి ఆయన వయస్సు 75కు అటు,ఇటుగా చేరుతుంది. ఆయనది సాయంత్రపు పొద్దు అయితే జగన్‌ది ఉదయపు పొద్దు. పొద్దెక్కిన కొద్దీ ఎండ చుర్రు మంటుంది.

సీనియర్ బాబు లేకుండా- జూనియర్ బాబును దేశం వర్గాలు లెక్కచేయడం అన్న ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు.
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో, దేశం అధినాయకత్వం రూపాయి బిళ్ళ కూడా బయటకు తీయలేదు.జగన్‌ను తట్టుకుని,తెలుగుదేశానికి అసలు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలని చంద్రబాబు భావించారని టీడీపీ అంతర్గత విషయాలు తెలిసినవారు అంటున్నారు.అందుకే, చంద్రబాబు డబ్బు తియ్యలేదు. వచ్చే ఎన్నికలకు కూడా భారీగా కావాలన్న దూరాలోచనతో కూడా డబ్బు తియ్యలేదు. అయినా, ఓటింగ్  30 శాతంగా తేలింది. ఇక, ఇంతకంటే తమకు తగ్గదనే అంచనాకు తెలుగుదేశం వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి.

ఇక్కడి నుంచి 45,50 శాతానికి వెళ్లడం అయ్యేపని కాదన్నది విశ్లేషకుల అంచనా.వైసీపీపై విమర్శలు,పంచ్ డైలాగులు, ట్వీట్లు,జోకులు,వెటకారాలు, దెప్పి పొడుపులు,ఖబడ్దార్ అంటూ ఉత్తుత్తి హెచ్చరికలు, ఇంతకు ఇంతా వడ్డీతో వడ్డిస్తాం అంటూ ఉబుసుపోక కబుర్లతో ఓటింగ్ శాతం పెరగదు కదా! వీటితో, వైసీపీని ఏమీ చేయలేరనే విషయం స్పష్టమై పోయిందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అక్కడికీ- ప్రశాంత్ కిషోర్ టీమ్ లో నుంచి ఒకరిని తెచ్చి,నెల నెలా కోట్లు కుమ్మరిస్తున్నా-పని జరగడం లేదు. ‘ఇంతకు మించి బాబు మాత్రం ఏం చేయగలడు?’అంటూ ‘దేశం’ వర్గాలే నిట్టూర్పులు విడవడాన్ని బట్టి- బాబు అమ్ముల పొదిలో అస్త్రాలన్నీ అయిపోయినట్టు కనిపిస్తున్నది. డబ్బు ఖర్చు పెట్టారని, దౌర్జన్యాలు చేశారని, కిడ్నాపులు చేశారని, పోలీసుల్ని వాడారని,అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైసీపీపై టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలు ఎలక్షన్స్ లో వాటన్నింటినీ ఇంట్రడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడే అనేవాళ్లకు కొదువలేదు. కాకపోతే వైసీపీ వాళ్ళు కొంచెం ఆర్గనైజుడు గా చేసి ఉండొచ్చు. ఇప్పుడు చేసినవారు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో చెయ్యరా ఏంటి అంటూ విజయవాడలోని టీడీపీ వీరాభిమాని నిర్వేదానికి గురయ్యాడు. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎంతోమందిని శంకరగిరి మాన్యాలు పట్టించిన చంద్రబాబు ఇప్పుడు-జగన్ చేతికి దొరికిపోయారు నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా అన్న సామెతను గుర్తుకు తెస్తున్నారు.జగన్ చేతిలో ఇప్పటికే కుదేలైపోయిన చంద్రబాబు 2024 ఎన్నికల్లో ఈ మాత్రం ఫైట్ కూడా ఇవ్వలేరు.

ఆయన,ఆయన కొడుకు అసలు ఆంధ్ర పౌరులే కాదనే వాదనకు వారు గట్టిగా సమాధానం చెప్పలేక పోతున్నారు కూడా. బాబు గానీ, లోకేష్ గానీ- హైదరాబాద్ నివాసాన్ని వదిలి విజయవాడలోనో…రేపు విశాఖపట్నంలోనో ఉండలేరనేది బహిరంగ వాస్తవంగా మారిపోయింది. ఇప్పటికీ-సోమవారం నుంచి శుక్రవారం వరకే అమరావతిలో ఉంటున్నారు.శని,ఆదివారాలు హైదరాబాదే.అందువల్ల, వారిద్దరూ ప్రవాసాంధ్రులే అన్న వైసీపీ విమర్శలకు సమాధానాలు చెప్పలేక పోతున్నారు.

ఎన్నికలకు ఇంకా రెండున్నర, మూడేళ్లు ఉన్న ఈ తరుణంలో చంద్రబాబును వీలైనంతగా డీ- మోరలైజ్  చేసే ఘటనలు చాలా జరుగుతాయి.ఇవన్నీ ప్రభుత్వమే చేస్తుందని కాదు. మొన్నటికి మొన్న- బోండా ఉమ,బుద్ధా వెంకన్న- విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీడీపీని రప్ఫాడిస్తూ మీడియాకు ఎక్కారు. వాళ్ళిద్దరికీ  షోకాజ్ నోటీస్ ఇవ్వమని,కనీసం ఓ పదిహేను రోజులపాటు సస్పెండ్ చేయమని కొందరు సీనియర్ నాయకులు చంద్రబాబుకు నూరిపోశారు. షోకాజ్ నోటీస్ సంగతి దేముడెరుగు….కనీసం నోటితో కూడా చంద్రబాబు అడగలేకపోయారంటూ దేశం వర్గీయులు బుర్రలు కొట్టుకుంటున్నారు.దీనిని బట్టే…ఆయన- మానసికంగా ఎంతగా వీక్ అయిపోయారో కదా అని పార్టీలో బుగ్గలు నొక్కుకుంటున్నారు.

నిజానికి ఆయన ‘వీక్’ అయిపోవడం కాదు. ఆయన వ్యవహార శైలి అది. మాన్యుపులేషన్ తప్ప, నాయకత్వ లక్షణాలు లేనితనానికి నిదర్శనం. “ఏమో…! రేపు వాళ్ళతో పనిబడవచ్చు.ఎందుకు దూరం చేసుకోవడం ?”అనేది బాబు వ్యవహార శైలి. ఇక  పెద్దాయన పరిస్థితి ఇలా ఉంటే…చిన్నాయన పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండదు కదా! ఆయన తండ్రి చాటు బిడ్డే గానీ, స్వంతంగా ఎదిగిన, ఎదగ గలిగిన యువ నాయకుడు కాదు కదా! అందుకనే- వారి రాజకీయం ముగింపుకు వచ్చేసింది అని భావించడం రొటీన్  అయిపోయింది.

తెలుగుదేశంలో మరో పక్క పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు నాయుడు గంపెడు ఆశలు పెట్టుకుంటే- అదీ వర్క్ ఔట్ కావడం లేదు. ఈ విషయం వాసన పట్టిన కేంద్రం (మోడీ,అమిత్ షా) పవన్ కళ్యాణ్‌ని,బీజేపీ గదిలోకి ఆహ్వానించి,గదికి బయటి నుంచి గోద్రెజ్ తాళం వేసి, ఆ తాళం ఎక్కడో పారేశారు. ఆ గదికి ఓ చిన్న కిటికీ మాత్రం ఉంచారు.పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ ఆ కిటికీలో నుంచి చూడడం తప్ప చేయగలిగింది లేకుండా పోయింది.

గత ఎన్నికల ముందు ప్రధాని మోడీని నోటికొచ్చినట్టుగా తూలనాడిన ఫలితాలు- ఇప్పుడు వివిధ రూపాలలో చంద్రబాబు రాజకీయానికి చరమ గీతం పాడుతున్నాయి. ఇప్పుడు, మరో విశేషం టీడీపీలో మెల్లగా చోటు చేసుకుంటోంది. ఇన్నాళ్లూ…చంద్రబాబే దేశం…దేశమే చంద్రబాబుగా చూస్తూ వచ్చిన కమ్మ వర్గంతోపాటు,టీడీపీ అభిమాన శ్రేణులు ఇప్పుడు- స్థానిక ఎన్నికల ఫలితాల తరువాత- చంద్రబాబు వేరు- తెలుగుదేశం వేరు అనే థియరీకి జీవం పోస్తున్నారు.

2024 ఎన్నికలతో చంద్రబాబు నాయకత్వం పరిసమాప్తమవుతుంది కనుక- తెలుగుదేశంను బతికించుకోడానికి- పార్టీ వ్యవస్థాపకుని అసలు వారసుడు- జూనియర్ ఎన్టీఆర్‌ను తెరమీదకు తేవాలనే ఆలోచన రోజురోజుకీ దేశం శ్రేణులలో విస్తరిస్తోంది. ఈ పరిణామాలను 2014లోనే ఊహించిన జూనియర్ ఎన్టీఆర్- అస్సలు తొందర పడడం లేదు. చంద్రబాబుతో ఎదురైన పాత అనుభవాలు ఆయనను తొందర పడనివ్వడం లేదు.

అందుకే,టీడీపీ గోడకు పట్టిన ఆ పాత సున్నం మొత్తం ఊడిపోతే గానీ- కొత్త సున్నం పట్టదు కాబట్టి తాను రంగంలోకి దిగడానికి- పరిస్థితులు ఇంకా పక్వానికి రావలసి ఉందని,ఇంకా పలకమారాలన్న పరిస్థితులు మారాలన్న సమయం ఎదురు చూడక తప్పదు అన్న  భావనలో జూనియర్ ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తుంది. అంటే తెలుగుదేశం నాయకత్వ స్థానాల నుంచి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ వైదొలిగే పరిస్థితుల కోసం ఆయన ఎదురు చూస్తున్నారు.

టీడీపీ అనేది తన తాత గారి ఆస్తి అనే విషయంలో జూనియర్‌కు,ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్‌కు పూర్తి స్పష్టత ఉంది 2029 ఎన్నికల నాటికి అటువంటి పరిస్థితులు ఏర్పడగలవని జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకునే టీడీపీయులు భావిస్తున్నారు. ఎందుకంటే- 2024 ఎన్నికలతో చంద్రబాబు, లోకేష్‌ల‌ రాజకీయ ప్రయాణం ముగుస్తుందన్నది వారి అభిప్రాయంగా ఉన్నది. చూద్దాం…… ఈ రెప్పకు,ఈ కన్ను దూరం కాదు కదా…! ఏమి  జరుగుతుందో చూద్దాం.

విజయ భాస్కర రెడ్డి.పుప్పాల
జర్నలిస్ట్.