విశాఖ ఉక్కు రక్షణ కోసం మహాకవాతు

0
109

విశాఖపట్నం, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదం మరోసారి మారుమోగింది. ఉక్కు పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమిస్తున్న కార్మిక, ప్రజా సంఘాలు తమ పోరాటానికి కొనసాగింపుగా నగరంలోని సాగర తీరాన ఆదివారం కదం తొక్కాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘ఉక్కు’ పిడికిలి బిగించి ‘మహా కవాతు’ చేపట్టాయి. ఈ కవాతులో సుమారు 2 వేల మంది అఖిలపక్ష కార్మిక, నిర్వాసిత సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలతోపాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. విశాఖ ఆర్‌కే బీచ్‌ నుంచి ఇవాళ మధ్యాహ్నం మొదలుపెట్టిన ఈ మహాకవాతు బీచ్‌లోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వరకు సాగింది. స్టీల్‌‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆపేది లేదని పలువురు కార్మిక సంఘాల నేతలు స్పష్టంచేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘మహాసభ’ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా కవాతు నిర్వహించినట్లు చెప్పారు. మరోవైపు, విశాఖ ఉక్కు నిర్వాసితుల సమస్యలపై సవివరంగా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ వెల్లడించారని నిర్వాసిత సంఘం నాయకులు మీడియాకు తెలిపారు. ఉక్కు నిర్మాణ సమయంలో స్వచ్ఛందంగా భూములిచ్చిన వారిలో ఇంకా 8500 మంది నిర్వాసితులకు ఆర్‌ కార్డులు మంజూరు చేసి ఉపాధి కల్పించలేదన్నారు. ఉక్కును ప్రయివేటీకరిస్తే తాము ఇచ్చిన భూములను యథాతథంగా వెనక్కి ఇవ్వాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు విరమించబోమన్నారు. అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధమేనన్నారు. పునరావాస (ఆర్‌) కార్డులు ఇచ్చిన వారిలో కొంత మందికే ఉపాధి కల్పించారని, మిగిలిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్వాసిత సంఘం నాయకులు చెప్పారు. నిర్వాసితుల ప్రస్తుత పరిస్థితి, ఇంకా ఎంత మందికి ఉపాధి కల్పించాలి? భవిష్యత్తు నియామక అంశాలపై సీఎండీతో చర్చించనున్నట్లు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారని ‘ఉక్కు’ నిరసనకారులు తెలిపారు. ఉక్కులో ఎన్ని ఖాళీలున్నాయి? ఇంత వరకు ఎంత మంది నిర్వాసితులకు ఉపాధి కల్పించారు? తదితర అంశాలపై ఆరా తీసిన తర్వాత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక పంపుతానని కలెక్టర్ పేర్కొన్నారని, ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్లనున్నామని వివరించారని పేర్కొన్నారు.