కరోనా టెస్టులపై స్పందన కరువు

354

మంగళగిరి, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): మంగళగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు కరోనా టెస్ట్ అందని ద్రాక్షలా మారింది. ప్రజలు టెస్టులు చేయించుకునేందుకు వస్తుంటే టెస్టులు నిర్వహించేందుకు ఎవరూ అందుబాటులో లేరని పురప్రజలు చెబుతున్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన వ్యక్తి గర్బవతికి కరోనా టెస్టు చేయించేందుకు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా టెస్టు నిర్వహించేందుకు ఎవ్వరూ అందుబాటులో లేరని తెలిపారు.

అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందిని టెస్టుల గురించి అడుగగా గుంటూరు నుండి సిబ్బంది వచ్చి ఇక్కడ టెస్టులు నిర్వహిస్తారని వారు ఎప్పడు వస్తారో తమకు తెలియదని చెప్పినట్లు తెలిపారు. కుప్పురావు కాలనీలోని పీహెచ్సీ సెంటర్లో చేస్తారని తెలపగా అక్కడి వెళ్ళానని అక్కడ టెస్టులు చేయడం లేదని ప్రభుత్వ వైద్యశాలలోనే చేస్తున్నారని తెలపగా తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విచారించగా ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని వాపోయారు. ప్రస్తుతం నిండునెలలు నిండిన గర్బినిలకు ప్రసవం సమయంలో కరోనా నెగిటీవ్ రిపోర్టు లేనిదే ఏవైద్యశాలలో చేర్చుకోవడం లేదని ఇక్కడ చూస్తే ఎప్పుడు వచ్చి టెస్టులు చేస్తారో కూడా తెలియదని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే మంగళగిరి పట్టణంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టుల సామర్థ్యం పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ పట్టీపట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. టెస్టులు నిర్వహించే సిబ్బంది ఎప్పడు వస్తారో కూడా తెలియకుండా భాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం సరైనది కాదని ప్రజల అభిప్రాయం. ఎన్నో సంవత్సరాలగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు, సిబ్బందికి బదిలీలు లేకపోవడం వలన సిబ్బందిలో కొంత భాధ్యతా రాహిత్యం పెరిగిందన్న విమర్శలు లేకపోలేదు.