తిరుపతిలో బీజేపీ ఓట్లకు జనసేన ‘గ్లాసు’ గండం!

0
210

– నవతరం పార్టీ అభ్యర్ధికి గ్లాసు గుర్తు కేటాయింపు
– తెలంగాణలో ‘కారు’ను దెబ్బతీస్తున్న పాతీమిషన్, రోడ్‌రోలర్ గుర్తు
– సాగర్ ఎన్నికల్లో కృష్ణమాదిగ పార్టీకి ట్రాక్టర్
( మార్తి సుబ్రహ్మణ్యం )

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో కష్టాలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. జనసేన గుర్తయిన ‘గ్లాసు’ గుర్తును ఎన్నికల సంఘం,  నవతరం పార్టీకి కేటాయించడమే దానికి కారణం. బీజేపీ అభ్యర్థికి జనసేన మద్దతుతిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు మద్దతుగా ప్రచార ం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో ‘నవతరం’ అభ్యర్ధి డాక్టర్ రమేష్‌కు..  జనసేన గుర్తయిన గ్లాసును కేటాయించడంతో, జనసేన కార్యకర్తలు పొరపాటున ఆ గుర్తుకు ఓట్లు వేస్తే,  కొంపమునుగుతుందన్న ఆందోళన బీజేపీలో మొదలయింది. సహజంగా జనసేన కార్యకర్తలలో యువకులే ఎక్కువ. నిజానికి తిరుపతి సీటును తమకే ఇవ్వాలని జనసేన కార్యకర్తలు పట్టుపట్టారు. అటు జనసేనకు అభిమానించే సామాజికవర్గమయిన బలిజలు కూడా, తిరుపతి సీటు జనసేనకు ఇవ్వకపోతే నోటాకు ఓట్లు వేస్తామని, ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మరీ హెచ్చరించారు.

ఈ క్రమంలో బీజేపీ నాయకత్వం, పవన్‌ను బుజ్జగించడం.. ఆయన కూడా తాజా రాజకీయ పరిస్థితులు గమనించి, వ్యూహాత్మకంగా తప్పుకోవడం జరిగిపోయింది. అయితే తిరుపతి సీటు తమకు ఇవ్వలేదన్న అసంతృప్తి, ఇంకా జనసేన కార్యకర్తల్లో లేకపోలేదు. ఈ పరిస్థితిలో బ్యాలెట్‌పై జనసేన గుర్తు కనిపిస్తే, భావోద్వేగంతో తమ పార్టీకి చెందిన ‘ గ్లాసు’ గుర్తుపై ఓటేస్తే తమ ఓట్లు చీలిపోతాయన్న ఆందోళన బీజేపీలో మొదలయింది.

కాగా,  తెలంగాణలో జరిగిన  అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా, ఇదేవిధంగా టీఆర్‌ఎస్‌ను ఇలాంటి గుర్తుల గందరగోళ మే కొంపముంచింది. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తయిన ‘కారు’ను పోలి ఉండే,  ‘రోడ్‌రోలర్’ గుర్తును ఎన్నికల సంఘం  అనేక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు  కేటాయించింది. దానితో గందరగోళానికి గురయిన ఓటర్లు, కారుకు బదులు రోడ్‌రోలర్‌కు ఓట్లు వేశారు. ఫలితంగా ఓట్లు చీలి, స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు కొన్నిచోట్ల  ఓడిపోవలసి వచ్చింది. పాలేరు, జనగాం వంటి 15 నియోజకవర్గాల్లో ఈ గుర్తు టీఆర్‌ఎస్ కొంప ముంచింది.

తాజాగా దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో కూడా బ్యాలెట్‌పై, కారు గుర్తును పోలి ఉండే చపాతీ మిషన్ గుర్తు కూడా టీఆర్‌ఎస్ విజయాన్ని దెబ్బతీసింది. చపాతీ మిషన్ ఒత్తే రెండు కర్రలు.. కారు టైర్లతో పోలి ఉండటమే దానికి కారణం. ఇక నాగార్జునసాగర్‌లో జరగ నున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో.. మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని మహాజన సోషలిస్టు పార్టీకి ఎన్నికల సంఘం ట్రాక్టరు గుర్తును కేటాయించడం, టీఆర్‌ఎస్‌కు తలనొప్పిలా మారింది. ఈ విధంగా ఎన్నికల గుర్తులు ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.