పవన్ అజ్ఞానవాసి: మంత్రి నాని

396

అమరావతి, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి అద్దెమైకులా తయారయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఉత్తరాది భాజపా దక్షిణాదికి అన్యాయం చేస్తోందని గతంలో చెప్పిన పవన్‌ ఇప్పుడు ఆ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారని ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం కేసుల్లో భాజపా ప్రమేయం ఉందేమోననే అనుమానం తమకు ఉందని, అందుకే సీబీఐ విచారణ కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు. ‘‘పవన్‌కల్యాణ్‌ అజ్ఞాతవాసే కాదు, అజ్ఞానవాసి. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేసును సీబీఐ చూస్తుంటే పవన్‌ సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్‌ చదువుతున్నారు. భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ పంచాయతీ సర్పంచ్‌గా కూడా గెలవరు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయరు? విశాఖ ఉక్కును అమ్మేస్తామంటున్నా భాజపాను ఎందుకు ప్రశ్నించరు?’’ అని పవన్‌ను పేర్ని నాని నిలదీశారు. పవన్ కల్యాణ్ అద్దె మైక్‌లా తయారయ్యారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘‘2014లో బీజేపీకి తర్వాత టీడీపీకి ఓటు వేయాలని పవన్ అన్నారు. దక్షిణాదికి ఉత్తరాది వాళ్లు అన్యాయం చేస్తున్నారని పవన్ రంకెలేశారు. పాచిపోయిన లడ్డూను పవన్ తుడుచుకుని తింటున్నారా’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. వెంకన్న స్వామి ఎవరికి శిక్ష వేశారు? పవన్‌కు గుండు కొట్టిందెవరు? గత ప్రభుత్వ హయాంలో ఆలయాలను ధ్వంసం చేస్తే పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని దుయ్యబట్టారు. ‘‘పవన్‌కల్యాణ్ నిబద్ధత లేని నాయకుడు. కాపులపై గత ప్రభుత్వం కేసులు పెడితే పవన్ ఎందుకు మాట్లాడలేదు? చిరంజీవి తమ్ముడిగానే పవన్‌కు గుర్తింపు వచ్చింది. బీజేపీతో పవన్‌ కలిసే ఉన్నారు కదా హోదాపై ఎందుకు నిలదీయడంలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. అంతర్వేది రథం ఘటనలో బీజేపీ ఎందుకు సీబీఐ విచారణకు ఒప్పుకోలేదు? రథాలు దగ్ధం చేయడంలో బీజేపీ పాత్ర ఉందని, పవన్‌కల్యాణ్ మాటలతో అనుమానం కలుగుతోంది.’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.