‘వకీల్ సాబ్‌‘… ఏబీవీ.. ఐపిఎస్!

0
842

125 సాక్ష్యాధార పత్రాలు.. 2000 పేజీలు..  1100 ప్రశ్నలు
దొంగ డాక్యుమెంట్లపై సంచలన ఆరోపణలు
ఏబీ వెంకటేశ్వరరావుపై పూర్తయిన విచారణ
ఆధారాలు చూపించలేని సర్కార్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇదేదో సినిమా టైటిల్ కాదు. నిజంగా.. నిఝం! ఆయన లాయర్ కాదు. ఎల్‌ఎల్‌బీ కూడా చదవలేదు. చదివింది నాగపూర్‌లో ఎన్ఐటి. అందులో టాపర్. అది చదువుతుండగనే సివిల్స్‌లో ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. అది వద్దనుకుని ఐపిఎస్‌ను మార్చుకున్న సాధారణ వ్యవసాయ-ఉపాధ్యాయ  కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి. మరి వకీల్‌సాబ్ ఎలా అయ్యారంటే.. ఆయనకు ఎదురయిన చేదు అనుభవాలు, ఎదురయిన గుణపాఠాలే ఆ ఐపిఎస్‌ను వకీల్‌సాబ్‌ను చేశాయి. ఆయనే ఏపీ మాజీ నిఘా దళపతి, డీజీపీ స్థాయి అధికారి ఆలూరు బాల వెంకటేశ్వరరావు. అందరికీ తెలిసిన ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు..  సహచరుల మాటల్లో  ఏబీవీ.. మిత్రులు అభిమానంగా పిలుచుకునే ‘రావుగారు’!

ఎస్. ఐపిఎస్ అధికారేమిటీ? లాయర్ అవతారమెత్తడమేమిటనుకుంటున్నారా? దానికి పెద్ద కథే ఉంది. వింటే విస్మయకరంగానే ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై,  జగన్ సారథ్యంలోని ఏపీ సర్కారు ఏబీవీ పై అభియోగాలు నమోదు చేసి, సస్పెండ్ చేసింది. కారణం.. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ కోసం  పనిచేశారన్న ఆరోపణ. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు, కీలకపాత్ర పోషించారన్న ఆగ్రహం. సాంకేతిక అంశాలు ఏమయినప్పటికీ, ఆయన సస్పెన్షన్‌కు అసలు కారణం మాత్రమే అదేనన్నది, మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. మరి అదే పాత్ర పోషించిన నాటి సీఎంఓ ముఖ్య అధికారి సతీష్‌చంద్రకు ఎలా పోస్టింగ్ ఇచ్చారని ప్రశ్నించవచ్చు. నిజమే. ఎందుకంటే సతీష్‌చంద్రది నార్త్ ఇండియన్ లాబీ. ఏబీవీ సౌత్ ఇండియన్ బ్యాక్‌గ్రౌండ్ అధికారి. ఐఏఎస్‌లలో ఉండే ఐకమత్యం, సహజంగా ఐపిఎస్‌లలో ఉండదు. సో.. సతీష్‌చంద్రకు పోస్టింగ్ రావడానికి, ఏబీవీకి పోస్టింగుతోపాటు జీతం కూడా రాకపోగా, సస్పెండవడానికీ అదొక కారణమన్నది జగద్విదితం, జగన్విదతం!

ఇక ఏబీవీ న్యాయం కోసం సుప్రీంకోర్టు గుమ్మమెక్కిన తర్వాత గానీ, ఆయనపై అసలు విచారణ ప్రారంభం కాలేదు. నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ జరిపించాలని సుప్రీం ఆదేశించడం, అంతకు ఒక్కరోజు ముందే సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను ప్రభుత్వం,  విచారణాధికారిగా నియమించడం అనివార్యమయింది. దానితో విజయవాడ కేంద్రంగా ఆయనను 14 రోజుల పాటు నిర్విరామంగా విచారించారు. అయితే, ఈ విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి తన కేసు తానే వాదించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి తనకు కావలసిన డాక్యుమెంట్లు, సమాచారం తెప్పించుకోవచ్చు. వాటిని తెప్పించి ఇవ్వడం కమిషన్ విధి. వాటి ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు. అవసరమైతే సదరు అధికారి లాయర్‌నూ ఏర్పాటుచేసుకోవచ్చు.

కానీ ఏబీవీ మాత్రం తన కేసు తానే వాదించుకున్నారు. అదొక్కటే కాదు. 21 మంది సాక్షులను సినిమాలో వకీల్‌సాబ్ మాదిరిగా క్రాస్‌ఎగ్జామిన్ చేశారు. ఏ ప్రశ్న వేస్తే ఎలాంటి సమాధానం వస్తుందో ఊహించి కొన్ని.. ఏ ప్రశ్నలడిగితే మూలంలోకి వెళతాయని ఊహించి మరికొన్ని.. ఎలాంటి ప్రశ్నలేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయో ఇంకొన్ని… ఇలా.. 125 సాక్ష్యాధార పత్రాలు.. 2000 పేజీలు..  1100 ప్రశ్నలు సంధించి, వారి నుంచి సమాధానాలు రాబట్టడమే విశేషం. ఇవన్నీ రోజూ ప్రాక్టీసు ఉండే లాయర్లు సంధించే ‘లా’జికల్ క్వశ్చన్స్. కానీ ఇవన్నీ లా పట్టా లేకుండానే.. ఏబీవీ తనకు ఎదురయిన అనుభవాలు, తెలిసిన విజ్ఞానాన్ని రంగరించి సంధించిన ప్రశ్నలు. అదే ఇక్కడ విశేషం!

ఇంతకూ ఈ 14రోజులపాటు తనపై జరిపిన విచారణలో ఏబీవీ ఏం వాదించారు? సర్కారు ఆరోపణలను తప్పని ఎలా తేల్చారన్నదే ఆసక్తికరమైన అంశం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తనపై చట్టంలో లేని సెక్షన్లు నమోదు చేయడమే కాదు. కొడుకు కంపెనీ-తన ఇంటి అడ్రసు ఒకటేనన్న అభియోగం తప్పుడుదని తేల్చారు. లేని జీఓలు అమలు చేయలేదన్న అభియోగం కూడా తప్పేనని నిరూపించారు.  ఈ కేసులో ఒక్క రూపాయి కూడా చేతులు మారలేదని నిరూపించారు. కేంద్ర సంస్థల నిర్వహణ వ్యయం కోసం మినహాయించుకున్న పదిలక్షల రూపాయలను కూడా, గత సెప్టెంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించిన విషయాన్ని కమిషన్ ముందు పెట్టారు.

అయినప్పటికీ తన వల్లనే పదిలక్షల రూపాయల నష్టం వాటిల్లందంటూ, గత డిసెంబర్‌లో చార్జిషీట్ చేశారంటే.. డబ్బు తిరిగి వెనక్కి వచ్చిన 3 నెలల తర్వాత చార్జిషీట్ వేయడం కుట్రపూరితమేనని విచారణాధికారి ఎదుట నిరూపించారు. ఒకపేజీలో ఒక సెక్షన్, ఇంకో పేజీలో ఇంకో సెక్షన్ చూపించడం ద్వారా.. చార్జిషీట్ తయారుచేసిన సలహాదారు తెలివితేటలను ఏబీవీ విచారణాధికారి ఎదుట వ్యంగ్యాస్త్రాలతో బయటపెట్టారు. కాగా సీఎంసీపీఆర్‌ఓ పూడి శ్రీహరి తనపై చేసిన ప్రచారానికి సంబంధించిన,  పూర్తి ఆధారాలను ఏబీవీ కమిషన్ ముందుంచారు. ఆయన తన ఎదుట ప్రవేశపెట్టాలని కోరగా, విచారణాధికారి ఆయన హాజరు వల్ల విచారణకు పెద్దగా ఉపయోగం ఉండదని పేర్కొన్నారు.

ఇలా.. డాక్యుమెంట్లు, వివిధ మార్గాల్లో సేకరించిన ఆధారాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాలను  ముందుంచుకుని, ఏబీవీ చేసిన వాదన కోర్టులో వకీల్‌సాబ్‌నే తలపించింది.  ఆ విధంగా తాను గానీ, తన కుమారుడు గానీ చట్టాన్ని అతిక్రమించలేదనే సాక్ష్యాలను, విచారణ కమిషన్ ముందుంచారు. సాక్ష్యులను విచారించే చివరిరోజున సర్కారు డొల్లతనాన్ని బట్టబయలు చేసే పలు డాక్యుమెంట్లను కమిషన్‌కు సమర్పించారు.

ఒకవైపు విచారణ జరుగుతుండగానే, మరోవైపు నకిలీ ఫైళ్లు తయారుచేశారంటూ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి.. మరో సంచలానికి తెరలేపారు. డీజీపీ పంపించారని చెబుతున్న పత్రాలు, తమ వద్ద కనిపించడం లేదంటూ హోంశాఖ నివేదిక సమర్పించడాన్ని ఏబీవీ ఆయుధంగా మలచుకుని, తనపై జరుగుతున్న కుట్రలకు ఇదే ఆధారమని కమిషన్ ఎదుట వాదించారు. మొత్తంగా.. ఈ 14 రోజుల విచారణలో ప్రభుత్వం ఆయనపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేక.. నిరూపించే ఆధారాలు బయటపెట్టడంలో విఫలయినట్లు తెలుస్తోంది.

  నాపై ఆరోపణలు చేసింది.. అల్పులు..అదములు..కుక్కమూతిపిందెలే:  ఏబీవీ
‘‘ అల్పులు.. అథములు.. కుక్కమూతిపిందెలు, చట్టాలు తెలియని వారే తనపై ఆరోపణలు చేశారని’’   సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విరుచుకుపడ్డారు. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి,  ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్‌లో.. 14 రోజుల నుంచి జరుగుతున్న ఇరుపక్షాల వాదన ఆదివారంతో ముగిసింది. ఆ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావును మీడియా కలిసింది. మీడియాతో మాట్లాడిన ఆయన,  తన విచారణ అనుభవాలను కొన్నింటిని వివరించారు.

దేశంలో ఓ అధికారి మీద 14 రోజుల్లో విచారణ పూర్తి చేసిన కేసు తనదేనని ఏబీవీ చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణం ప్రమాదవశాత్తూ జరిగిందనడం ఎంత నిజమో, తనపై వచ్చిన ఆరోపణలూ అంతే నిజమని  వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, తనను కుట్రపూరితంగా ఇరికేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించారనడానికి తన వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. దానిని విచారణాధికారి దృష్టికి తీసుకువెళతానన్నారు. గత 14 రోజుల నుంచి జరిగిన విచారణలో, తానే 21 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేశానన్నారు. అందులో కొందరు సంతృప్తికరంగా సమాధానాలు చెబితే, మరికొందరు తమకు నచ్చినట్లు చెప్పారన్నారు. నిర్దోషిత్వం నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆయన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.