తండ్రి నిర్ణయానికి తనయుడు అడ్డు?

339

మంగళగిరి, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో జరిగే పరిషత్ ఎన్నికల విషయంలో 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని స్పష్టంగా చెప్పారని, అయినా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో జరిగే ఎన్నికలలో స్థానిక నాయకుల అభిప్రాయం తెలుసుకోకుండా కార్యకర్తల అభిప్రాయం లేకుండా పోటీ చేయడం లేదని ఎన్నికలు బహిష్కరిస్తున్నామనే నిర్ణయం తీసుకున్నారా? తీసుకుంటే లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఏమిటి అని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

శనివారం మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ (ప్రెస్ క్లబ్‌)లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో గెలుపు, ఓటమి అనేవి సహజమని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంత దగ్గర అయితే అంత మంచిదని ఇది తెలిసి కూడా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. మొన్న జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని చూసిన చంద్రబాబు ప్రస్తుతం జరగబోయే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలలో అంతకు మించిన విజయం వైఎస్సార్సీపీ సాధిస్తుందని చంద్రబాబు భయపడ్డారని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్నారు. అందుకే ఆయన ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నామనే నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. చంద్రబాబుకు మతి భ్రమించింది అని ఇక రాజకీయాల నుండి ఆయన రిటైర్డ్ కావాలని అన్నారు. చంద్రబాబు ఎన్నికలను భహిష్కరిస్తున్నాం అని చెప్పాక లోకేష్ ఆదేశాలు లేకుండా దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం శాఖ పోటీ చేస్తామని చెప్పడం అనే నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆళ్ల ప్రశ్నించారు. దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే సమయంలో పూర్తి స్థాయిలో అవినీతి కార్యక్రమాలు జరిపే సత్తా లోకేష్‌కు ఉందని భావించారా? అని అన్నారు.

స్థానికంగా ఉండే పసువు వ్యాపారులు తేదేపాకు చెందిన వారని వారి ద్వారా కోట్లాది రూపాయలు డంపు చేసి అప్రజాస్వామిక విధానాల ద్వారా డబ్బు పెట్టి గెలవాలన్న వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? లేదా స్థానికులు భయపెట్టి బెదిరించి ఏదైనా చేయడానికి పూనుకున్నారా? అని అన్నారు. అలా చేసినా దుగ్గిరాల మండల ప్రజలు 18 ఎంపీటీసీ 16 నుండి 17 ఎంపీటీసీ స్ధానాలు వైకాపాకి ఇవ్వబోతున్నారని అలానే జడ్పీటీసీ స్ధానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానుకగా అందజేయనున్నారని అన్నారు. ఏదైఏమైనా తండ్రి నిర్ణయాన్ని కొడుకు ఏ విధంగా వ్యతిరేకిస్తారు? దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని తేదేపాని కోరుతున్నట్లు చెప్పారు. సమావేశంలో మంగళగిరి పట్టణ వైకాపా అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.