నమ్మకం.. !

0
201

ఒకప్పుడు ఒక రాజ్యంలో బందిపోటు దొంగల దాడులు అధికంగా ఉండడంతో ఆ దేశపు రాజు మంత్రుల సలహా మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు.  అదేమిటంటే దేశ ప్రజలు తమ ఇళ్ళ నుండీ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, వారి నిత్యావసరాల కొరకు నిర్ణీత సమయంలో మాత్రమే బయటకు వచ్చి అవి తీసుకుని వెళ్లిపోవాలి అని. అదే దేశంలో ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది!

ఇంట్లో ఉన్న సరుకులతో మనవడి ఆకలి రెండు రోజులు పాటు తీర్చిన ఆ బామ్మ ఇక చేసేదేమీ లేక భగవంతుడిని ప్రార్థిస్తూ, మౌనంగా ఉంది.
ఆ గృహ నిర్బందం వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో, ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మొకరిల్లి ఇలా ప్రార్థన చేస్తోంది. ” భగవంతుడా !!! ఈ సృష్టిలోని ప్రతి జీవి ఆకలి తీర్చే నీకు నా మనవడి దుస్థితి కనిపించడం లేదా. వాడు ఆకలికి తట్టుకోలేదు. వాడి ఆకలి తీర్చే స్థోమత నాకు లేదు. ఈ నిస్సహాయ స్థితిలో ఎందుకు స్పందించడం లేదు తండ్రి. ఆకలితో ఉన్న పావురానికి కాకి రూపంలో వచ్చి ఆకలి తీర్చావు అని మా అమ్మ నీ గురించిన చెప్పిన కథ ఇప్పటికీ నాకు గుర్తే. అలానే మమ్మల్ని కూడా ఆదుకో అని కళ్ళ నీళ్లతో బ్రతిమాలుతోంది.

ఆ మాట విన్న తన మనవడు ఆ బామ్మను కాకి కథ చెప్పమని అడిగాడు. బామ్మ ఇలా చెప్పసాగింది. ఒక అడవిలో పావురాల జంట ఒకటి ఉండేది. వాటికి అప్పుడే గుడ్డును చీల్చుకుని బయటకు వచ్చిన ఒక చిన్ని పావురం పిల్ల ఉంది. ఒకరోజు ఆహారం కోసం అడవిలో తిరుగుతున్న తల్లి పావురాన్ని ఒక వేటగాడు తన బాణంతో కొట్టి చంపాడు. అది చూసిన తండ్రి పావురం బాధతో విలవిలలాడిపోయింది. తల్లి పావురం చుట్టూ బాధతో తిరుగుతున్న తండ్రి పావురాన్ని కూడా బాణంతో కొట్టి చంపాడు ఆ వేటగాడు. పాపం గూటిలో లోకం తెలియని పసి పావురం ఆకలితో ఉంది. తన తల్లిదండ్రులు ఆహారం తెస్తారాని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. చీకటి పడుతోంది, వర్షం ఆరంభమైంది, ఉరుములు మెరుపులతో ఆకాశం భయకంపితంగా ఉంది. చెట్లు ఊగిపడుతున్నాయి. భయం భయంగా గూటిలో ఎదురు చూస్తున్నది పసి పావురం. ఇంతలో ఒక కాకి ఆ గూట్లోకి వాలింది. తను వేటాడి సంపాదించిన ఆహారాన్ని ఆ పావురానికి పెట్టింది. ఆ కాకికి పావురం పరిస్థితి అర్ధమయ్యింది. అప్పటి నుండీ ఆ పావురాన్ని తన పిల్లలా చూసుకుంటూ పెంచి పెద్దచేసింది. పావురానికి ఎగరడం, ఆహారం సంపాదించుకోవడం నేర్పించి కాకు తన దారిన వెళ్ళిపోయింది. ఆ కాకి రూపంలో వచ్చింది భగవంతుడే అని చెప్పి కథ ముగించింది బామ్మ.

ఆ కథ విన్న మనవడు వాళ్లకు కూడా భగవంతుడు ఆ కాకి లానే ఆహారాన్ని తెస్తాడాని నమ్మి , కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.  అయితే కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక సైనికుడు వెంటనే కిటికీ తలుపు మీద కొట్టి లోపలికి తొంగిచూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..!

ఆ సైనికుడు ” ఏంటి బాబు? తలుపెందుకు తీశావ్ ..!?” అన్నాడు.

ఆ పిల్లవాడు “మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది” అన్నాడు. అందుకే కిటికీ తలుపు తీసాను అన్నాడు.

అప్పుడా సైనికుడు లోపల పూజ గదిలో సోష వచ్చి పడిపోయి ఉన్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్ల వాడితో “ఆకలి వేస్తుందా ” అని అడిగి

“మీ బామ్మ చెప్పిన కాకిని నేనే ..! నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తియ్యి” అని చెప్పాడు.

ఆ సైనికుడు ఎవరో కాదు స్వయానా ఆ దేశపు రాజే, మారు వేషంలో తిరుగుతున్నాడు. వాళ్ళ దుస్థితి అర్ధం చేసుకుని, తన కోశం నుండి వారికి ఆ నిర్బంధ సమయం ముగిసేవరకు కావలసిన పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.

ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ రాజు ద్వారా ఆకలి తీర్చాడు.

ఒకరిది ప్రార్థన ..!
ఇంకొకరిది విశ్వాసం ..!
మరొకరిది ప్రేమ పూరిత సహాయం ..!

దిక్కు లేని వారికి దేవుడే దిక్కు  ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన ..!

నమ్మకం ఆ చిన్న పిల్ల వాడు తన మామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం ..!

నమ్మకానికి మరో రూపమే ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక రాజు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చేయడం ..!

నిష్కల్మషమైన మన ప్రార్థనకు దేవుడు తప్పక  సమాధానమిస్తాడు అని చెప్పడానికి రుజువు ఈ చిన్న యదార్థ సంఘటన…!

పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకంలో ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి అవి చూడాలంటే కాస్తంత ఓపిక, మనోధైర్యం కష్టపడే తత్వం ఉంటే చాలు …

( సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్)