1100 ప్రశ్నలు.. 21 మంది అధికారులు!

512

విచారణలో తానే వాదిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు
సీపీసీఆర్‌ఓ విచారణకు రానవసరం లేదన్న సిసోడియా
ఇంకా అందుబాటులోకి రాని డిజిపి, జీఏడీ ఆఫీసు ఫైళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పలు అభియోగాలపై సస్పెండయిన డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనపై ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్    ఎదుట హాజరవుతూ, తన కేసు తానే వాదించుకుంటున్నారు. సాక్షులను ఆయనే విచారిస్తున్నారు. 12 రోజుల పాటు ఏకబిగిన ప్రతిరోజూ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్  సిసోడియా ఎదుట హారజయిన ఏబీవీ, విచారణలో తాను నిర్దోషిగా వాదించుకునేందుకు పనికివచ్చే అన్ని డాక్యుమెంట్లు తెప్పించుకుంటున్నారు. వాటి ఆధారంగా సాక్షులను పిలిపించి, డిఫెన్స్ లాయర్ తరహాలో వాదనలు వినిపిస్తుండటం విశేషం. నిజానికి ఈ తరహా విచారణ వల్ల సాధారణ కోర్టులలో కంటే వేగంగా ఫలితాలు వచ్చే అవకాశాలు, బాధితుడే స్వయంగా ఎదుటి వారిని విచారించే వెసులుబాటు ఉంటుంది.

మార్చి 22 నుంచి కొనసాగుతున్న కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ లో విచారణ ఎదుర్కొంటున్న ఏబీ వెంకటేశ్వరరావు, ఇప్పటి వరకూ 21 మంది ఐపిఎస్, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను స్వయంగా విచారించి, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి 1100 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఏబీవీ విచారించిన వారిలో మాజీ డీజీపీపీ ఆర్పీ ఠాకూర్, మాలకొండయ్య, సాంబశివరావు కూడా ఉండటం విశేషం. వీరంతా ఏబీవీ ఎదుర్కొంటున్న పరికరాల కొనుగోళ్ల దుర్వినియోగం కేసులోని, కొనుగోళ్ల కమిటీలో ఉన్న వారే కావడం ప్రస్తావనార్హం.

వారితోపాటు..డీజీపీ స్థాయి అధికారి ద్వారకా తిరుమలరావు, సురేంద్రబాబు,  ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్,సీనియర్ ఐపిఎస్ అధికారులయిన  నళినీ ప్రభాత్, మహేష్ లడ్డా, భాస్కర్ భూషణ్, కుమార్ విశ్వజిత్, సంజయ్, బత్తిన శ్రీనివాసులు, సెంథిల్, డీజీపీ కార్యాలయ అధికారి గోవిందరాజన్, ఇంటెలిజన్స్ కార్యాలయ అధికారి భాస్కరశర్మ, జగన్నాధరావు, ఏసీబీ అధికారి సాయికృష్ణతోపాటు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అధికారి స్పార్టకస్‌ను.. స్వయంగా ఏబీ వెంకటేశ్వరరావు క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు తెలుస్తోంది. వీరంతా కొనుగోళ్ల కమిటీలో సభ్యులుగా ఉన్నందున, పరికరాలు కొనుగోలు చేశారా? మీ కమిటీ సమావేశాలకు తాను హాజరయ్యానా? కొనుగోళ్లకు సంబంధించి నిధులు ఏమైనా మంజూరు చేశారా? తన కుమారుడి కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వాలని కమిటీ ఏమైనా నిర్ణయించిందా? అన్న ప్రశ్నలను ఆయన,  ఆ కమిటీలో ఉన్న అధికారులకు వేసినట్లు సమాచారం.

అయితే.. కొనుగోళ్లకు సంబంధించి తనపై దేశద్రోహ ఆరోపణలు చేస్తూ ప్రకటన విడుదల చేసినందున, సీఎం సీపీఆర్‌ఓ పూడి శ్రీహరిని విచారణకు పిలవాలని ఏబీవీ,  గతంలోనే విచారణాధికారి సిసోడియాను  లిఖితపూర్వకంగా కోరారు. అయితే, తాజాగా విచారణాధికారి సిసోడియా, అందుకు లిఖితపూర్వక సమాధానాన్ని మెమో రూపంలో  ఏబీకి అందించారు. సీఎంసీపీఆర్‌ఓ..  తన వద్దకు వచ్చిన సమాచారాన్ని పంపించడమే తప్ప, మరే ఇతర పనులు చేయరని పేర్కొన్నారు. కాబట్టి ఆయనను పిలిపించడం వల్ల, విచారణకు పెద్దగా ఉపయోగం ఉండదని సిసోడియా స్పష్టం చేశారు. దీనితో ఏబీవీకి,  సీఎంఎంసీపీఆర్‌ఓను ప్రత్యక్షంగా విచారించే అవకాశం లేకుండా పోయింది.

అదేవిధంగా, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే రెండు కీలక ఫైళ్లు కావాలని ఏబీవీ తన విచారణ తొలిరోజుల్లోనే విచారాణాధికారిని లిఖిత పూర్వకంగా కోరారు. డీజీపీ కార్యాలయం, జీఏడీ కార్యాలయంలో ఉన్న రెండు కీలక ఫైళ్లను తనకు అందుబాటులో ఉంచాలని, వాటి ఆధారంగా మరిన్ని ప్రశ్నలు వేసే అవకాశం తనకు ఉంటుందని ఏబీవీ అభ్యర్ధించారు.  అయితే వాటిని ఇంకా ఆ రెండు విభాగాలు విచారాణాధికి ఇవ్వలేదని తెలుస్తోంది. సహజంగా తన వద్దకు వచ్చిన ఫైళ్లను, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి విచారణాధికారి వెంటనే అందిస్తారు. ఇప్పటిదాకా వాటిని ఏబీవీకి  ఇవ్వలేదంటే, ఇంకా అక్కడి నుంచి స్పందన లేదని స్పష్టమవుతోంది. అయితే, విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీ తనయుడు చేతన్‌ను మాత్రం, ఏబీ న్యాయవాది సుధాకర్‌రావు విచారించినట్లు సమాచారం.