భారత్‌లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

470

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశ ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కొవిడ్‌ కేసులు సంఖ్యలో పెరుగుదల నమోదు కాగా, మరణాలు కొంతమేర తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 11.66 లక్షల పరీక్షలు నిర్వహించగా 93,249 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరింది. కొత్తగా 60,048మంది కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,16,29,289కు చేరి రికవరీ రేటు 93.36 శాతానికి పడిపోయింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 714 నమోదు కాగా శనివారం ఆ సంఖ్య కొంత తగ్గింది. మొత్తం 513 మంది కరోనాతో మరణించారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,64,623కు పెరిగింది. ఇక మరణాల రేటు 1.32 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 6,91,597కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ వేగంగా సాగుతోంది. గడిచిన 24గంటల్లో 27.38లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం టీకా అందిన వారి సంఖ్య 7,59,79,651కి చేరింది. మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు 49,447 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 277మరణాలు నమోదు కాగా, 37,821 మంది డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 29.53లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 24.95లక్షల మంది కోలుకోగా 55,656 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 4.02 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో సినిమా థియేటర్ల సీట్ల పరిమితిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో సీట్ల పరిమితిని 50 శాతానికి కుదిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వు చేసుకొన్న వినియోగదారులు నష్టపోతారంటూ కన్నడ సినీ పరిశ్రమ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడంతో ఈ ఆదేశాల అమలు తేదీని సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది. కాగా, కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో దాదాపు 4,373 వేల కేసులు నమోదయ్యాయి. కరోనాతో 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ వ్యాప్తి కట్టడి కావడంలేదు. తాజాగా దాదాపు 50 వేలకు చేరువగా రావడం కలకలం రేపుతోంది. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో 49,447 కొత్త కేసులు, 277 మరణాలు నమోదు కాగా 37,821 మంది కోలుకున్నారు. ఒక్క ముంబయి మహానగరంలోనే ఈ రోజు 9వేలకు పైగా కొత్త కేసులు, 27 మరణాలు నమోదైనట్టు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. అలాగే, మరో 5322 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు నగరంలో కోలుకున్నవారి సంఖ్య 3,66,365కి చేరింది. ప్రస్తుతం 62,187 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా 2,03,43,123 శాంపిల్స్‌ పరీక్షించగా 29,53,523 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 24,95,315 మంది కోలుకోగా 55,656 మంది మృతిచెందారు. ప్రస్తుతం 4,01,172 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ను తోసిపుచ్చలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. ప్రసుతం ఉన్న పరిస్థితులు ఇలానే ఉంటే ఆరోగ్య సౌకర్యాల కొరత ఏర్పడే ప్రమాదముందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో రోజుకు 2.2 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో 1 నుంచి 8తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసింది. వారందరినీ పైతరగతులకు ప్రమోట్ చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. 9, 11 తరగతుల విద్యార్థుల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ మళ్లీ డేంజర్‌ బెల్‌ మోగిస్తోంది. దీంతో క్రియాశీల కేసుల గ్రాఫ్‌ పైపైకి పోతోంది. నిన్న ఒక్కరోజే 89 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా వీటిలో 81.42% కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే వెలుగుచూడటం గమనార్హం. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 47,913 కొత్త కేసులు రాగా ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటక (4991), ఛత్తీస్‌గఢ్(4174)‌, ఢిల్లీ(3594), తమిళనాడు(3290), ఉత్తర్‌ప్రదేశ్‌(2953), పంజాబ్(2873)‌, మధ్యప్రదేశ్‌(2777) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ప్రకారం, దేశంలో ఇప్పటిదాకా 6,58,909 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీటిలో 3.91లక్షల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఇక్కడ ఫిబ్రవరి నాటికి 42,830గా ఉన్న క్రియాశీల కేసులు ఏప్రిల్‌ 3 నాటికి తొమ్మిది రెట్లు పెరిగాయి. అలాగే, కర్ణాటకలో ఆరు రెట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 8 రెట్లు, పంజాబ్‌లో 12 రెట్లు, ఢిల్లీలో 10 రెట్లు ఎగబాకాయి. మరోవైపు, క్రియాశీల కేసుల్లో 77శాతం కేవలం మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, పంజాబ్‌లలోనే ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 59.36 శాతంగా ఉన్నాయి. దేశంలోని 50శాతం యాక్టివ్‌ కేసులు కేవలం 10 జిల్లాల్లోనే ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల్లో 10.75% పుణెలో ఉండగా ఆ తర్వాత ముంబయి 8.75%, నాగ్‌పుర్‌ 7.71%, ఠానె 6.83%, నాసిక్‌ 5.66%, బెంగళూరు అర్బన్‌ 3.73%, ఔరంగాబాద్‌ 2%, ఢిల్లీ 1.82%, అహ్మద్‌నగర్‌ 1.74%, నాందేడ్‌ 1.67% చొప్పున ఉన్నాయి. కాగా, భారత్‌లో గడిచిన 24గంటల వ్యవధిలోనే 714 మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇవి కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమవడం ఉపశమనం కలిగించే అంశం. కొత్తగా నమోదైన మరణాల్లో 86శాతం మరణాలు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 481 మరణాలు నమోదు కాగా పంజాబ్‌ 57, ఛత్తీస్‌గఢ్‌ 43, యూపీ, మధ్యప్రదేశ్‌లలో 16 చొప్పున మరణాలు వెలుగుచూశాయి. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క మరణమూ నమోదు కాలేదు. ఈ జాబితాలో ఒడిశా, అసోం, లద్దాఖ్‌, దామన్‌డయ్యా, దాద్రానగర్‌, నాగాలాండ్‌, మేఘాలయా, మణిపూర్‌, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్‌, మిజోరం, అండమాన్‌ నికోబార్‌దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి. దేశంలో ఇప్పటిదాకా 24,69,59,192 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,23,92,260మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో 1,15,69,241మంది కోలుకోగా 1,64,110మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 6,58,909 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 93.36శాతంగా ఉండగా మరణాల రేటు 1.32శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 10,46,605 శాంపిల్స్‌ పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది.