స్థానిక సంస్థలకు రూ.4,608 కోట్లు విడుదల

507

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): దేశంలోని వివిధ రాష్ట్రాల్లోగల పట్టణ, గ్రామీణ స్థానిక పాలన సంస్థలకు కేంద్ర ఆర్థిక సహాయం కింద ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం రూ.4,608 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,660 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.1,948 కోట్లు అందనుండగా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించింది. కాగా, దేశంలోని 28 రాష్ట్రాల్లోగల స్థానిక పాలన సంస్థలకు ఆర్థిక సహాయం కింద కేంద్ర ఆర్థికశాఖ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.87,460 కోట్లు విడుదల చేసింది.

ఈ నిధుల నుంచి గ్రామీణ సంస్థలకు రూ.60,750 కోట్లు, పట్టణ సంస్థలకు రూ.26,710 కోట్లు వంతున విడుదలయ్యాయి. గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధులు పంచాయతీ, సమితి, జిల్లాస్థాయిలోగల మూడంచెల స్థానిక పాలన సంస్థల కోసమేగాక ఆయా రాష్ట్రాల్లోని 5వ, 6వ షెడ్యూళ్ల కిందకు వచ్చే ప్రాంతాల కోసం ఉద్దేశించినవి. గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధుల్లో కొంత ప్రాథమిక/షరతుల్లేని సహాయం కాగా, మరికొంత మేర షరతులతో కూడుకున్న ఆర్థిక సహాయం. ప్రాథమిక నిధులను స్థానిక ప్రాధాన్య అవసరాల కోసం గ్రామీణ స్థానిక సంస్థలు వాడుకోవచ్చు.

ఇక షరతులతో కూడిన నిధులను (ఎ) పారిశుధ్యం, బహిరంగ విసర్జనరహిత (ఓడీఎఫ్) స్థితి నిర్వహణ (బి) తాగునీటి సరఫరా-వర్షజల సేకరణ, జల పునరుపయోగం తదితర మౌలిక అవసరాల కోసం మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2020-21 సంవత్సరంలో ప్రాథమిక ఆర్‌ఎల్‌బి గ్రాంట్ రూ. 32,742.50 కోట్లు, టై ఆర్‌ఎల్‌బి గ్రాంట్ రూ. 28,007.50 కోట్లు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మొత్తంమీద 2020-21లో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థికశాఖ అందించిన నిధుల్లో రూ.32,742 కోట్లు ప్రాథమిక ఆర్థిక సహాయం కాగా, మరో రూ.28,007.50 కోట్లు షరతులతో కూడిన సహాయం.

పట్టణ స్థానిక సంస్థలకు (ఎ) 10 లక్షల జనాభాకు మించిన (బి) 10 లక్షల జనాభాకులోపు పట్టణాల వర్గీకరణ కింద 2020-21లో కేంద్ర ఆర్థికశాఖ నిధులు విడుదల చేసింది. ఈ ప్రకారం 10 లక్షల జనాభాకు మించిన పట్టణ సంస్థలకు రూ.8,357 కోట్లు, 10 లక్షల జనాభాలోపుగల సంస్థలకు రూ.18,354 కోట్లు వంతున ఆర్థిక సహాయం లభించింది. కాగా, 10 లక్షల జనాభాకు మించిన సంస్థలకు బుధవారం రూ.1,824 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు మొత్తం షరతులతో కూడిన సహాయం కావడం గమనార్హం.

ఈ నిధులు పొందడం కోసం ఆయా పట్టణ స్థానిక సంస్థలు వార్షిక సగటు ధూళి సాంద్రత 10 పి.ఎం.- 2.5 పి.ఎం. మధ్య ఉండేవిధంగా నగరాల, ప్రాంతాలవారీగా వాయు నాణ్యత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించాలి. దీనికి సంబంధించిన ఆయా పట్టణ సంస్థలు సాధించిన మెరుగుదలను కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ పర్యవేక్షించి, అంచనా వేసి, అటువంటి నగరాలకు నిధుల విడుదల కోసం సిఫారసు చేస్తుంది. తదనుగుణంగా పరిసర వాయునాణ్యత పర్యవేక్షణ కోసం సంబంధిత నెట్‌వ‌ర్క్‌ ఏర్పాటుతోపాటు వనరుల కేటాయింపుపై అధ్యయనం నిర్వహిస్తూ, నగరాల్లో వాయునాణ్యత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరిస్తూంటుంది.

వాయునాణ్యత మెరుగుదలసహా జల సంరక్షణ, సరఫరా, నిర్వహణతోపాటు ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణతోనూ 10 లక్షల జనాభాకు మించిన నగరాలకు అందించే ఆర్థిక సహాయం ముడిపడి ఉంటుంది. ప్రణాళికబద్ధ పట్టణీకరణలో ఇవి కీలకం కావడమే ఇందుకు కారణం. ఈ విషయంలో కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఆ మేరకు నగరాలవారీ, సంవత్సరవారీ అభివృద్ధి లక్ష్యాల సాధనను అంచనా వేస్తూ ఆయా నగరాలకు నిధుల విడుదలపై సిఫారసు చేస్తుంది. నీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను పట్టణ స్థానిక సంస్థలు సాధించాల్సి ఉంటుంది.

కాబట్టి ఇందుకోసం కేటాయించిన నిధులను ప్రత్యేకించి సదరు అవసరాల కోసమే వాడుకోవాలి. రాష్ట్రాలు సామర్థ్య వికాసం దిశగా ఓ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించడంతోపాటు సేవా ప్రదానానికి సంబంధించిన ప్రమాణాలను అందుకునే విధంగా మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలి.

ఇక 10 లక్షల జనాభాలోపు నగరాలకు 2020-21లో కేంద్ర ఆర్థికశాఖ రూ.18,354 కోట్ల ఆర్థిక సహాయం విడుదల చేసింది. ఇందులో 50 శాతం షరతుల్లేని ప్రాథమిక నిధులు కాగా, మిగిలిన 50 శాతం (ఎ) తాగునీరు (వర్షజల సేకరణ, పునరుపయోగంసహా) (బి) ఘన వ్యర్థాల నిర్వహణతో ముడిపడిన నిధులు కావడం గమనార్హం. కాగా, స్వచ్ఛ భారత్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజూవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్‌) వంటి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద సమకూర్చిన నిధులకు ఈ కేటాయింపులు అదనం. ఆయా రాష్ట్రాలు ఈ ఆర్థిక సహాయాన్ని 10 పనిదినాల్లోగా నిర్దేశిత స్థానిక పాలన సంస్థలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అంతకుమించి ఏమాత్రం ఆలస్యం చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీతో కలిపి మరీ స్థానిక సంస్థలకు ఆ నిధులను అందజేయాల్సి వస్తుంది.